పురుహూతిక అమ్మ వారు, కుక్కుటేశ్వర స్వామి వారు కొలువున్న ఈ కుక్కుటేశ్వర స్వామి దేవాలయం దేశంలోని అష్టాదశ శక్తిపీఠాలలో పదవ శక్తి పీఠంగా పూజలందుకుంటుంది. కేవలం మన తెలుగు రాష్ట్రాలలో మాత్రమే కాకుండా యావత్ దేశంలోనే ఈ దేవాలయానికి ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆంధ్రప్రదేశ్ లోనే అత్యంత అందమైన ప్రాంతాలలో ముఖ్యమైనదిగా ఉన్న తూర్పుగోదావరి జిల్లా కాకినాడ నుండి సుమారు 20కిలోమీటర్ల దూరంలోని పిఠాపురంలో ఈ మహిమాన్విత పుణ్యక్షేత్రం కొలువై ఉన్నది. ఈ దేవాలయాన్నే పాదగయ అని కూడా పిలుస్తారు. దేశఉత్తరాన ఉన్న గంగానది తీరమున ఉన్న 'గయ'ను "గయా శీర్షం" అని, దక్షిణాణ ఉన్న ఈ నది "పాదగయ" అని పురాణం. ఉత్తరాదిన శీర్ష స్థానంలో ఉన్న గంగానదిలో స్నానం చేస్తే ఎంత పుణ్యమో, ఈ దక్షిణాన ఉన్న పాదగయలో చేసిన కూడా అదే పుణ్యం లభిస్తుందని భక్తుల నమ్మకం.


తెలుగు వారి వీరత్వానికి ప్రతీకగా నిలిచిన శాతవాహన రాజుల పాలనలో ఈ గుడి మరింత అభివృద్ధి చెందిందని చరిత్ర. పరమ శివుడు ఈ క్షేత్రంలో కుక్కుటేశ్వర స్వామిగా దర్శనమిస్తారు. హైందవ పురాణాల ప్రకారం పూర్వం శ్రీ విష్ణుమూర్తికి పరమ భక్తుడైన గయుడు ఎన్నో సంవత్సరాల తపస్సు వల్ల వరాలు పొంది శక్తివంతుడైయ్యాడు. అలాగే ఈ పవిత్ర భూమిలో జరిగే యజ్ఞాలు, యాగాలలో దేవతలకు చెందవలసిన హవిస్సులను తానే పొందేవాడు. అలా ఆ యజ్ఞాల వల్ల వచ్చే లాభం అందకపోవడంతో ప్రకృతివైపరిత్యాలు ఏర్పడ్డాయి.


ఈ వైపరిత్యాలపై దేవతలు భయపడి దీనికి సరైన పరిష్కారం జరగాలి అని ఇంద్రునితో సహా దేవతలందరు త్రిముర్తులకు విన్నవించుకున్నారు. దీనికి సరైన పరిష్కారం కోసం ఒక ప్రణాళిక రచించి గయుడి దగ్గరికి వెళ్ళారు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు బ్రహ్మణ రూపంలో గయుని దగ్గరికి వచ్చి లోక కళ్యాణం కోసం తామంతా యజ్ఞం చేయబోతున్నాం అందుకు అనువైన స్థలం కోసం అన్వేషిస్తున్నాం అని అడిగారట. దానికి గయుడు తన శరీరం మీద యజ్ఞం చేసుకోవచ్చని చెప్పాడట.


అందుకు బ్రహ్మణ రూపంలో ఉన్న త్రిముర్తులు "ఈ యజ్ఞం అత్యంత మహిమాన్వితమైనది అలాగే అంతే ప్రమాదకరమైనది కూడా.. ఈ యజ్ఞం ఏడు రోజుల పాటు జరుగుతుంది. ఒక్కసారి ప్రారంభించిన ఈ యజ్ఞాన్ని ఏ ఆటంకం లేకుండా ఏడు రోజులలో పూర్తిచేయాలి.. లేదంటే దాని ఆటంకం వల్ల ఎదురయ్యే ప్రమాదాన్ని నువ్వు అనుభవించాల్సి ఉంటుందని హెచ్చరించారట". దానికి గయుడు మరో ఆలోచన లేకుండా అంగీకరించారట. గయున్ని నిర్వీర్యం చేయడానికే వచ్చిన త్రిముర్తులు యజ్ఞం పూర్తికాక ముందే శివుడు కుక్కుట(కోడి) రూపంలో అరిచారట.. దానితో ఏడు రోజులు ముగిశాయని అనుకున్న గయుడు యజ్ఞం మధ్యలోనే లేచాడట.


యజ్ఞం పూర్తికాక ముందే భగ్నం కలిగించినందుకు దీని ఫలితాన్ని అనుభవించే సమయం ఆసన్నమైందని శ్రీ మహా విష్ణువు త్రివిక్రమ రూపంలో గయుడి శరీరాన్ని ఛిద్రం చేశారట. ఆ తర్వాత గయుని శరీర భాగాలు పడిన చోట తాము క్షేత్ర పాలకులుగా ఉంటామని వరమిచ్చారు. ఆ శరీర భాగాలు దేశం నలుమూలల పడ్డాయట.. ఉత్తరణ శిరస్సు పడగా అది శిరోగయగా, ఒరిస్సాలో పడిన నాభి భాగం నాభిగయగా, ఈ పిఠాపురంలో పాదాలు పడడంతో పాదగయగా క్షేత్రాలు ఏర్పడ్డాయట. అలాగే గయుని కోరికమేరకు శివుడు ఇక్కడ కుక్కుటేశ్వర స్వామిగా వెలిశారని హైందవ పురాణం.

Photos Source: Panoramio
Also, do SUBSCRIBE to our YouTube channel to get more awesome video content delivered right into your inbox.