The Untold Story Of How An Actress Was Left Alone After Death Is The Reality Behind TFI

Updated on
The Untold Story Of How An Actress Was Left Alone After Death Is The Reality Behind TFI

"టాలెంట్ సెకండరీ, కొత్తగా ఇండస్ట్రీలోకి రావాలంటే రెండు విషయాలకు సిద్ధపడాలి. అబ్బాయి ఐతే డబ్బుకి, అమ్మాయి ఐతే దెబ్బకి". - ఇండస్ట్రీలో పనిచేస్తున్న ఒక మిత్రుడు నాతో పచ్చిగా చెప్పిన మాటలు.

"క్యాస్టింగ్ కౌచ్ వల్ల అమ్మాయిల నిండు జీవితాలు నాశనం అవ్వడం మాత్రమే కాదు, గొప్ప సినిమాలు కూడా రావడం లేదు"

విజయ గారి గురుంచి కొంత తెలుసుకునబోయేముందు అందం గురుంచి కొంత చర్చించుకుందాం. తెల్లగా ఉన్న వల్లే శుభ్రంగా ఉన్నారని, అందంగా ఉన్నారని భావించి ఇండస్ట్రీలో కొంతమంది తెల్లగా, యూత్ ను రెచ్చగొట్టే ఫిజిక్ గల హీరోయిన్లను చూపిస్తూ కలెక్షన్లు రాబట్టుకోవాలని ప్రయత్నిస్తుంటారు. షాలిని(సఖి), ముత్యాల అరుణ(సీతాకోకచిలుక), సరిత(మరోచరిత్ర), అర్చన (నిరీక్షణ) లను ఒక్కసారి గమనిస్తే వారందరూ కూడా నల్లగానే ఉంటారు. వీళ్ళు చేసిన ప్రతి ఒక్క సినిమా కూడా చరిత్రలో నిలిచిపోయింది. ఎందుకంటే వారికి నటన వచ్చు కనుక. ఒకవేళ అందంగా ఉన్నవారికే అవకాశాలు ఇచ్చి, తనకెలాగూ నటన రాదు కాబట్టి కథను మార్చి ఫలానా అమ్మాయికి అవకాశం ఇచ్చి శారీరకంగా లోబరుచుకుందాం అని ఆ మహా దర్శకులు అనుకునేదుంటే ఈ రోజు అంతటి కళా కాండాలు మనం చూసే వారమా.? స్వచ్ఛమైన ప్రేమను వివరించిన ఆ సినిమాలు ఎంతమంది ప్రేమికులను కలిపిందో, సమాజాన్ని ఎంత ఈంఫ్లుఎంచె చేశాయోనని మనకు కొంత అవగాహన ఉంది..

అందమే పరమావధి కాదు అని నమ్మే విజయ గారికి చిన్నతనం నుండి సినిమాలన్నా, నటన అన్నా ఎంతో ప్రేమ. బహుశా ఆ లక్ష్యమే కావచ్చు తన పరిస్థితికి కారణం. మొదటి నిరాశే అమ్మ నాన్నల నుండి ఎదురయ్యింది, చక్కగా మేము చూసే అబ్బాయిని పెళ్ళిచేసుకుని కుటుంబంతో సంతోషంగా ఉండకుండా ఈ దిక్కుమాలిన ఆలోచనలేంటి అని వారి మాటను విననందుకు విజయ గారిని దిక్కులేనిదానిలా వదిలేశారు. జన్మనిచ్చినవారు వదిలేస్తే ఏంటి "కళామ్మ తల్లే నా తల్లి, సినీ పరిశ్రమే నా కుటుంబం" అని దాదాపు 10 సంవత్సరాల క్రితం హైదరాబాద్ కు చేరుకొని అవకాశాల కోసం ప్రయత్నించారు.

అవకాశాల కోసం ఒక్కోసారి పస్తులుండాల్సి వస్తుంది, స్టూడియోల చుట్టూ తిరగాల్సి ఉంటుంది అలాగే శరీరాన్ని అర్పించాల్సి కూడా ఉంటుందని ఇక్కడ అడుగుపెట్టిన కొద్దిరోజులకే తనకి తెలిసిపోయింది. కుటుంబంతో కలిసి ఉంటూ వారిని కూడా షూటింగ్ జరిగే ప్రాంతానికి తీసుకువచ్చినా వదలని కామాంధులు ఇక ఒంటరిగా ఉండే మహిళను వదలకుండా ఉండగలరా. ఊహించిన సంఘటనలే ఇక్కడ జరిగాయి అవకాశాలు ఇస్తామని. ఈ సినీ ప్రయాణంలోనే తనకో వ్యక్తి పరిచయమయ్యాడు.. జీవితాంతం తోడుగా, నీడగా ఉంటానని నమ్మించి పెళ్లి అనే మోసం చేశాడు. కొంతకాలం తర్వాత తెలిసింది పెళ్ళికి ముందే భర్తకి ఎయిడ్స్ ఉందని, అది తెలిసే తనని పెళ్లి చేసుకున్నాడని. అప్పటివరకు తన జీవితంలో అతిపెద్ద విషాదం "తల్లిదండ్రులు విజయగారిని వదిలేయడం". ఇప్పుడు అది చాలా చిన్నది.. ఎందుకంటే కూతురిని ఈ భూమి మీద ఒంటరిగా వదిలేయబోతుంది కనుక.

ఒక కాకి చనిపోతే మిగిలిన కాకులు ఆ ప్రదేశం చుట్టూ చేరి వాటి బాషలో విలపిస్తాయి. మరి మనుషుల సంగతేంటి.? దాదాపు 10 సంవత్సరాల నుండి ఇండస్ట్రీలో ఉంటూ సినీ, టీవీ పరిశ్రమలో చిన్న చిన్న క్యారెక్టర్లలో నటిస్తూ బ్రతుకుని లాగుతుంది. డైరెక్షన్ డిపార్ట్మెంట్ కో అసోసియేషన్ ఉంటుంది, నటులకో అసోసియేషన్ ఉంటుంది ప్రతి క్రాఫ్ట్ కో అసోసియేషన్ ఉంటుంది.. వేలు, లక్షలు పెట్టి మెంబర్ షిప్ తీసుకోండి మీ అన్ని రకాల సమస్యలకు మేము బాధ్యత వహిస్తామని చెప్పే పెద్ద మనుషులు ఏ ఒక్కరు తనకు అండగా నిలవలేదు. కనీసం చచ్చిన తర్వాత ఓ దిక్కులేని శవంగా మిగిలిపోయింది. అంత్యక్రియల భాగ్యానికి సైతం నోచుకోలేక ఓ పాలిథిన్ కవర్ లో రెండు రోజుల పాటు అలాగే ఉండిపోవడం.. ఇంతకంటే దారుణం ఏదైనా ఉంటుందా.. Serve Needy అనే స్వచ్చంద సంస్థ గౌతం గారు ముందుకు వచ్చి సాయి భవ్య గారి ఆర్ధిక సహాయంతో విజయ గారి అంత్యక్రియలు జరిగాయి. ఇండస్ట్రీలో మిత్రుల దగ్గరి నుండి తల్లిదండ్రులు, బంధువులు సైతం తనను కడసారి చూడడానికి రాలేదు.

ఒక్కసారి విజయ గారి ముఖాన్ని పరిశీలించి చూడండి. తనలో రెండు రకాల విషాదాలు ప్రస్పుటంగా కనిపిస్తాయి. మొదటిది "తన చావుకు ముందే ఇండస్ట్రీలో నటన పరంగా గొప్ప గుర్తింపును తీసుకురావాలన్న "లక్ష్యం" ముందుగానే చనిపోవడం. ఆ బాధను మోస్తూనే "మరో జన్మ అనేది ఉంటే ఓ జంతువుగా అయినా పుడతాను తప్ప ఓ మనిషిగా పుట్టకూడదు, మరీ ముఖ్యంగా ఆడదానిగా మాత్రం అస్సలు పుట్టకూడదని నిర్ణయం తీసుకోవడం..