Contributed by Godavarthi Bharadwaj
ఈ కధ సుమారు 1987లో జరిగింది.
పాత్రలు: సారధి, శ్రీదేవి, ఒక దొంగ.
సారధి ఒక "మధ్యతరగతి" కుటుంబికుడు , గవర్నమెంట్ బ్యాంకులో చిరుద్యోగి. ఉద్యోగ నిమిత్తం "తల్లి తండ్రులని", "భార్యని" వదిలి, పొరుగూరిలో స్నేహితులతో ఉండేవాడు, పండకి, పబ్బానికి, ఇంటికి వెళ్తూ ఉండేవాడు.
అది సుమారు '1986', సంక్రాంతి పండగ సెలవలకి సొంత ఊరు వెళ్ళడానికి .. రిజర్వేషన్ కోసం బస్టాండ్ కి వెళ్ళాడు సారధి.
పండగ సమయం కావడంతో బస్సు ప్రాంగణం కిక్కిరిసింది.
చాల సమయం నుంచున్న తరవాత "రిజర్వేషన్" దొరికింది, హమ్మయ్య, అని బస్టాండ్ నుండి బయటకి వెళ్తున్న సమయంలో__
ఒక వ్యక్తి కొన్ని చీరలు పట్టుకొని అటు, ఇటు తచ్చాడుతూ కనపడ్డాడు. ఆ వ్యక్తి చూడ్డానికి చామంచాయగా, చెరిగిన జుట్టుతో, గళ్ళ చొక్కా, పై బటన్లు వదిలేసి, చూడడానికి దొంగవాలే ఉన్నాడు.
ఆ వ్యక్తి తనకి కనపడిన ప్రతివారి దెగ్గరికి వెళ్లి.. దొంగ: "అయ్యా, ఈ చీరలు నేను ఒకచోట కొట్టేసాను, దీని విలువ సుమారు '1500' ఉండచ్చు, కానీ మీకు 500కి ఇచ్చేస్తాను. మీరు కూడా ఇక్కడే చూసుకొని లోపల పెట్టేసుకోండి,ఎవరికీ చూపించద్దు"
బస్టాండ్ ప్రాంగణ ప్రయాణికులు: "పో పోవయ్య, నీకు మేమె దొరికమా! ఇంకోసారి కనపడితే పోలీసులకి పట్టిస్తాం జాగ్రత్త"
ఇది అంతా దూరం నుండి గమనిస్తున్న సారధి ఆలోచనలో పడ్డాడు!
విశ్లేషకుడు అనబడు నేను:
అవి మామూలు ఆలోచనలా మధ్యతరగతి ఆలోచనలు. లాభం అనే పదం వినగానే నాణ్యతను మధ్యలోనే వదిలే వెళ్లిపోయే ఆలోచనలు. పాపం ఆ నాణ్యత ఎంత బుంగమూతి పెట్టుకొని కూర్చున్న, పట్టించుకోవు ఆ మాయదారి ఆలోచనలు!! ఆ ఆలోచనలు ఏంటో చూడం పదండి.
సారధి అంతరంగం: "నెలసరి రాగానే ఉద్యోగం విలువ గుర్తొచ్చినట్టు, పట్టుచీర చూడగానే భార్య ప్రేమ గుర్తువచ్చింది సారథికి." విచిత్రంగా!!
"పెళ్ళైన తరవాత తనకి ఏమి ఇవ్వలేదు ఇప్పటిదాకా(బండెడు చాకిరి తప్ప). ఇప్పుడు పట్టుచీర కొనిస్తే, ఆ పిచ్చిది సంబర పడిపోతుంది".
"సరే , ఈ ముష్టి మొహంవాడి దెగ్గర ఎందుకు, పెద్దకొట్టుకు వెళ్లి మంచి చీర కొందాం దర్జాగా".
"దర్జాగానా! అని తన అంతరాత్మ గట్టిగా అరిచినట్టు వినిపించి. ఎందుకు అలా పిలిచిందా అని ఆలోచనలో పడ్డాడు సారధి"!!
ఆమ్మో, మనకి వచ్చే అర్ధసరి సంపాదనకీ పెద్ద కొట్టుకి వెళ్లడం కాదు కదా, చూస్తేనే బోల్డంత ఖర్చు,
చూస్తుంటే ఈ ముష్టి మొహమే బాగున్నట్టు అనిపిస్తోంది పైగా "1500 పట్టుచీర "500కి " వస్తోంది. ఇంక వాడు "ఎవడైతే", "ఎక్కడ కొట్టేస్తే" మనకి ఎందుకు. అని మనసులో అనుకొని,
ఆ దొంగ దెగ్గరికి వెళ్లి చీరని కొనుగోలు చేశాడు.
వెంటనే కనీసం లోపల సరిగ్గా పరిశీలించకుండా, ఎవరైనా చూస్తారేమో అన్న భయంతో చేతిలో ఉన్న "సూటుకేసిలో" పెట్టేసాడు.
ఆలా చీర సూటుకేసిలో పెట్టాడో లేదో, తన తల పైకి ఎత్తి ఏదో రాజ్యాన్ని గెలిచిన వాడిలా గర్వముతో నడవడం మొదలు పెట్టాడు.
"ఏమి సాధించాడు అని ఆలోచించకండి, మధ్యతరగతి మనుషులు గురు, భార్యకి సగం జీతంతో పట్టు చీర ప్రేమతో కొనడం కన్నా గొప్ప విషయం ఏముంటుంది".
ఇంటికి వెళ్ళగానే భార్యకి ఉత్తరం రాసాడు.
"ఉభయ కుసలోపరి, ఇక్కడ నేను క్షేమం, అక్కడ అందరూ క్షేమం అని తలుస్తాను, నీ ఆరోగ్యం ఎలా ఉంది? త్వరలోనే ఇక్కడ మంచి ఇల్లు తీసుకోని, నిన్ను ఇక్కడికి తీసుకోని వచ్చేస్తాను. అప్పటిదాకా నాన్నగారికి, అమ్మగారికి, బండెడు చాకిరి అనుకోకుండా వాళ్ళకి కొంచం చేతోడు వాతోడుగా((చాకిరి) ఉండు. సంక్రాంతి పండక్కి ఇంటికి వస్తున్నాను, రిజర్వేషన్ అయ్యింది. అన్నట్టు, చెప్పడం మర్చిపోయాను నీకోసం ఒక ఖరీదైన పట్టుచీర తీసుకున్నాను.
ఇట్లు, సారధి,"
"నీకోసం 'ప్రేమతో కొన్నాను' అని రాయబోయి, 'భర్తాహంకారానికి' లోనైనా వాడై 'ఖరీదైన పట్టుచీర' కొన్నాను" అని రాసాడు.
స్వతహాగా "మితభాషి" అయిన సారధి, ఉత్తరాన్ని కూడా మితంగానే ముగించాడు!!
" ఇట్లు సారధి"
అని ఉత్తరం చదివిన మరుక్షణం "భార్య" ఆనందానికి అవధులు లేవు. "ఆయనగారు నాకు కొత్త పట్టు చీర తెస్తున్నారు" అని ఇరుగు, పొరుగుకి, అత్త, మామలకి చెప్పింది.
సారధి మరసటి రోజు తన ఆఫీస్ సన్నిహితులకు బస్టాండ్ లో తను కొనుగోలు చేసిన చీర గురించి చెప్పాడు.
తన సన్నిహితులలో ఒకడైన సురేష్,
"సారధి గారు ఎందుకైనా మంచిది ఒక సారి, మన వీధి చివర టైలర్ కి ఆ చీరని చూపించండి, బట్ట మంచిదో కాదో చెప్తాడు" అన్నారు.
అనుకున్నదే తడువుగా, అందరు కలసి వీధి చివర టైలర్ దెగ్గరికి వెళ్లారు.
ఆ టైలర్ ఒక పావుగంట సేపు ఆ పట్టు చీరని గమనించి..బిగ్గరగా నవ్వి,
టైలర్: "సారూ, ఇది బొంతలు కుట్టుకునే పట్టా "సారూ", పట్టుచీర కాదు. మిమల్ని ఎవరో మాయ చేసి అమ్మేశాడు".
"సారథికి" ఒక్కసారి ఏం చేయాలో పాలుపోలేదు, మదిలో చాలా ఆలోచనలు!!
"ఉత్తరం పంపించేస కొనేసా అని, పోనీ కొత్తది కొందామా?? ఆమ్మో!! చేతిలో చిల్లి గవ్వ లేదు. ఎలా??
ఏం చేయాలో అర్ధంకాని సందిగ్ధంతో కాలం గడిపేశాడు, పండగ సమయం వచ్చేసింది, ఇంటికి బయలుజేరాడు,
ప్రయాణంలో మళ్ళి ఆలోచన
"పాపం ఎంతో ఆశతో ఎదురు చూస్తూ ఉంటుంది!! ఏమనుకుంటుందో, ఏమో"??
చివరిగా సొంత గ్రామానికి చేరుకున్నాడు.
చెప్పడం మరిచితిని!!
"సారధిది పెద్ద ఉమ్మడి కుటుంబం, 'తల్లితండ్రులు',' భార్య', 'అన్నయ, వదిన','పిల్ల, జెల్ల, మంచం, బల్ల' ఇలా అందరు కలిసే ఉంటారు".
ఇంటికి వెళ్ళగానే ఇంట్లో ఉన్న పిల్లలు అందరూ గుమ్మి గూడారు, వాళ్ళకోసం తెచ్చిన మిఠాయి పంచిపెట్టాడు సారధి
నెమ్మదిగా ఇంట్లోకి అడుగు పెడుతూ ఉంటె, తన భార్య ఎదురు వచ్చింది.
చాలా రోజుల తరవాత తన భార్యను చూసిన ఆనందంలో చీర విషయం మర్చిపోయాడు.
తనతో కాసేపు "మంచి, చెడులు", "కష్ట,సుఖాలు", మాట్లాడిన తరువాత శ్రీదేవికి తన చీర సంగతి గుర్తుకు వచ్చి,
"నాకోసం పట్టుచీర కొన్నాను అన్నారు కదా. ఏది"??అని అడిగింది శ్రీదేవి,
ఈలోగా అటుగా వచ్చిన సారధి అమ్మగారు,
సారధి అమ్మగారు: "ఏరా, మీ ఆవిడ కోసం ఖరీదైన చీర కొన్నావంట కదా, మాకు చూపించవూ???అని అడిగారు
సారధి అమ్మగారికి బస్టాండ్లో జరిగిన సంగతి మొత్తం వివరించాడు, వివరిస్తున్నంత సేపు అమ్మ వేపు చూస్తూ చెప్పాడు కానీ , వాళ్ళ ఆవిడ వేపు చూసే సాహసం చేయలేదు!!
మొత్తం జరిగిన సంఘటన చెప్పిన తరవాత వాళ్ళ అమ్మగారు, అక్కడ చుట్టు ఉన్నవారు సారధి అమాయకత్వాని గేలి చేసారు.
మనసు చివుక్కుమనడంతో, మరేమి మాట్లాడకుండా అక్కడ నుండి జారుకున్నాడు.
కాసేపటి తరవాత, సారధి ఎందుకో తన "సూటుకేసు" తెరిచి చూడగానే దాంట్లో తాను కొన్న పట్టు(బొంత)చీర కనపడలేదు.
తన భార్య తప్ప, అది ఎవరు తెరవరు కాబట్టి, ఆ చీర తనే తీసుకుంది అని అర్ధం అయింది సారథికి!!
ఈలోపల భోజనాల సమయం కావడంతో తన భార్య భోజనానికి పిలిచింది,
"విస్తరి" ముందు కూర్చున్న సారధి తన భార్యవైపు చూడకుండ, పండక్కని చేసిన భక్షాలు రుచి చూస్తూ
"శ్రీదేవి, సూటుకేసులో ఉన్న చీర, నువ్వు తీసుకున్నావా"!!
"అవును" అన్నట్టు "తల" ఊపింది శ్రీదేవి!!
సారధి": "సరే కానీ అది మంచి బట్ట కాదు, ఏదో పొరపాటున అలాంటి చీర తీసుకున్న, దసరా పండక్కి వచ్చినప్పుడు తప్పకుండా పట్టుచీర కొంటాను, ఈసారి మాత్రం పెద్ద షాప్ లోనే కొంటాను".
శ్రీదేవి: ఏవండీ మీరు పట్టు చీర తీసుకున్నాను అని ఉత్తరం రాసినప్పుడు తెగ సంబర పడింది "పట్టు చీర" కొన్నందుకే కాదు, ఆ పట్టు చీర కొనడం వెనక ఉన్న మీ ప్రేమకి,
మీకు వచ్చే "చిన్న జీతంలో" సగం జీతం విలువ కలిగిన "పట్టుచీర" కొన్నారు అంటే, ఆ కొనే సమయంలో, మీరు నాకోసం "ఖర్చుపెట్టిన ఆలోచన" అంటే నాకు "చాల ప్రేమ".
"మీరు ఎంతో ప్రేమతో కొన్న, ఈ చీరని ఎప్పుడు కట్టుకునే సాహసం చేయను కానీ,ఎప్పుడూ నాతో పాటే దాచుకుంటాను".
"తన భార్య మాటలు విన్నాక సారధి మోహంలో ఒక విచిత్రమైన నవ్వు వచ్చింది"
అంతేలేండి, 'మితభాషులు, ప్రేమ వ్యక్తపరిచే విధానం అలా విచిత్రంగానే ఉంటాయి'
ఆలా ఆ పట్టుచీరని, తన 'చివరి' వరకు తనతోనే దాచుకుంది శ్రీదేవి,
ఆ "అద్భుతమైన" భావాన్ని, ఇంకా తనలోనే ఉంచుకొని ప్రయాణం చేస్తున్నాడు సారధి!! ప్రయాణం చేయడమే కాదు, తన 'ప్రయాణంలో' పరిచయం అయిన ప్రతి 'వ్యక్తికి' తన లోలోపల భావాన్ని ఇంకా పంచుకుంటూనే ఉన్నాడు.
ఒక ఇద్దరు "వేరు, వేరు" వ్యక్తులు ఒకటిగా ప్రయాణం చేయడం అనే పదానికి, ఇంతకన్నా మంచి నిర్వచనం నాకు కనపడలేదు??
ఒక మనిషి వల్ల కలిగిన ఒక "అనుభూతి", ఆ మనిషి లేనప్పుడు, ఆ భావాన్ని ఇంకా మనం మోస్తున్నపుడు, అది కలిగించే "ఆనందం" అనిర్వచనీయం.