Contributed by Shammu Shanmukh
చదువు అయిపోయిన 2 యేళ్ళకి కూడా ఖాళీ గా ఉన్నావ్ అన్న ఒక బాధ తో ఇంకెంత కాలం నా సంపాదన మీద పడి బ్రతుకుతావ్ అన్న.. ఒక్క మాట కి వెంటనే ఉద్యోగం తెచ్చుకున్న నువ్వు నచ్చినా నచ్చకపోయినా నా కోసం ఆ ఉద్యోగాన్ని చెస్తున్నావ్ అని తెలుసుకోలేకపోయా. నచ్చిన ఉద్యోగం రాక నచ్చని ఉద్యోగం చెయ్యలేక నాన కష్టాలు పడ్డావ్ ఈ నాన్న కోసం.
నాన్న నా వల్ల కావట్లేదు ఈ ఉద్యోగం చెయ్యటం అని చెప్పాల్సింది. చెప్పినా వినే పరిస్తితి లో లేను అనుకున్నావో ఏమో ఇంక చెప్పాల్సిన అవసరం లేనంత దూరన్ని ఎర్పరిచావ్ మన మధ్య. దగ్గర ఉన్నంత కాలం అర్దం చేస్కోలేదు ఇప్పుడు దూరం అయ్యాక అర్దం చేస్కుని ఉపయోగం లేదు. మనది మధ్య తరగతి కుటుంబం కదా సినిమా ల మీద పిచ్చి తో ఉద్యోగం లేకుండా అవకాశాలు కోసం తిరిగి చివరికి జీవితం నాశనం చేస్కుంటావేమో అన్న భయం తప్ప నీ కలల్ని నీలో ఉన్న కళల్ని చంపేద్దాం అన్న ఉద్దేశం లేదు.
నువ్వు చేతులు ఆడించిన మొదటి క్షణం నుండి అచేతనంగా పడి ఉన్న చివరి క్షణం వరకు కూడా నీ మీద నాకున్న ప్రేమని చాలా రకాలు గా చూపించా. కాని నువ్వు మాత్రం నీకు సినిమా ల మీద ఉన్న ప్రేమ ని ప్రాణం తీస్కుని చూపించావ్. ప్రాణం కన్నా ఏదీ విలువయినది లేదు అనుకున్నా కాని నీకు ప్రాణం కన్నా సినిమా విలువయిందని నీ ప్రాణం పోతే కానీ తెలియలేదు. నిద్ర లేవరా వెధవ అని నిన్ను తిడితే కాని నా రోజు మొదలవ్వదు.
అలాంటిది ఇంక లేవరా అని అరిచినా వినిపించనంత దూరం లో లేపినా లేవలేనంత గాఢం గా నిద్ర పోతున్నావ్. నువ్వు చనిపోయే ముందు వ్రాసిన ఉత్తరం చదివితే గాని నీ ఇష్టా ఇష్టాలు నాకు తెలియలేదు.. అంటే మన మధ్యన ఉన్న దగ్గర ఎంత దూరమో అర్ధం అయ్యింది. సినిమాల లోకి వెళ్ళాలి అనేది నీ ఆశయం అయితే నువ్వు ఎటువంటి ఇబ్బంది లేకుండా బ్రతకాలి అనేది నా ఆశ. నీ ఆశయానికి నా ఆశ లు అడ్డుపడ్డాయి. ఆశయం కోసం ఆశలు వదులుకునే వాళ్ళు ఉంటారు. ఆశలు కోసం ఆశయాలు వదులుకునే వాళ్ళు ఉంటారు కాని నువ్వు ఆశయాన్ని చేరుకోలేక ప్రాణాలు తీస్కున్నావు చూడు అందుకే నువ్వంటే కోపం నువ్వు అలా అవ్వటానికి కారణం అయిన నా మీద నాకు ఇంకా ఎక్కువ కోపం. నీ మీద కోపం వచ్చినా చూపించలేని పరిస్థితి నాది. నా మీద ప్రేమ ఉన్నా తిరిగిరాలేని పరిస్థితి నీది.