టీ కొట్టు ద్వారా ప్రకాశరావు గారికి ప్రతిరోజు 600 నుండి 1000 రూపాయల వరకు వస్తాయి ఒక్కోసారి అవ్వి కూడా రావు. ఎంత ఆదాయం వచ్చిన కాని అందులో సగం(లేదంటే అంతకన్నా ఎక్కువ) తన దగ్గరే చదువుకుంటున్న పిల్లల కోసం ఉపయోగిస్తారు. ప్రకాష్ గారు ప్రతిరోజు మూడు ఉద్యోగాలు చేస్తుంటారు. ఉదయం టీ కొట్టులో, మధ్యాహ్నం తన స్కూల్ లో ఉండి చదువుకునే పిల్లల కోసం టీచర్ గా, సాయంత్రం గవర్నమెంట్ హాస్పిటల్ కు వెళ్లి తన రాక కోసం ఎదురుచూస్తున్న వారిని ఆత్మీయంగా పలుకరించి ఆరోగ్యం మెరుగుపడడానికి పాలు, పండ్లు, బిస్కెట్లు, అవసరమైతే మందులు ఇస్తారు. డబ్బే కాదు తన విలువైన సమయాన్ని కూడా చుట్టూ ఉన్న మనుషులకు దారపోశారు కనుకనే భారత రాష్ట్రపతి గారి చేత "పద్మశ్రీ" అందుకుని పద్మశ్రీ విలువ పెంచారు.
మన తెలుగువారు: ప్రకాష్ గారు స్వచ్ఛమైన తెలుగు మనిషి. తన పూర్వీకులు కాకినాడలో పుట్టి గోదారమ్మ తల్లి నీళ్లు తాగి పెరిగారు. ఒడిశా కటక్ బక్షిబజార్ అనే మురికివాడలో ఇలాంటి మంచిపనులు చేస్తూ వికసించారు. కాళ్ళు చేతులకు బలం వచ్చిన దగ్గర నుండి ఆయన టీ కొట్టులో పనిచేస్తూ వస్తున్నారు. నెలకు 20 రోజులకు పైగా టీ కొట్టులో, మిగిలిన రోజులు బడిలో అక్షరాలను చూసేవారు, తాకేవారు. ప్రకాష్ గారు ప్రజల ఆరోగ్యాన్ని బాగు చేసే "డాక్టర్" అవ్వాలని ఆశించారు. ప్రయాణంలో అతనికి ఎదురుపడ్డ అతిపెద్ద అడ్డంకి "డబ్బు". ఆ రోజుల్లో 42 రూపాయాలు లేకపోవడం వల్ల పై చదువుల్లోకి ఎక్కలేకపోయారు. ఇంటర్మీడియట్ లొనే చదువుకొనడానికి డబ్బు ఎంత అవసరమో అనుభవ పూర్వకంగా తెలుసుకున్నాడు.
పేద పిల్లలందరూ తన వారే: కటక్ ఇంకా బక్షిబజార్ లో తెలుగువారు ఎక్కువ. వారిలో హమాలీలు, రిక్షా కార్మికులు, పనిమనుషులు మొదలైన పనులు చేస్తూ రోజులు పొడిగించుకుంటున్నారు. వాళ్లకు పుట్టిన పిల్లలు "ఖరీదైన మనుషులు రోడ్డు మీద ఎక్కడపడితే అక్కడ క్రమశిక్షణ లేకుండా పారేసే చెత్తను ఏరుకుని అమ్మ నాన్నలకు ఎంతో కొంత ఆసరాగా ఉండేవారు". ఇలాంటి దైనందిన కార్యక్రమాలు మరికొన్ని సంవత్సరాలు కొనసాగితే వారి జీవితం బాగుచెయ్యడం కష్టమవుతుందని దాదాపు 20 సంవత్సరాల క్రితం తనకున్న రెండుగదులలో ఒక గదిలో "ఆశా ఓ ఆశ్వాసన్" పేరుతో స్కూల్ తెరిచారు. ప్రస్తుతం ఈ స్కూల్ లో 80 మంది స్టూడెంట్స్ చదువుకుంటున్నారు, ఆరుగురు టీచర్లు పనిచేస్తున్నారు. టీచర్ల శాలరీ పిల్లల చదువుకు అవసరం అయ్యే అన్ని అవసరాలు ప్రకాష్ గారే చూసుకుంటారు.
214 సార్లు రక్తదానం: ప్రకాష్ గారిని జీవితం ఎలాంటి పరిస్థితులకు కూలదోసినా అందులో నుండి తేరుకొని మరొకరికి తనలాంటి సంఘటనలు ఎదురుకాకుండా ప్రయత్నిస్తున్నారు. 20వ సంవత్సరంలో టీబీ ఇంకా పార్షియల్ పెరాలసిస్ వచ్చింది. వెన్నముకకు ఆపరేషన్ చేస్తే కోలుకునే అవకాశం ఉంది. ఆపరేషన్ కోసం రక్తం అవసరం వచ్చింది. ఆ రోజుల్లో రక్తదానం అంటే అపోహతో కూడిన భయఉండేది, ఐన కానీ ఒక వ్యక్తి రక్తదానం చేసి ప్రకాష్ గారిని ఆదుకున్నారు. 6 నెలల పాటు అక్కడే హాస్పిటల్ లో ట్రీట్మెంట్ తీసుకోవడంతో అక్కడికి వచ్చే పేషంట్స్ బాధలు దగ్గరి నుండి చూసి అప్పటి నుండి పేదవారికి పండ్లు, పాలు, మందులు, 1976 నుండి ఇప్పటికి 214 సార్లు రక్తదానాలు, 17 ప్లేట్ లెట్స్ డొనేట్ చేశారు. చనిపోయిన తర్వాత ఆయన శరీరం మరో నలుగురికి ఉపయోగపడాలని అవయవ దానం కూడా చేశారు. సమాజం పద్మశ్రీతో పాటు అనిబిసెంట్ అవార్డ్, హ్యూమన్ రైట్స్ అవార్డుతో గౌరవించుకుంది. దేశ ప్రధాని నరేంద్రమోడీ గారు కూడా ప్రత్యేకంగా కలుసుకుని, తన ప్రయాణం గురించి మన్ కి బాత్ లోనూ వివరించారు.