నగరాల్లోని మహిళల కన్నా గ్రామీణ ప్రాంతంలోని మహిళలు కాస్త మొహమాటస్థులు. మాములు విషయాలే బయటకు చెప్పడానికి సిగ్గుపడుతుంటారు ఇంకా నెలసరి సమస్యలపై అంటే ప్రత్యేకంగా చర్చించుకోవాల్సిన పనిలేదు. ఐతే ఈ కారణం వల్ల అంతర్గతంగా ఒకరకమైన బిడియం ఏర్పడి మహిళల ఎదుగుదలకు ఆటంకం కలుగుతుంది. దీనిని ఒక మహిళగా రేనీ గ్రేసీ గారు గుర్తించి గ్రామీణ మహిళలకు అవగాహన మాత్రమే కాదు వారికి ప్రతి నెల శానిటరి న్యాప్ కీన్లను కూడా అందజేస్తున్నారు.
15 సంవత్సరాలుగా..
ఓ కార్పోరేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న రేనీ గ్రేసీ కు తన ఉద్యోగం ద్వారా వచ్చే సంపాదనను తన కోసం మాత్రమే కాదు సాటి మనుషులకు సైతం ఉపయోగపడాలని తపించేవారు. ఆ తపనకు ప్రతి రూపాలుగా పిల్లలకు స్కూల్ ఫీజులు చెల్లించడం, అనాథ, వృద్ధాశ్రమాల కోసం తన సహాయంతో పాటు, విరాలలు సేకరిస్తూ తన ఊహా పరిధిని మించి తన ప్రేమను చూపేవారు. ఆ ప్రయాణంలోనే నెలసరి సమస్యలపై గ్రామీణ మహిళలు ఎదుర్కుంటున్న ఇబ్బందులు గ్రేసీ గారికి బాధ కలిగించింది. అది మొహమాట పడాల్సిన విషయం కాదు దీనిపై మరింత అవగాహన కల్పించాలని "Dignity Drive" పేరుతో 2017లో ఓ సంస్థను స్థాపించారు.
మొదటిసారి:
మిగిలిన అన్ని ప్రాంతాల కన్నా హైదరాబాద్ రసూల్ పుర మురికివాడలోని మహిళలకు "డిగ్నిటీ డ్రైవ్" ముందుగా అవసరం ఉందని దాదాపు ఆరు నెలలు రీసెర్చ్ చేసి వారిలో సరైన అవగాహనను కల్పించి దాదాపు 150మంది మహిళలకు శానిటరీ న్యాప్ కిన్లను అందించారు. అక్కడితో ఆగిపోకుండా డిస్పోజ్ మిషిన్ ను కూడా ప్రత్యేకంగా గుజరాత్ నుండి ఇక్కడికి తెప్పించారు.
డిగ్నిటీ డ్రైవ్ ప్రారంభించి సంవత్సరం పూర్తికాకముందే రేనీ గ్రేసీ మరియు తన బృందం ఇప్పటివరకు దాదాపు పదివేల మందికి పైగా విద్యార్ధినులను కలిశారు. విద్యార్ధినులను పక్కకు పిలిచి రహస్యంగా చెప్పడంలా కాకుండా బహిరంగంగా ఒక వేదికను ఏర్పాటుచేసి పిల్లలకు మైక్ ఇచ్చి వారి ఆలోచనలను, ఇబ్బందులను అందరితో పంచుకోమని సూచిస్తుంటారు. అప్పటి వరకు కుటుంబం, సమాజం ద్వారా ఏర్పడిన భయం ఇలాంటి వేదికల ద్వారా వారిలోని అనవసర ఆందోళన తొలిగిపోయేది. సమస్యకు సరైన పరిష్కారం రావాలంటే దానిపై విస్తృతంగా చర్చ జరగాలి అంతేకాని రహస్యంగా దాచితే అంతర్గతంగా విస్తరించి మరింత పెరిగే అవకాశం ఉంది. రేనీ గ్రేసీ గారు మరియు వారి బృందం ఓ శక్తిగా ఏర్పడి "రహస్యం కాదు అది ప్రకృతి సిద్ధంగా మహిళలకు వచ్చే లక్షణం అని ఇలా బిడియాన్ని తొలగించి ఆరోగ్య సూచనలు అందించడం ఎంతో గొప్ప చర్య.