ఒక బ్రెయిన్ డెడ్ ఐన మనిషి తన అవయవాలతో దాదాపు 8 మంది ప్రాణాలను కాపాడగలరు, 50మంది ఆయుష్షును పెంచగలరు. 120 కోట్ల జనాబా ఉన్న మన భారతదేశంలో ఇప్పటికి లక్షలమందికి సరైన స్థాయిలో అవయవాల మార్పిడి చికిత్సలు జరగడం లేదు.. దాతలు ముందుకు రాకపోవడంతో ఏటా వేల సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నారు.. పోతున్న ప్రాణం మరొకరికి అందించడం అన్నది మానవత్వానికి ముడిపడి ఉన్న అంశం. ఇలాంటి అవయవ దాన సంఘటనే మన హైదరాబాద్ లో జరిగింది కాని ఇక్కడ సంతోషకరమైన విషయం ఏంటంటే తెలంగాణ ప్రాంతానికి చెందిన బాలాజీ హృదయాన్ని ఆంధ్ర ప్రాంతానికి చెందిన యువతికి అమర్చడం.
కాకినాడ ప్రాంతానికి చెందిన అరుణకు పెళ్లి జరిగి రెండు సంవత్సరాల బాబు ఉన్నాడు. అరుణకు నిండా 25 సంవత్సరాలు రాకముందే "డైలేటడ్ కార్డియో మయోపతి" అనే గుండె జబ్బుతో కొన్ని నెలలుగా బాధపడుతుంది. అతి త్వరగా గుండె మార్పిడి చేయకుంటే ప్రాణాలుపోయే పరిస్థితికి వచ్చింది.. తన బ్లడ్ గ్రూప్ కు మ్యాచ్ అయ్యే హృదయం దొరకక పోవడం కూడా మరొక ప్రధాన సమస్య. ఇదే సమయంలో జున్ 15న హైదరాబాద్ కు చెందిన బాలజీ రోడ్డు ప్రమాదం లో తీవ్రంగా గాయపడ్డారు కొన్నిరోజులు చికిత్స చేసిన ప్రయోజనం మాత్రం శూన్యం. బ్రెయిన్ డెడ్ అయినట్టు వైద్యులు గుర్తించారు.. సికింద్రాబాద్ యశోద హాస్పిటల్, జీవన్ దాన్ అనే స్వచ్చంద సంస్థ వారు బాలాజీ కుటుంబ సభ్యులకు పరిస్థితిని వివరించి మానవత్వంతో సహాయం చేయాలని అభ్యర్ధించారు. ఇందుకు బాలాజీ కుటుంబ సభ్యులు అవయవ దానానికి ముందుకొచ్చి అరుణ ప్రాణాలతో పాటు మరో ముగ్గురు ప్రాణాలను కాపాడి మంచి మనుషులుగా నిరుపించుకున్నారు.