Contributed By Likhith Chirumamilla
"మన బిచ్చపతి కంటే 'ఆహ నా పెళ్ళంట' లో బిచ్చపతి నయం రా బాబూ!!" అని పక్క టేబుల్ వెంకట్రావు అన్న మాటలు పట్టించుకోకుండా తన టేబుల్ మీద ఫైల్స్, బాక్సు పెట్టి పని చూసుకుంటున్నాడు భిక్షపతి. "అవునండీ! సినిమాలో కోట గోరు పిసినారిగా యాక్టింగ్ మాత్రమే సేసారు. ఈయనగోరు జీవించేత్తన్నారు!" అని మాట కలిపాడు రాజారావు. ఇవన్నీ రోజూ వింటున్నా, పట్టించుకునే లోకంలో భిక్షపతి లేడు. తన పని తాను ముగించుకుని ఇంటికి చేరటమే భిక్షపతి రోజువారీ లక్ష్యం.
రామాపురం లో భిక్షపతి మండల పరిషత్ ఉద్యోగి. ప్రభుత్వ ఉద్యోగం అయినా చేతులు తడపకుండా నిజాయితీగా పని చేసేవాడు. చిన్నతనం నుండీ ఎవరూ లేకపోయినా కష్టపడి ఒచ్చిన ఉద్యోగం తో అదే ఊళ్ళో స్థిరపడ్డాడు. ఒంటరి జీవితానికి అలవాటు పడిన భిక్షపతి పెళ్లి కూడా చేసుకోకుండా అలాగే ఉండిపోయాడు. పెద్దగా ఇష్టాలూ, కొరికలూ లేకపోవడంతో ఖర్చు కూడా పెద్దగా ఉండేది కాదు. పైగా రెండు పూటల భోజన అలవాటు. సరదాలు, స్నేహితులు, జల్సాలు వీటికి దూరంగా, ఒంటరితనానికి దగ్గరగా భిక్షపతి జీవితం ఉండేది. పూజలు, పెళ్లిళ్లు, గుళ్ళు ఇవేవీ భిక్షపతి దినచర్యలో భాగం కాలేదు. నాలుగు జతల బట్టలు, తోలు చెప్పులు, డొక్కు సైకిలు, పాత గొడుగు...ఇవే రెండేళ్లుగా భిక్షపతి ని ఎండా వానల నుండి కాపాడుతున్నాయి. సంపాదన ఉన్నా గాని ఖర్చు మీద ధ్యాస లేకపోవడంతో ఊళ్ళోవారంతా భిక్షపతి ని పిసినారిగా చూసేవారు. తోటి ఉద్యోగులు, ఇరుగు పొరుగు వారి హేళనలు భిక్షపతి పట్టించుకునేవాడు కాదు. దీనితో భిక్షపతి అంటే పడని వారు రెచ్చిపోసాగారు. భిక్షపతి డబ్బంతా కూడబెట్టి చెడు అలవాట్లకు ఖర్చు చేస్తునట్లు పుకారు పుట్టించారు. నెలలో రెండు సార్లు భిక్షపతి కి పక్క ఊరు వెళ్లి వచ్చే అలవాటు ఉండటంతో ఊరంతా అది నిజమే అని నమ్మారు.
పండగలకి చందాలు కూడా ఇవ్వని భిక్షపతి ని బిచ్చగాడి కంటే హీనంగా చూసేవారు జనం. "ఆడు ఏనాడూ తన సొమ్ము పక్కోడికి పెట్టి ఎరగడు. ఒంటరి బిచ్చపతి ఒంటరిగానే పోతాడు. ఆడి సొమ్మంతా దొంగల పాలే" అని తిట్టుకునే వారు.
ఒకసారి భిక్షపతి పక్క ఊరికి వెళ్లి తిరుగు ప్రయాణం అయ్యే సరికి చీకటి పడింది. మెల్లగా చీకట్లో డొక్కు సైకిలుపై వస్తున్న భిక్షపతి మీదకి అతివేగంతో అదుపు తప్పిన లారీ వచ్చి గుద్దేసింది. చుట్టు పక్కల జనం గుమిగూడేసరికి ఒంట్లో చలనం లేదు. ప్రాణం పోయిందని తెలుసుకున్న జనం మెల్లగా శవం ఇంటి వద్దకు చేర్చారు. చివరి చూపుకి చుట్టాలెవరైనా వస్తారేమో అని శవాన్ని తెల్లరే వరకు ఉంచారు. అంతలో ఊరి పెద్ద "బిచ్చపతి గాడికి చుట్టమా, పక్కమా? ఒంటరి పక్షి! ఏనాడూ రూపాయి ఇచ్చి ఎరగడు! ఆడి కోసం ఎవడోత్తాడూ? తీస్కెళ్ళి తగలెట్టెయ్యండెహె!!" అని ఆజ్ఞ విసిరాడు. పిసినారి భిక్షపతి కి చివరికి అలాంటి గతే పట్టిందని జనమంతా గుసాగుసలాడారు. శవాన్ని కదిలిస్తుండగా రెండు వ్యాన్లు వచ్చి భిక్షపతి ఇంటి ముందు ఆగాయి. ఊరి పెద్ద బయటకి వచ్చి చూసేసరికి ముప్పై మంది దాకా ముసలి వాళ్ళు, చిన్న పిల్లలు. భిక్షపతి శవం చుట్టూ చేరి ఏడవసాగారు. పిల్లలంతా పదేళ్ల లోపు వారు. పెద్దలంతా డెబ్భై దాటిన వారే. వారంతా పక్క ఊరిలోని అనాథ శరణాలయం వారు. అప్పుడు భిక్షపతి ఎక్కడికి వెళ్ళేవాడో, తన సంపాదన ఏమి చేసేవాడో ఊరి జనానికి అర్థమైంది.
ఇన్నాళ్లూ పిసినారిగా పిలవబడి సాదా బ్రతుకు బతికిన భిక్షపతి ఎంత ధనవంతుడో, గొప్పవాడో ఆ పిల్లల ప్రేమ, అభిమానాలు జనానికి అర్థమయ్యేలా చేసాయి. నిజమైన పిసినారితనం అంటే ఏమిటో అందరికీ ఆరోజే తెలిసొచ్చింది.