నేనో సామాన్యుడిని…… సగటు మనిషిని , మధ్య తరగతి బతుకుజీవిని అధికారం చేసే రువాబు నా పైనే , అహంకారం చూసే చిన్నచూపు నామీదే ఎన్నికలొస్తే ఓటరు దేవుడ్ని ……. ఏక్ దిన్ కా సుల్తాన్ నేను తరువాత మళ్ళీ పాంచ్ సాల్ కా బికారి నేనే . చెమట చుక్కలు పోగేసి కూడబెడితే కూడుకి కూడా లేకుండా ఉన్నదంతా ఎవడో దోచేస్తుంటే దేశం దాటి దర్జాగా తిరిగేస్తుంటే వాడి అప్పులకి వడ్డీ కట్టేది నేను నా రెక్కల కష్టం రాబందుల పాలు.
రాజ్యాంగం రాసింది నాకోసమే, చట్టాలు వ్యవస్థలూ అన్నీ ఉన్నవి నా గురించే ఎన్నున్నా ఏనాడూ ఏవీ తీర్చలేదు నా శోకం. చుట్టూ కోట్లమందున్నానేనెప్పుడూ అనాధనే నిభందనల బంధనాలన్నీ నాకే, బంద్ ల ఇబ్బందులు నాకే ధరల గిరుల బరువు నాకే, పెరిగిపోయే పన్నులకి నలిగిపోయేది నేనే ప్రశ్నిస్తే సంఘ వ్యతిరేకిని ఎదురుతిరిగితే దేశ ద్రోహిని నా కోపాలన్నీ పంటిబిగువనే అణిగిపోతాయి నా బాధలన్నీ నా మనసులోపలే ఆగిపోతాయి నా సమస్యలన్నీ నాతోపాటే సాగిపోతాయి……. ఎక్కడా చూపలేని కోపం నాది ఎవరికీ వినపడని గొంతుక నాది ఏవేరేమి చేసినా ఓర్చుకునే ఓర్పు నాది సమస్యలెన్నున్నా ఎదుర్కునే నేర్పు నాది ఉన్నదాంతో సర్దుకుపోయే అల్పసంతోషిని , రేపన్నది బాగుంటుందని బతికే ఆశాజీవిని నేను నేనో సామాన్యుడిని