ఓ కాంతి కిరణం ప్రకృతిలో ఉదయిస్తే సృష్టికంతటి ఎంతటి వెలుగునందిస్తుందో అదే కాంతి కిరణం మనిషిలో ఉదయిస్తే అంతే వెలుగు సమస్త ప్రజానీకానికి ఉపయోగపడుతుంది. ఆ జ్ఞాన కాంతి కిరణం ఎందరిలోనో ఉదయించడం వల్ల సమస్యల చీకటిలో పరిష్కార వెలుగులు ప్రసరించబడ్డాయి.. ఆ కాంతి కిరణం పేద, ధనిక, ప్రాంతాలు, పరిసరాలను గమనించి మనలో ప్రవేశించదు, పుట్టుకతోనే శరీరంలోని అవయవాలతో పాటుగా సంక్రమించిన ఆ ఆస్థిని ఎవరు గమనిస్తే వారికే ఆ ఆస్థి ఉపయోగపడుతుంది. తిరుపతి కూడా ఆ విధంగానే తన ఆస్థిని తెలుసుకుని తనలోని వెలుగుని ప్రసరింపజేస్తున్నాడు.
ప్రకాశం జిల్లా చీరాల మండలం కొత్తపేట ప్రాంతానికి చెందిన వరదరాజు గారు హోమ్ గార్డ్ గా పనిచేస్తుండేవారు ఎనిమిది మంది పిల్లలలో ఇద్దరు పిల్లలకి యాక్సిడెంట్ జరగడం వారి హాస్పిటల్ ఖర్చులకు ఉన్నదంతా అమ్మేయడం, అంతచేసినా గాని వారు బ్రతకకపోవడంతో అటు మానసికంగా, ఇటు ఆర్ధికంగా కూడా చితికిపోవడంతో 7వతరగతి చదువుతున్న తిరుపతి రెండోసారి తన జీవితంలో జన్మించాడు.
అప్పటినుండే స్కూల్ లో చదువును మానేసి జీవితాన్ని చదవడం మొదలుపెట్టాడు. ఆ రెండో జీవితమే వెల్డింగ్ పనుల దగ్గరి నుండి కరెంట్ పనులన్నీటిని నేర్పించింది. వయసు పెరుగుతన్న కొద్ది తాను ఎదిగి వాటిలో నిష్ణాతుడయ్యాడు.. ఈ ప్రస్థానంలోనే కరెంట్ కనెక్షన్ ఇవ్వడం, ఇతర రిపేర్ల కోసం కరెంట్ స్థంభం ఎక్కాల్సి ఉంటుంది. "నేనంటే ఎక్కగలుగుతున్నాను జాగ్రత్తగా దిగగలుగుతున్నాను, కాని నాలాగా అందరికి సాధ్యపడదు.. అదీగాక కరెంట్ స్థంభం నుండి ప్రమాదవశాత్తు కిందపడి చనిపోవడం, అవయవాలు కోల్పోయి జీవశ్ఛవాలుగా బ్రతికేవారిని ఎంతోమందిని గమనించాడు తిరుపతి. వీరికోసం ఏదైనా చేయాలి అలాగే అది కూడా నా భవిషత్తుకు ఉపయోగపడాలి అంటూ ఈ "పోల్ క్లైంబర్" నీ కనిపెట్టాడు.
ఆత్మహత్యా ప్రయత్నం నుండి..
బతుకు పోరాటం కోసం అన్నిరకాల పనులను నేర్చుకున్న తిరుపతి ఓ సారి ట్రాక్టర్ ప్రమాదంలో కాలు విరిగిపోవడం జరిగింది, ఆ గాయం మానే క్రమంలోనే మరోసారి విరగడం, సంవత్సరం పాటు మంచానికే పరిమిత మవ్వడం, ఆర్ధిక పరిస్థితులు ఇలాంటి కారణాలతో మానసికంగా కృంగిపోయి నిద్రమాత్రలు మింగి ఈ పరిస్థితుల నుండి బయట పడాలనుకున్నాడు కాని మాత్రలు అందకుండా మిత్రులు అడ్డుకున్నారు. తర్వాత మానసికంగా, శారీరకంగా ఆరోగ్యం కుదుట పడ్డ తర్వాత భారతదేశంలోనే మొదటిసారి(పేటంట్ హక్కు కూడా వచ్చింది) ఈ పోల్ క్లైంబర్ ను తయారుచేశారు.
ఈ షూస్ కనిపెట్టడం వరకు మాత్రమే కాదు దానిని సక్సెస్ చేయడంలోనూ మంచి మార్కెటింగ్ మెళకువలను ప్రదర్శించాడు. 2016లో ఓ 12 ఉద్యోగస్థులతో "Nannam Industires" స్టార్టప్ ను స్టార్ట్ చేసి ఇటు సమాజానికి అటు వ్యక్తిగతంగా తనకు ఎంతో ఉపయోగాన్ని అందిస్తున్నాడు. ఈ షూస్ ఎంత ధృడంగా ఉంటే వాటిని ఉపయోగించే వ్యక్తి అంత నమ్మకంగా ఉంటాడు. అందుకే షూ తయారీ కోసం 150-200 కేజీల బరువు మోసేలా ఎం.ఎస్. 16 ఎం.ఎం స్క్వేర్ రాడ్ ను వినియోగిస్తున్నారు. పాదం ఎటువైపుకు సడలిపోకుండా మందని చెప్పులు దీనికి భిగిస్తారు. ఎక్కడం దిగడం వరకే కాదు దాని మీదే సౌకర్యంగా కూర్చుని పని పూర్తిచేసుకోవచ్చు. ఈ షూసు ప్రస్తుతం అమేజాన్ లో 1700-1800 రూపాయలతో (బయట రూ.1500) కూడా దొరుకుతున్నాయి..
పనివారి కాదు:
తిరుపతి దగ్గర పనిచేస్తున్న పనివారిపై యజమానిలా దర్పం చూపించరు. వారందరికి మంచి జీతంతో పాటు, భవిషత్తులో ప్రతి ఒక్కరికి ఇంటి స్థలాలు కూడా అందజేయబోతున్నాడు.
7వ తరగతి మధ్యలోనే ఆపేసి తర్వాత 10వ తరగతి పూర్తిచేసిన తిరుపతి జీవితంలో మాత్రం గొప్ప మార్కులతో పాస్ ఐయ్యి, అవార్ఢులు కూడా అందుకున్నాడు. జిల్లా, రాష్ట్ర స్థాయిలతో పాటు ఇంటర్నేషనల్ ఇన్నోవేషన్ ఫేయిర్ లో ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా పురస్కారం కూడా అందుకున్నారు. త్వరలో రాష్ట్రపతి గారి చేతుల మీదుగా కూడా అవార్డును అందుకోబోతున్నాడు.
ఈ వీడియో చూడడం వల్ల "Pole Climber" మీద మరింత స్పష్టత వస్తుంది..