ఒకరోజు నారద మహర్షి అడవిని దాటుకుంటూ ముందుకు వెళ్తున్నాడు, అలా వెళ్తున్న సమయంలో దారిలో ఒక ముని చెట్టు కింద కూర్చుని ఘోర తపస్సు చేస్తు కనిపించాడు. నారద మహర్షి ఉనికిని గమనించిన ఆ ముని వెంటనే కళ్ళు తెరిచి నారదునితో ఇలా మాట్లాడాడు. 'స్వామి మీరు భగవంతుని దర్శనానికి వెళ్తున్నట్టున్నారు. (అవునని మాటలతో కాకుండా నవ్వుతూ నారదుడు సమాధానమిచ్చాడు) మరింత ఆనందంతో తాను చేస్తున్న తపస్సు శ్రమను ఏకరువు పెట్టాడు.. 'నేను ఆ విశ్వంభరుడి దర్శనం కోసం గత రెండు జన్మల నుండి తపస్సు చేస్తున్నాను, ప్రస్తుతం ఇది నా మూడో జన్మ, కనీసం ఈ జన్మలోనైనా నాకు స్వామి వారు దర్శనం కల్పిస్తారా అనే అనుమానంతో నేను తపస్సును అంకిత భావంతో చేయలేకపోతున్నాను. ఎలాగూ మీరు భగవంతుని దగ్గరికి వెళ్తున్నారు కనుక నాకు ఆయన ఎప్పుడు సాక్షాత్కారం ఇస్తారో దయచేసి కాస్త కనుక్కోండి. అని ఆ ముని నారద మహర్షిని అభ్యర్ధించాడు. దానికి నారదుడు తప్పక కనుక్కుంటాను, అని అభయమిచ్చి ముందుకు కదిలాడు.
అలా కొంత దూరం ముందుకు కదిలాకా మరొక చెట్టు కింద ఒక యువకుడు ఏక్ తారను వాయిస్తూ నాట్యం చేస్తు కనిపించాడు. కాని ఇక్కడ మాత్రం నారదుడే ముందుగా ఆ యువకుని దగ్గరికి వెళ్ళి "చూడు బాబు.. నేను భగవంతుని వద్దకు వెళ్తున్నాను. నీవు భగవంతుడిని ఏమైనా అడగదలుచునేదుంటే నాకు చెప్పు నేను నీ తరుపున ఆ దేవదేవుడిని అడుగుతాను" ఇంతకు ముందే జన్మజన్మలుగా తపస్సు చేస్తున్న ఓ ముని దేవుడిని ప్రశ్నించవలసిందిగా నన్ను కోరాడు, నీ గురించి కూడా ఏమైనా అడగాలంటే చెప్పు నేను అడుగుతా అని అన్నాడు. కాని ఆ యువకునిలో ఏ విధమైన ప్రతిస్పందన లేదు, పూర్తి అంకిత భావంతో నాట్యాన్ని కొనసాగిస్తున్నాడు. నారదునికి విషయం అర్ధం అయ్యి ముందుకు వెళ్ళాడు.
కొన్ని రోజులకు భగవంతుని దర్శనం తర్వాత నారదుడు తిరిగి అదే దారిలో వస్తున్నాడు. నారదుని రాకను గమనించిన ఆ ముని తీవ్రమైన ఆరటంతో పరిగెత్తుకుంటూ వచ్చి నారదుడుని చేరుకున్నాడు. నారదుడు ఆ ముని కళ్ళల్లోని ఆరాటాన్ని చూస్తు "నీ గురించి అడిగాను నువ్వు మరొక మూడు జన్మలు తపస్సు చేస్తేగాని దర్శనమివ్వనని భగవానుడు సమాధానమిచ్చాడు". ఆ ముని ఆశకు నిరాశ ఎదురయ్యే సరికి ఆగ్రహం కట్టలు తెంచుకుంది. అసహనంతో ఊగిపోతూ మెడలోని రుద్రాక్షల దండను తెంచివేశాడు, విచక్షణ మరిచి అక్కడే ఉన్న దేవుని చిత్రపటాన్ని చించివేశాడు, మరో మూడు జన్మలా ఇది ముమ్మాటికి అన్యాయం అంటూ ఆ తపస్సును అంతటితో ముగించేసి వెళ్ళిపోయాడు.
నారదడు కొంతదూరం నడిచి ఆ యువకుడి దగ్గరికి వెళ్ళాడు.. ఆ యువకుడు మునపటి లాగే అదే అంకిత భావంతో ఏక్ తార ద్వారా సంగీతాన్ని పలికిస్తూ అద్భుతంగా నాట్యం చేస్తున్నాడు. నారదుడు అతని దగ్గరికి వెళ్ళి "నువ్వు నన్ను అడగకపోయినా నీకోసం భగవంతుని నుండి ఒక సందేశాన్ని తీసుకువచ్చాను, "నీవు ఏ చెట్టు నీడలోనైతే నాట్యం చేస్తున్నావో ఆ చెట్టులో ఎన్ని ఆకులుంటాయో అన్ని ఆకుల సార్లు జన్మలు ఎత్తాల్సి ఉంటుంది అప్పటికి కాని నీకు తన దర్శనం సంభవించదని భగవంతుడు నాతో చెప్పాడు". దానికి ఆ యువకుడు మరింత ఉత్సాహంతో నాట్యం చేయడం మొదలుపెట్టాడు.
నాట్యం చేస్తునే ఆ యువకుడు నారదునితో.. "చాలా తొందరగానే నేను భగవంతుడుని చూడబోతున్నాననమాట". ఆ మాటలు నారదుడికి అర్ధంకాక ప్రశ్ననిండిన చూపుతో ఆ యువకుడిని చూసేసరికి ఆ యువకుడు "ఈ అడవిలో వేల చెట్లు ఉన్నాయి కాని నేను కేవలం ఈ ఒక్క చెట్టులోని ఆకులన్ని సార్లు జన్మిస్తే సరిపోతుంది, అంటే నేను ఇక్కడి వేల చెట్ల ఆకులన్ని సార్లు జన్మించాల్సిన పనిలేదు. ఇది నాకు మహాదానందం కలిగించే వాక్కు. నేను ధన్యుడిని, ఈసారి భగవంతుని దర్శనానికి మీరు వెళ్ళినప్పుడు నా తరుపున ఆయనకు కృతజ్ఞతలు తెలపండి అని మాట్లాడడం ఆపేసి తన నాట్యంలో నిమగ్నమయ్యాడు.