Contributed by బాబు కోయిలడా
మన తెలుగు దర్శకుల్లో కె.విశ్వనాథ్, రామ్ గోపాల్ వర్మ, రవిరాజా పినిశెట్టి , దాసరి నారాయణరావు లాంటి దర్శకులు.. ఇతర భాషా చిత్రాలకు కూడా దర్శకత్వం వహించి సూపర్ హిట్స్ సొంతం చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. ఇటీవలే “అర్జున్ రెడ్డి” దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కూడా.. ఆ సినిమా హిందీ రీమేక్ “కబీర్ సింగ్”కు దర్శకత్వం వహించి మరో సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు.
ఇక ఇతర భాషా దర్శకుల విషయానికి వస్తే... పి.వాసు, భారతీరాజా, ప్రియదర్శన్, కె.ఎస్. రవికుమార్, మురుగదాస్, సముద్రఖని, ఎస్.జె.సూర్య లాంటి డైరెక్టర్స్ తెలుగులో కూడా దర్శకత్వం వహించి మంచి సూపర్ హిట్స్ అందించారు. అయితే తమ భాషా చిత్రాలు చేస్తూనే.. తమ కెరీర్‌లో కేవలం ఒకే ఒక్క తెలుగు చిత్రానికి దర్శకత్వం వహించిన డైరెక్టర్స్ కూడా కొందరు ఉన్నారు. వారి జాబితా మీకోసం ప్రత్యేకం
గౌతమ్ ఘోష్ –
ప్రముఖ బెంగాలీ దర్శకుడు మరియు డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్ గౌతమ్ ఘోష్.. హిందీలో పార్, గుడియా, యాత్ర లాంటి ప్రయోగాత్మక చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఆయన దర్శకత్వం వహించిన ఏకైక తెలుగు చిత్రం “మా భూమి”.. 1980 సంవత్సరంలో విడుదలైంది. ఈ సినిమా తెలంగాణ సాయుధ పోరాటాన్ని ప్రతిబింబించడం విశేషం.

మణిరత్నం –
తమిళంలో రోజా, బొంబాయి, అంజలి, నాయకన్, దళపతి లాంటి సూపర్ హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించిన మణిరత్నం తెలుగులో కేవలం ఒకే ఒక చిత్రానికి దర్శకత్వం వహించారు. ఆ చిత్రం పేరే “గీతాంజలి“. అక్కినేని నాగార్జున హీరోగా నటించిన ఈ విషాధభరిత ప్రేమకథ ఎంత పెద్ద హిట్ అయ్యిందో మనకు తెలియంది కాదు. బాలు మహేంద్ర – తెలుగులో శంకరాభరణం, మనవూరి పాండవులు, తరం మారింది లాంటి సినిమాలకు సినిమాటోగ్రఫర్‌గా పనిచేసిన బాలు మహేంద్ర ఓ తమిళ వ్యక్తి. శ్రీలంకలో పుట్టి పెరిగారు. ఈయన దర్శకత్వం వహించిన ఏకైక తెలుగు చిత్రం “నిరీక్షణ” సూపర్ డూపర్ హిట్ అయ్యింది.

మహేష్ భట్ –
బాలీవుడ్‌లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించిన మహేష్ భట్.. తెలుగులో దర్శకత్వం వహించిన ఏకైక చిత్రం.. నాగార్జున నటించిన “క్రిమినల్”. తెలుగు, హిందీ భాషలలో ఒకేసారి ఈ సినిమా తెరకెక్కింది. ఈ చిత్రం తెలుగు వెర్షన్‌కి టి.సాయినాథ్ సంభాషణలు రాయగా.. హిందీ సంభాషణలను జయ్ దీక్షిత్ రాశారు.

ప్రతాప్ పోతన్ –
“మరో చరిత్ర“ సినిమాతో బాగా ఫేమస్ అయిన నటుడు ప్రతాప్ పోతన్. నెగటివ్ రోల్స్ చేయడంతో పాటు సహాయ నటుడిగా కూడా రాణించిన ఆయన.. తమిళంలో పలు హిట్ చిత్రాలకు కూడా దర్శకత్వం వహించారు. తెలుగులో ఆయన దర్శకత్వం వహించిన ఏకైన చిత్రం.. నాగార్జున నటించిన “చైతన్య“

ఫాజిల్ -
తమిళంలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించిన డైరెక్టర్ ఫాజిల్.. తెలుగులో మాత్రం ఒకే ఒక్క చిత్రానికి దర్శకత్వం వహించారు. అదే అక్కినేని నాగార్జున నటించిన హిట్ చిత్రం “కిల్లర్”

ఉపేంద్ర –
కన్నడ నటుడు ఉపేంద్ర నటించిన సినిమాలు అనేకం తెలుగులో కూడా డబ్ అయ్యి సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. అలాగే ఉపేంద్ర తెలుగులో కూడా అనేక సినిమాలలో నటించారు. అలాగే ఓ తెలుగు సినిమాకి కూడా దర్శకత్వం వహించారు. ఆ సినిమా పేరే “ఓంకారం”. రాజశేఖర్ ఈ చిత్రంలో హీరోగా నటించారు. ఉపేంద్ర కన్నడ చిత్రం “ఓం”కి రీమేక్ ఈ చిత్రం.

విష్ణువర్థన్ –
తమిళంలో కురుంబు, బిల్లా, సర్వం లాంటి సినిమాలకు దర్శకత్వం వహించిన విష్ణువర్థన్ తెలుగులో మాత్రం కేవలం ఒకే ఒక చిత్రానికి దర్శకత్వం వహించారు. ఆ చిత్రమే పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన “పంజా“

ధరణి –
తమిళంలో దిల్, గిల్లి, దూల్ లాంటి హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించిన ధరణి.. తెలుగులో మాత్రం ఒకే ఒక్క చిత్రానికి దర్శకత్వం వహించారు. అదే పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన “బంగారం”

అగస్త్యన్ –
తమిళంలో “కాదల్ కొట్టై” చిత్రంలో పాపులారిటీ సంపాదించుకున్న దర్శకుడు అగస్త్యన్. అజిత్ హీరోగా నటించిన ఈ చిత్రం తెలుగులో “ప్రేమలేఖ” పేరుతో డబ్ చేయబడి సూపర్ హిట్ అయ్యింది. ఆ తర్వాత ఎన్నో తమిళ హిట్ చిత్రాలకు డైరెక్షన్ వహించిన అగస్త్యన్ తెలుగులో మాత్రం కేవలం ఒకే ఒక చిత్రానికి దర్శకత్వం వహించారు. అదే రవితేజ నటించిన “ఈ అబ్బాయి చాలా మంచోడు”.

షాజీ కైలాష్ –
మలయాళ చిత్ర దర్శకుడు షాజీ కైలాష్ ఏకలవ్యన్, రుద్రాక్షమ్, అసుర వంశం లాంటి డిఫరెంట్ మూవీస్‌కి మలయాళంలో దర్శకత్వం వహించారు. ఆయన తెలుగులో దర్శకత్వం వహించిన ఏకైక చిత్రం “విష్ణు”. మోహన్ బాబు కుమారుడు విష్ణువర్థన్ బాబు తొలి చిత్రం ఇదే కావడం గమనార్హం.

సుబ్రహ్మణ్యం శివ –
తమిళంలో తిరుడ తిరుడి, పోరి, యోగి లాంటి చిత్రాలకు దర్శకత్వం వహించిన సుబ్రహ్మణ్యం శివ.. తెలుగులో మాత్రం ఒకే ఒక చిత్రానికి దర్శకత్వం వహించారు. ఆ చిత్రమే మంచు మనోజ్, సదా జంటగా నటించిన “దొంగ దొంగది”

పవన్ వడేయార్ –
కన్నడ దర్శకుడు పవన్ వడేయార్ గోవిందాయ నమహా, గూగ్లీ, జెస్సీ లాంటి సూపర్ హిట్ చిత్రాలకు ఆ భాషలో దర్శకత్వం వహించారు. ఆయన తెలుగులో దర్శకత్వం వహించిన ఏకైక చిత్రం మంచు మనోజ్ నటించిన “పోటుగాడు”.

కె.ఎస్.అదయమాన్ -
తమిళ చిత్ర దర్శకుడు అదయమాన్.. ఆ భాషలో పలు హిట్ చిత్రాలతో పాటు.. సల్మాన్, షారుఖ్ కలిసి నటించిన సూపర్ హిట్ హిందీ మూవీ “హమ్ తుమారే హే సనమ్”కి కూడా దర్శకత్వం వహించారు. అదయమాన్ తెలుగులో దర్శకత్వం వహించిన ఏకైక చిత్రం రాజశేఖర్ హీరోగా నటించిన “బొబ్బిలి వంశం”.
