ఇక్కడ ఒక బండరాయి అచ్చం పాము లాగా కిలోమీటరుకు పైగా మెలితిరిగి ఉండడంతో ఈ ప్రాంతాన్ని పాంబండగా పిలవడం మొదలయ్యింది. పాంబండ రామలింగేశ్వర స్వామి దేవాలయం మన తెలంగాణ వికారాబాద్ జిల్లాలోని కుల్కచర్ల గ్రామం నుండి 2కి.మీ దూరంలో ఉన్నది. ఇక్కడ శివుడు రామలింగేశ్వర స్వామిగా పూజలందుకుంటున్నారు. సీతమ్మ తల్లిని అపహరించిన రావణుడిని వీరోచితంగా సంహరించిన తర్వాత రాముడికి బ్రహ్మ హత్యాపాపం చుట్టుకునే అవకాశం ఉందని మహర్షులు వివరిస్తారు. దానికి పరిహారంగా మహర్షుల సూచన మేరకు శ్రీరాముడు శివలింగాలను ప్రతిష్టిస్తుంటారు అందులో భాగంగానే త్రేతాయుగంలో శ్రీరాముడు స్వయంగా ఈ ప్రాంతంలో కూడా లింగాన్ని ప్రతిష్టించి పూజించారని ఇక్కడి స్థానికుల కథనం ద్వారా తెలుస్తుంది.
ఇక్కడి పాము ఆకారంలో ఉండే పెద్దబండ మొదట్లో ఏకశిలలో ఉండేది క్రమంగా ఇది రెండుగా చీలిపోయింది. ఈ బండ వెనుక భాగంలో ఉన్న పుట్టులింగం ప్రతి సంవత్సరం కొంత పెరుగుతుందని ఇక్కడికి ప్రతిసారి వచ్చే భక్తులు విశ్వసిస్తారు. ఇక్కడ మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన మరో విషయం ఇక్కడే ఉన్న నీటి గుండం గురించి. శ్రీరాముడు శివలింగాన్ని ఇక్కడ ప్రతిష్టించేటప్పుడు తన బాణాన్ని సంధించి కోనేటిని సృష్టించారని చెబుతారు. ఇక అప్పటి నుండి ఇందులో నీరు ఇంకిపోవడం లేదంటారు.
ఇక్కడ ప్రతి సంవత్సరం 12 రోజుల పాటు జరిగే ఉత్సవాలకు భక్తులు విశేషంగా లక్షల సంఖ్యలో తరలివస్తారు. శ్రీరామనవమి, పార్వతి పరమేశ్వరుల కళ్యాణం, రథోత్సవం అత్యంత వైభవంగా జరుగుతాయి. ఎక్కడైనా ఏ దేవాలయంలోనైనా భగవంతుని ఆనవాళ్ళు కనిపిస్తే ఆ దేవాలయానికి భక్తితో కూడిన పవిత్రత కనిపిస్తుంది అలాంటి పవిత్రతతో ఈ కోవెల కొలువై శోభిల్లుతుంది.