Contributed by MV Ramana
ఏందిది అసలు, ప్రకృతిల పరవళ్లు నాలో ఇలా.. ఈ క్షణాలకెందుకింత మధురం, అమృతం మాత్రమే కురిపించే పాలసముద్రం చిలుకుతున్నదెవరు నాలో ..? సరిసమానమేది నీ సొగసులుకి నీ పరువపు పులకరింతలోనే పునీతమవగా, తనువంతా ఏదో నీ ఆవాహంలా ఈ కనులంతా నిండిన నీ చిత్రాలతో ఈ తన్మయత్వపు తుళ్ళింతలు, స్పర్శ ఏ లేని చెక్కిలిగింతల నడుమ అధరాలు చేసే నిశ్శబ్ధ అలజడి ఇంకా.. ఇంకా.. చెప్పాలంటే గెలిచినా క్షణాన ఆటగాడిలో కలిగే ఆనందం రుచి నెరిగిన నిమిషాన జిహ్వపు అనుభూతి ఆ భావాలనెప్పుడు ఎవరు చెప్పినా, అవి జ్ఞాపకాలాడే మాటలు తప్పా, ఆ క్షణాలానందానికి సాటి రావెలానో .. నేనెంత వర్ణించినా.. నిను చూసినా.. తలిచిన నిమిషాల అనుభూతులకు సరితూగవెప్పటికీ నా మాటలు.. శబ్ధ రత్నాకరంలో శబ్ధాలేవీ సాటిరావు ఈ భావాలకి.. సరిగమపదనిసలు చాలవు నాలోని బాణీలకు స్వరాలు సమకూర్చడానికిప్పుడు... అయినా గమ్మునుండమని చెప్పు ఈ మనసుకి, ఎవరికీ లేని మక్కువ తనకెందుకో నీపైన.. కాళ్ళు విరగొట్టాలనుంది కన్పిస్తే ప్రేమని. నీపై భావాలన్నీ రెండే పదాలలో ఇముడ్చుతున్నందుకు.. ఒక్క నా వయసుకి మాత్రం పాదాభివందనం చేసేస్తున్న ఎప్పటికప్పుడు.. తను ఒక్కరే నీపై భావాలన్నింటితో సెకను, సెకెనుకు పోటీపడుతున్నందుకు.. ఆ భావాల ఉచ్ఛస్థితిని చూసే నా చివరి శ్వాసకు ఎంత అదృష్టముండకపోతే, రాసి పెట్టుకొని కూర్చుంటుంది ఆ క్షణాలకోసం ...