Contributed by Praneeth Kumar
"తగుజత తానని తనకి తెలిసిపోయిందేమో తనువులో పిడికెడైనా ఉండదు తనువుని సైతం తనవైపు తిప్పింది"
తనని చూడగానే 'నా హృదయం నా మాట వినకుండా, నన్ను తనవెంట తిరిగేలా చేసిందని ' నే రాసిన తొలికవిత. తనలాగే నా కవిత కూడా నాకు తెగ నచ్చేసింది.
'ఎన్నో కలలు, ఎన్నో కోరికలు, కొన్ని ఆశయాలు, కొన్ని అనుమానాలు, కొన్ని సిద్ధాంతాలు ' అన్నీ కలగలిసున్న నా మనసుని చిటికెలో తనవైపు తిప్పేసుకుంది.
ఏం మాయో ఇది.... ఒక్క క్షణం లో అన్ని అనుమానాలు తీరిపోయినట్టు, ఒక్క క్షణం లో అన్ని ప్రశ్నలకి జవాబులు దొరికినట్టు అనిపిస్తుంది.
ఇన్నేళ్ళలో ఎప్పుడూ పొందని అనుభూతి, మొదటిసారి తనని చూడగానే కలిగింది. లోలోపల ఎప్పుడూ... ఎక్కడో? ఎందుకో? తెలీని అసంతృప్తి తనని చూడగానే మాయమయిపోయింది ప్రేమ అనేది నిజంగానే ఒకటుంటుందా? అన్న నా ప్రశ్న స్థానాన్ని తొలిచూపు లో కూడా ప్రేమ పుడుతుందన్న సమాధానం నింపేసింది.
మాటల ప్రవాహం సరిపోదేమో తన గురించి చెప్పమంటే పగలు రాత్రుళ్ళ సమూహం కావాలేమో తనని తనివితీరా చూడ్డానికే ఎన్ని పదబంధాలు, ప్రాసలు వెతుక్కోవాలో తనని పొగడడానికి
తననే చూడాలనిపిస్తుంది, తనతో మాట్లాడాలనిపిస్తుంది, తనతోనే ఉండాలనిపిస్తుంది, వేకువలో మెలుకవనైనా, చీకటిలో కలనైనా తనతోనే పంచుకోవాలనిపిస్తుంది.
ప్రతీక్షణం తన ధ్యాసే ప్రతీ శ్వాస తనకోసమే ప్రతీ రూపం తన ప్రతిరూపమై నన్ను తనవైపు నడిచేలా చేస్తున్నాయి.
ఒక కొత్త పరిచయం... నాలో కొత్త మార్పుని తెచ్చింది నాలో కొత్త భావాల్ని పుట్టించింది నాలో కొత్త ఉత్సాహాన్ని రేకెత్తించింది నాకు ప్రేమ రుచిని పరిచయం చేసింది నాకో తెలియని కొత్త నన్ను ని చూపింది నాలో ని ప్రేమికుడికి జన్మనిచ్చింది
అందంగా ఉండే అమ్మాయంటే అందంగా కనిపించే అమ్మాయనుకున్నా అందమైన ఆలోచనల్ని అందనమైన ఊహల్ని అందమైన భావాల్ని అందమైన భావోద్వెగాల్ని పుట్టించి రోజూ నే చూసే లోకాన్నే నాకు సరికొత్తగా పరిచయం చేసే అమ్మాయని ఈరోజే తెలిసింది
ఇన్నేళ్ళలో... ఎన్ని పరిచయాలు నను పలకరించినా ఇంత పరవశం ఎప్పుడూ పొందలేదు ఎన్ని అనుభూతులెదురయినా ఇంత ఆహ్లాదాన్ననుభవించలేదు మాటల సంభాషణలే తెలుసు చూపుల సంభాషణ మాధుర్యం తన పరిచయమే తెలిపింది తను నా కళ్ళలోకి చూస్తుంటే నా ఉచ్వాస నిచ్వాసల వేగం పెరిగిపోతుంది తను నాకు దగ్గరగా నడుస్తుంటే నా గుండె చప్పుడు నాకు మరింత బిగ్గరగా వినబడుతుంది తనలో ఏదో మాయుంది ఆ మాయకే పడిపోయినట్లున్నా తన చూపులో ఏదో గమ్మత్తుంది ఆ మత్తులో నే తేలిపోతున్నా తనపలుకుల్లో తెలీని తియ్యదనముంది ఆ తీపినే ఆస్వాదిస్తున్నా....