Meet Dosapati Ramu Garu; The Man Who Is Fighting For Plastic Usage Reduction

Updated on
Meet Dosapati Ramu Garu; The Man Who Is Fighting For Plastic Usage Reduction

దోసపాటి రాము.. మాములు లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలి నుండి వచ్చిన వ్యక్తి. నాన్న కొద్దిపాటి పొలంలో వ్యవసాయం చేస్తుండేవారు, రాము గారి చిన్నతనంలో ఒకరోజు పశువుల పేడను ఎరువుగా పొలంలో వేసే పని చేస్తూ, అక్కడక్కడా పేడలో ప్లాస్టిక్ కవర్లు వస్తుంటే వాటిని నాన్న తీసి పారేస్తున్నారు.. పొలంలో దున్నుతున్నప్పుడు కూడా ప్లాస్టిక్ కవర్లు నాగలికి అడ్డుపడుతుంటే వాటిని కూడా తీసివేస్తున్నారు. అదేంటి.!! ఇది కూడా ఎరువుగా ఉపయోగపడదా.? అని అడిగితే వీటి వల్ల పైసా ఉపయోగం లేకపోగా మనకే నష్టం అని చెప్పేవారు.. అవునా.!! మరి ఇంత నష్టమున్న జనాలు ప్లాస్టిక్ ఎందుకు వాడుతున్నారు.? అనే ఆలోచన అప్పుడే రాము గారిలో పుట్టింది.

రాము గారు ప్లాస్టిక్ పై యుద్ధంతో పాటు Drive safely, someone is waiting for you at home, అలాగే బైక్ డ్రైవ్ చేస్తున్నప్పుడు హెల్మెట్ పెట్టుకోవాలి లాంటి campaign లు కూడా చేస్తున్నారు.

పిల్లల పుట్టినరోజు వేడుకల నుండి: రాము గారు వయసులోనూ, జీవితంలోనూ ఎదిగారు. బాగా చదువుకుని ప్రస్తుతం ప్రయివేట్ కంపెనీలో మంచి శాలరితో ఉద్యోగం చేస్తున్నారు. ఐతే కాలం మారినా, ఉండే చోటు మారినా "ప్లాస్టిక్" అనే పదం మాత్రం తనలో ఎదో సందర్భంలో గుర్తుకు తెస్తూనే ఉండేది. ఇప్పుడంటే విస్తృతంగా ప్లాస్టిక్ పై పోరాటం జరుగుతున్నది, ప్రజలలో అవగాహన పెరిగింది కానీ రాము గారు ప్రారంభించేనాటికి సంఘంలో అవగాహన అంతగా లేదు, నిజానికి మనకు ఇప్పుడు ప్లాస్టిక్ పై ఇంతలా జ్ఞానం పెరగడానికి మనకు ఉపయోగపడిన తొలితరం వ్యక్తులలో ఆయన ఒకరు. సమాజం ఇంటి బయటి నుండి కాదు ఇంట్లో నుండే మొదలవుతుందని జిడ్డు కృష్ణమూర్తి గారు చెప్పినట్టుగా పిల్లల పుట్టినరోజు వేడుకలకు తొలిసారిగా ఒక లారీ నిండా మొక్కలు తీసుకువచ్చి వచ్చిన ప్రతి ఒక్కరికి కానుకగా ఇచ్చారు. వచ్చిన అతిథులందరికి ఈ కాన్సెప్ట్ విపరీతంగా నచ్చి రాము గారిని నిండు మనసుతో అభినందించారు.

ప్లాస్టిక్ వాడని వ్యక్తులను కూడా రాము గారు గుర్తించి గౌరవిస్తుంటారు. ఇదిగోండి నేను ప్లాస్టిక్ వాడకుండా టిఫిన్ బాక్స్ వాడుతున్నాను అని మీరు ఫోటో పంపిస్తే రాము గారు మీరుంటున్న చోటుకు వచ్చి మంచి క్వాలిటీ గల జ్యూట్ బ్యాగ్ బహుకరిస్తారు.

టిఫిన్ బాక్స్ ఛాలెంజ్: మన జంటనగరాలలో ప్రతి ఆదివారం లక్షలాదిమంది చికెన్, మటన్, ఫిష్ లాంటివి కొనుగోలు చేస్తుంటారు. ప్రతిరోజు కోటి ప్లాస్టిక్ కవర్లు ఒక్క హైదరాబాద్ పరిసర ప్రాంతంలోనే వినియోగిస్తున్నాము. మాంసం కొని ఇంటికి తీసుకువెళ్తున్న దూరం ఒక పది నిమిషాల జర్నీ ఉండొచ్చు. ఈ పదినిమిషాల జర్నీకోసం ప్లాస్టిక్ ఎందుకు.? మాంసం తినకూడదని నేను చెప్పడం లేదు, ఈ ఒక్క ఆదివారం పదిలక్షల అదనపు ప్లాస్టిక్ కవర్లను కాకుండా టిఫిన్ బాక్స్ లను ఉపయోగించండి!! అని మొదట తను మాంసం కోసం టిఫిన్ బాక్స్ ను వాడి తన మిత్రులకు "టిఫిన్ బాక్స్ ఛాలెంజ్" విసిరారు. అది అద్భుతంగా పనిచేసింది. ఈ ఛాలెంజ్ ప్రస్తుతం ఒకరినుండి మరొకరికి విస్తరిస్తోంది. అలాగే రాము గారు హైదరాబాద్ లోని పెద్ద పెద్ద చికెన్, మటన్, ఫిష్ మార్కెట్ ల వద్దకు వెళ్లి షాపు యజమానులతో పాటు వినియోగదారులకు టిఫిన్ బాక్స్ లను వినియోగించండని మైకు పట్టుకుని మరి అవగాహన కల్పిస్తుంటారు. హైదరాబాద్ లో ప్రస్తుతం ఈ నియమాన్ని చాలా షాపులు పాటిస్తున్నాయి.

మొదట్లో వివిధ షాపుల వద్దకు వెళ్లి ప్లాస్టిక్ కవర్లలో కూరగాయలు పండ్లు అమ్మకండని చెప్పడానికి వెళితే.. ఎవడ్రా నువ్వు!! నీ వల్ల మా గిరాకీ దెబ్బతింటుందని తిట్టేవారు. ఐతే ఇది నా వ్యక్తిగత స్వార్ధం కోసం కాదు సమాజం కోసమే కదా అని అలాంటివాటిని అంతగా పట్టించుకునేవారు కాదు.

భూమి బచావో: మిత్రులారా మనల్ని ఇన్నిరోజులు పెంచి పోషిస్తున్న భూమి ప్రాణాపాయ స్థితికి వెళుతుంది. భూమికి ఐతే మాకేంటని అనుకోకండి!! నేల తల్లి గర్భంలో అనారోగ్యం మొదలైతే మొదటమనకే ప్రమాదం, ఆవు అరటిపండ్ల తొక్కల కోసం ప్లాస్టిక్ కవర్ ను కూడా తినేస్తే ఆవుతో పాటు మనకు ప్రమాదం.. ఇలా ఒక మైక్ పట్టుకుని హైదరాబాద్ లోని వివిధ ప్రాంతాలలోని కూరగాయల మార్కెట్ ల దగ్గరికి వెళ్లి రాము గారు చెబుతూ ఉంటారు. అలాగే తన అపార్ట్మెంట్ లో ఉన్న ఇళ్లకు వెళ్లి పాత న్యూస్ పేపర్లను కలెక్ట్ చేసి, స్కూల్ పిల్లలకు ఆ న్యూస్ పేపర్లతో క్యారీ బ్యాగ్ ఎలా తయారు చెయ్యవచ్చో చేసి చూపించేవారు. మార్కెట్ లోనే ఉచితంగా ఈ పేపర్ బ్యాగులను పంచేవారు. కూరగాయల మార్కెట్ లో ఎక్కువగా కూరగాయలు అమ్మేది మహిళలే, ప్రతిరోజూ 200 రూపాయల వరకు ప్లాస్టిక్ కవర్ల కోసం ఖర్చవుతుంది, ప్లాస్టిక్ వాడకం తగ్గితే లాంగ్ టర్మ్ బెనిఫిట్స్ ఉంటే కూరగాయల అమ్మకందారులకు మాత్రం ఇన్ స్టెంట్ గా రూ.200 వరకు సేవ్ అవుతున్నాయి. మరి ముఖ్యంగా ప్రతిరోజు లక్షలాది ప్లాస్టిక్ కవర్ల వినియోగం తగ్గుతుంది.

నేను ఒక వ్యక్తిగా ఇంతటి స్థాయిలో ప్లాస్టిక్ ను అరికట్టగలిగితే ఒక సమూహ శక్తిగా ఉన్న మీరు ఇంకెంత తగ్గించగలరని GHMC వారికి బాధ్యత గల పౌరుడిగా ఛాలెంజ్ విసరడం రాము గారికి అలవాటు.

ప్లాంట్ ఫర్ ప్లాస్టిక్: రాము గారి అంతిమ ధ్యేయం ప్లాస్టిక్ నివారించడం. అందుకోసం ఒక్కో సందర్భంలో, ఒక్కో మార్గాన్ని ఒక్కో కార్యక్రమాన్ని ఎంచుకుంటున్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న ప్రోగ్రామ్ ప్లాంట్ ఫర్ ప్లాస్టిక్. ఇందుకోసం ఈస్ట్ గోదావరి కడియం నుండి వేల సంఖ్యలో మొక్కలను సొంత ఖర్చులతో తీసుకువచ్చారు. మీ దగ్గర ప్లాస్టిక్ ఉంటే కనుక మాకు ఇవ్వండి, మీకో అందమైన మొక్కను ఇస్తాము. మొక్క కోసం అరకేజీ, కేజీ స్థాయిలో ప్లాస్టిక్ అన్న నిబంధన ఇక్కడ లేదు. చిన్న lays chips packet కవర్ ఇచ్చినా కూడా దోసపాటి రాము గారు మొక్కను ఇస్తారు. రాము గారి వ్యక్తిత్వాన్ని, నిజాయితీ, తపనను చూస్తున్న చాలామంది కిలోల కొద్దీ కొత్త ప్లాస్టిక్ క్యారీ బ్యాగులను సైతం ఇచ్చి వెళుతున్నారు. ఈ కలెక్ట్ చేసిన ప్లాస్టిక్ ను రాము గారు ఉచితంగా GHMC వారికి అందజేస్తుంటారు. ప్లాంట్ ఫర్ ప్లాస్టిక్ కార్యక్రమం ద్వారా కొన్ని రోజుల్లోనే 1000 కిలోల ప్లాస్టిక్ ను సేకరించగలిగారు.

దోసపాటి రాము గారు ఇదంతా ఎందుకు చేస్తున్నారు అంటే అందుకు గల స్వార్ధం ఒక్కటే.. మనం ఇలా బ్రతుకుతున్నామంటే దానికి కారణం మనకు ఇలాంటి ప్రకృతిని ఇచ్చిన పూర్వీకులది. మన తరం కూడా దీనిని జాగ్రత్తగా కాపాడుకుని మన తర్వాతి తరానికి గర్వంగా అందించాలి. రండి రాము గారితో మనమూ చేతులు కలుపుదాం..

మరింత సమాచారం కోసం: 90009 98877