ఉసులుమర్రు గ్రామ జనాభా 2400 మంది ఇందులో పచ్చడి తయారుచేస్తున్న వారు ఎంతమందో తెలుసా 1800 మంది. ఒక ఊరిలో దొరికే ఖనిజలవనాలను బట్టి ఆ ఊరి ప్రజల జీవితం ఆధారపడి ఉంటుంది. పశ్చిమగోదావరి జిల్లా ఉసులుమర్రు గ్రామ ప్రజలు మాత్రం ఊరు ఊరంతా ఏ కంపెనీ కోసం, ఏ యజమాని కోసం ఎదురురుచూడకుండా చిన్నపాటి లౌక్యంతో స్వయం ఉపాధిని కల్పించుకున్నారు. అందుకనే ఉసులుమర్రు గ్రామం ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో ఒక బ్రాన్డ్ గా రూపాంతరం చెందింది.
ఎక్కడ లాభం ఉంటుందో అక్కడ అనుకరణ ఉంటుంది. ఇదే గ్రామంలో పిల్లా పెదాకాపు కుటుంబం వారు మొదటిసారిగా పచ్చళ్లను తయారుచేయడం మొదలుపెట్టారు. వారిని చూసి మంచి లాభాలు, మిగులు ఉండడంతో వారి బంధువులు కూడా మొదలుపెట్టారు. అలా ఒకరిని చూసి మరొకరు అదే పనిని నేర్చుకుని స్వంతంగా తయారుచేస్తూ ఈ రంగంలోకి దిగారు. ఉసులుమర్రు లో పచ్చళ్ల తయారీ 40 సంవత్సరాల నుండి మొదలయ్యింది. సుమారు 200 కుటుంబాలకు పైగానే ఈ చిరు వ్యాపారాన్ని చేస్తున్నారు.
కేవలం సీజన్ విషయంలో మాత్రమే కాదండి ఏడాది పొడుగూతా మామిడి, ఉసిరి, నిమ్మ, టమాట, అల్లం, గోంగూర, పండుమిరప, దబ్బ లాంటి పచ్చళ్లనీటిని వీరు పెడతారు. చేసిన పచ్చళ్లను అమ్మే బాధ్యత కూడా వీరే చూసుకుంటారు. తయారుచేసిన పచ్చళ్లను కిరాణా షాపులో అమ్మడం, లేదా ఇంటింటికి తిరిగి అమ్మడం మొదలైన పద్దతులలో అమ్మకాలు జరుపుతారు. ఇక్కడి చిరు వ్యాపారులు వారి సమస్యలు, ఐక్యత పెరగడం కోసం ఒక సంఘంలా ఏర్పడ్డారు. ఏవైనా ఇబ్బందులు ఎదుర్కుంటే కనుక సంఘం తరుపున పోరాడి సమస్యలు పరిష్కరించుకుంటారు.
పశ్చిమగోదావరి జిల్లా తణుకు నుండి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉసులుమర్రు గ్రామానికి ఈ బ్రాన్డ్ ఇమేజ్ రావడానికి గల ప్రధాన కారణం రుచి, నాణ్యత. ఇక్కడ నివసించే ప్రతి కుటుంబానికి దాదాపు 5 నుండి 40 సంవత్సరాల విలువైన అనుభవం ఉండడంతో పచ్చడి ఎక్కువ కాలం రుచిగా ఉండేందుకు తగిన జాగ్రత్తలు తీసుకుంటారు. అంతే కాకుండా వీటిలో ఉపయోగించే కారం, నూనె, ఇతర మసాలా ఇవన్నీ కూడా ప్రత్యేకంగా ఎంపిక చేసుకుని, వీలుంటే తయారు కూడా చేస్తుంటారు. CONTACT DETAILS: Name: Varam Ph: +91 98665 15550