భగవంతుడు దాదాపు ప్రతిచోట ఎక్కువసార్లు ఒక కొండమీదనే ప్రతిమ రూపంలో వెలుస్తుంటారు. దీనికి ప్రధాన కారణం అలా ఎత్తులో ఉన్న తనని దర్శించుకోవడానికి మనిషిగా ఎంతో ఎత్తుకు ఎదిగితే తప్ప నన్ను నువ్వు చేరుకోలేవు అని భక్తులకు వివరిస్తున్నట్టుగా ఉంటుంది. శ్రీ మహా విష్ణువు దశావతారాలలో నాలుగో అవతారం నరసింహావతారం. నరసింహా స్వామి వారి కున్న మహిమాన్విత క్షేత్రాలలో ఒకటి ఈ పెంచలకోన నరసింహా స్వామి వారి దేవాలయం. నెల్లూరు జిల్లా కేంద్రం నుండి దాదాపు 70కిలోమీటర్ల దూరంలో ఈ గుడి ఉంది.


భక్త ప్రహ్లాదుడిని రక్షించడానికి శ్రీ మహావిష్ణువు ఉగ్ర నరసింహుని అవతారంలో వచ్చి హిరణ్యకసిపుని సంహారిస్తారు. ఆ తర్వాత నరసింహుడు వెలిగొండల అనే అడవిలో సంచరిస్తుండగ అదే సమయంలో చెంచురాజు కూతురు చెంచులక్ష్మి కూడా చెలికత్తెలతో సంచరిస్తుంది. నరసింహుడిని చూసిన చెలికత్తెలు భయంతో పారిపోగా చెంచులక్ష్మి మాత్రం స్వామి వారిని చూస్తూ ధైైర్యంగా అలానే ఉందట. ఇంతటి ధైర్యం గల స్త్రీ నే తనకు సరైన వధువు అని నమ్మి నరసింహా స్వామి వారు చెంచురాజుకు కప్పం చెల్లించి చెంచులక్ష్మిని వివాహం చేసుకున్నారట. ఆ తర్వాత ప్రతిమ రూపంలో ఇక్కడే స్వయంభూ గా వెలిశారని పురాణం.


అలాగే ఇక్కడ ఇంకో కథ ప్రచారంలో ఉంది.. పూర్వం ఇక్కడి కోనకు సమీపంలో ఒక గొర్రెలకాపరి గొర్రెలను మేపడానికి ఈ ప్రాంతానికి వచ్చాడు. కాసేపటికి విశ్రాంతి తీసుకుంటుండగా అక్కడికి ఒక వృద్ధుడి రూపంలో స్వామి వారు వచ్చి నరసింహాస్వామి ఇక్కడ వెలిశారని చెప్పాడట.. నువ్వు అక్కడికి వెళ్ళి దేవాలయాన్ని నిర్మించు అని చెప్పి వెనుతిరిగి చూడకుండా వెళ్ళాలని సూచించాడట.. కాని గొర్రెల కాపరి కొంతదూరం వెళ్ళాక వెనక్కి తిరిగి చూశాడట. అలా వెనక్కి తిరిగి చూడడంతో స్వామి వారు విగ్రహంగా మారారని స్థానికంగా ప్రచారంలో ఉన్న కథ.


పూర్వం కారణజన్ములు కణ్వమహర్షి ఇక్కడే తపస్సు చేసేవారంటారు. ఆ తపస్సు ద్వారా నరసింహా స్వామి వారిని దర్శించారని పురాణం ద్వారా తెలుస్తుంది. కణ్వ మహర్షి ఆశ్రమం పక్కన ఉన్న ఏరుని మొదట కణ్వలేరు అని ఆ తర్వాత కాలక్రమంలో కండలేరుగా మారింది. తిరుమలలో శ్రీనివాసుని బ్రహ్మోత్సవాలు నిర్వహించినట్టుగా ఇక్కడ ఏప్రిల్, మే నెలలో బ్రహ్మోత్సవాలు జరుగుతుంటాయి. ఈ ఉత్సవాలకు భక్తులు మన తెలుగు రాష్ట్రాల నుండి వేల సంఖ్యలో వస్తుంటారు.


Also, do SUBSCRIBE to our YouTube channel to get more awesome video content delivered right into your inbox.