ఫణి కాస్త భిన్నం.. ఎంతంటే..!! అందరూ తోటి క్లాస్ మేట్స్ తో కలిసి లంచ్ బాక్స్ షేర్ చేసుకుంటుంటే ఫణి మాత్రం స్కూల్ లో పనిచేసే ఆయాలతో కలిసి భోజనాన్ని పంచుకునేవాడు.. అమ్మానాన్నల దగ్గర డబ్బులు తీసుకుని తమకు నచ్చిన ఫుడ్, ఆట వస్తువులను కొనుక్కునే వయసులో మరేమీ ఆలోచించకుండా ఉన్న ఆ కాస్త డబ్బును కూడా పేదవారికి ఇచ్చేవాడు.. ఎక్కడో కూర్చుని ఆలోచనలలోనే బ్రతకకుండా అబ్దుల్ కలాం గారిని కలిసే దేశ భవిషత్తుకు సంబంధించిన విలువైన సూచనలు పంచుకునేవాడు.. ఫణి ఒక మంచి మనిషి, శ్రేష్టమైన వ్యక్తిత్వం, నిండైన దూరదృష్టితో 25 సంవత్సరాలు నిండకుండానే సుమారు 50,000 మందికి ఉచితంగా కెరీర్ కౌన్సెలింగ్ ఇచ్చి వారి జీవితాలను ప్రత్యక్షంగా మార్చిన స్నేహితుడు.

ఫస్ట్ నుండి ఫస్టె: ఫణి గారికి సహజంగా నాయకత్వ లక్షణాలు చిన్నతనంలోనే సంభవించాయి. ఫస్ట్ అంటే మార్క్స్ పరంగా కాదు, నాయకత్వం పరంగా. ఫణి కి 80%-85% లో మార్కులు వస్తుండేవి, 95% మార్కులు వచ్చే విద్యార్థులు కూడా ఫణిపై గెలిచేవారు కాదు. ఫస్ట్ క్లాస్ నుండి 9th వరకు అతనే క్లాస్ లీడర్. (10th లో మార్క్స్ పరంగా ఎన్నిక ఉండడంతో ఆ ఒక్క సంవత్సరమే అతను ఎన్నిక కాలేదు). ఈ లీడర్ ని నిర్ణయించేది టీచర్ కాదు, తోటి క్లాస్ మేట్స్ అందరూ ఓట్స్ వేస్తేనే ఎన్నిక జరిగేది. ఇన్ని సంవత్సరాలు అతనే ఎందుకు లీడర్ అవుతున్నాడంటే "క్లాస్ లో కానీ స్కూల్ లో కానీ, స్టూడెంట్స్ కూ ఏ ఇబ్బందులు రాకుండా చూసుకుంటూ ఉండడం వల్లనే పిల్లలు మరో నాయకుడి కోసం ఎదురుచూసేవారే కాదు".

18 సంవత్సరాలలోనే బాల్యవివాహాలు ఆపగలిగారు: ఫణి కి ఒకేసారి రెండు మూడు పనులు చేయడమంటే చాలా ఇష్టం, అందుకే ఇంటర్మీడియట్ తర్వాత ఒకేసారి ఇంజినీరింగ్, బీకాం చేశారు. ఇలా చదువుకుంటూనే వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేవారు కూడా.. 2010 లో ప్రజ్వల ఫౌండేషన్ ద్వారా సునీత కృష్ణన్ గారు వివిధ కాలేజీలు, స్కూళ్లకు వెళ్లి "విద్యార్థినులకు ఉన్న సమస్యలను ఒక పేపర్ మీద రాసి ఇవ్వండని కోరారు, ఇలా రాయించడం వల్ల పైకి చెప్పడానికి సిగ్గుపడే ఆడపిల్లలు స్వేచ్ఛ గా వారి సమస్యలను వివరించగలుగుతారని ఒక నమ్మకం", ఈ పేపర్ చదివే వాలంటీర్లలో ఫణి కూడా ఒకరు.. ఫణి ఒక్కడే 4,000 మంది పిల్లలు రాసిన సమస్యలను చదివారు. అందులో ముగ్గురు ఆడపిల్లలు ఎవ్వరికి చెప్పాలో తెలియక "మాకు ఫలానా రోజు పెళ్లిచేయబోతున్నారు దయచేసి మమ్మల్ని కాపాడండి" అని రాశారు. ఫణి వెంటనే పిల్లల ఇళ్లకు వెళ్లి మూడు బాల్యవివాహాలు కాకుండా ఆదుకున్నారు.

2011 నుండి ఉచిత కెరీర్ కౌన్సెలింగ్: మన భారతదేశం లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఉన్న ప్రధాన సమస్య "అనుమానం". అది ఉద్యోగంలో కావచ్చు, పర్సనల్ లైఫ్ లో కావచ్చు, కెరీర్ విషయంలో కావచ్చు. చిన్నతనం నుండే పిల్లలకు సరైన అవగాహన కల్పిస్తే కనుక వారి భవిష్యత్తు ఆత్మవిశ్వాసంతో అడుగులు పడుతాయని ఫణి ఆలోచన. దాన్ని అమలు చేయడానికి 2011 నుండి తన కెరీర్ మొదలయ్యింది.. ప్రస్తుతం ఎన్ని రకాల కెరీర్ ఆప్షన్స్ ప్రస్తుతం ఉన్నాయి.? వాటిని ఎలా రీచ్ కాగలుగుతాము.? పేద, మధ్య తరగతి వారికి ఎలాంటి స్కాలర్ షిప్ అందుబాటులో ఉన్నాయి.? మొదలైన అన్ని విషయాలను తెలుసుకుని, నిపుణుల సలహాలు తీసుకుని యువ వారధి టీం ద్వారా తన ప్రయాణం మొదలయ్యింది.


యూత్ కెరీర్ ఎంచుకుంటున్నది పేరెంట్స్ ఫోర్స్ మూలంగానా.? కోర్స్ కు ఉండే డిమాండ్ ని చూసా.? అసలు ఎంతమంది తమకు నచ్చిన కోర్స్ చేస్తున్నారు.. ఎంతమందికి ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉంది.? వీటన్నిటి మీద ఫణి కి పూర్తి అవగాహన ఉంది. ఫణి అబ్దుల్ కలాం గారిని తండ్రిలా భావిస్తారు, 2015లో కలాం గారు చనిపోయిన క్షణంలో విపరీతంగా బాధపడ్డారు, ఆ తర్వాత కలాం గారి ఆశయాలు కొనసాగిస్తే కనుక కలాం గారికి మరణం అనేది ఎప్పుడూ ఉండదని అప్పటి నుండి ఆశయాలను మరింత ముందుకు తీసుకువెళ్తున్నారు. తనకు అందుబాటులో ఉన్న వనరుల ద్వారా ఫణి ఇప్పటివరకు వివిధ ప్రభుత్వ, ప్రయివేట్ స్కూళ్లు, కాలేజీలకు తిరిగి పిల్లలకు విలువైన కెరీర్ కౌన్సెలింగ్ ఇచ్చారు. అంతే కాకుండా తన టీం "యువ తిరంగ్" తో కలిసి హైదరాబాద్ లోనే ఉచితంగా వివిధ కోర్సులు నేర్పిస్తున్నారు. ఒకప్పుడు ఫణి 800 మందికి కౌన్సెలింగ్ ఇస్తే, ఫణి తో కలిసి పనిచేసే వాలంటీర్లు 800 కు పైగా ఉన్నారు.

ఒకప్పుడు మొదట నా దేశం, తర్వాత నా కుటుంబం, ఆ తర్వాతే నేను.. కానీ ఇప్పుడు మాత్రం మొదట నేను, తర్వాత నేను, ఆ తర్వాత కూడా నేను, ఆ తర్వాతనే కుటుంబం దేశం ఇంకెవరైనా!! ఇలా మారిపోతున్న సమాజంలో ఫణి మన మధ్య ఉండడం ఒక పెద్ద రిలీఫ్!! పిల్లలను కెరీర్ పరంగా ఉన్నతులను చెయ్యడం వరకే కాదు దేశం గర్వించదగ్గ పౌరుడిగా వారిలో బీజాలు నాటడానికి కూడా అతని ఎజెండాలో ప్రధాన భాగం.