ఎవరితోనో కాదు మనకు మనమే ఒక్కసారి మాట్లాడుకుందాం. "ఇప్పటివరకు మనం ఎన్ని మొక్కలు నాటాము.? ఎక్కడబడితే అక్కడ చెత్త పడేయకుండా ప్రతిసారి చెత్తను చెత్తకుండీలలో వేశామా.? అవసరం లేకపోయినా అనవసరంగా వెహికిల్ వాడుతూ పొల్యూషన్ ను ఈ మహానగరంలో వదిలాము.? బహుశా మన తప్పులు మనకు తెలిసే ఉంటాయి కదా(నాతో సహా). ఇవన్నీ ఒక సామాన్యుడు చేస్తున్న తప్పులు. అదే ఒక బడా పారిశ్రామిక వేత్త ఎయిర్ పొల్యూషన్ దగ్గరి నుండి సముద్రం వరకు అన్ని నిర్వీర్యం చేసుకుంటూ పోతుంటాడు. ఈ ప్రస్తుత పరిస్థితులలో సామాన్యుల దగ్గరి నుండి అసామాన్యుల వరకూ ప్రకృతి పట్ల తమ బాధ్యతను గుర్తుచేస్తున్నారు ప్రత్యూష.
రేడియో జాకీగా పనిచేస్తున్న ప్రత్యూష ప్రకృతి ప్రేమికురాలు. అమ్మ నాన్నలిద్దరి ద్వారా ప్రత్యూష కు చిన్నతనం నుండే ప్రకృతి పట్ల ఆరాధనా భావం పెరిగింది. అమ్మానాన్నలతో కలిసి ఇంటి చుట్టూ మొక్కలు నాటడం, ప్రకృతికి ఇబ్బంది కలుగకుండా ప్లాస్టిక్ వాడకుండా అలాగే పొల్యూషన్ ఇవ్వని సైకిల్ ను మాత్రమే ఉపయోగించేది. ఖాళీగా ఉన్నప్పుడు మిత్రులకు వివరించడం, రేడియో జాకీ గా పనిచేస్తూ ప్రజలలో అవగాహన కల్పిస్తూ ఉంటుంది.
ఇక్కడ మనం పొల్యూషన్ పెంచితే, ప్లాస్టిక్ వాడితే అక్కడ అంటార్కిటికా లోని మంచు కరిగిపోతుంది. ఇక్కడ మనం చేసే చిన్న చిన్న తప్పులే అక్కడ పెద్ద సమస్యగా మారిపోతుంది. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది.? ఇందుకోసమే Care Climate change programలో భాగంగా 25 దేశాల నుండి 80 మందిని ఎంపికచేశారు. అందులో మన ప్రత్యూష కూడా ఒకరు. ఐతే అక్కడి ప్రయాణం ఖర్చుతో కూడుకున్నది. తెలంగాణ ప్రభుత్వం, జి.వి.కే, హెటిరో వంటి వారు స్పాన్సర్ చేశారు.
మనం ప్రకృతికి ఏది ఇస్తామో దానినే కొంతకాలానికి తిరిగి ఇస్తుంది. మనం ప్రేమిస్తే ప్రేమను, ద్వేషిస్తే ద్వేషాన్ని, ఆరోగ్యాన్ని ఇస్తే ఆరోగ్యాన్ని.. వేడి పెరిగిపోవడం వేగంగా జరిగితే అక్కడ మంచు కరిగి సముద్రాలు పెరిగి ప్రకృతిలో విపరీతమైన మార్పులు వచ్చే అవకాశం ఉంది. వీటన్నిటికి సంబంధించి ప్రత్యూష ప్రభుత్వానికి విలువైన సూచనలు చేసింది. తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలలో కూడా ప్రభుత్వం సత్కరించింది.
ప్రత్యూష భవిషత్తులో చేయబోయే కార్యక్రమాలు: -కొన్ని స్కూల్స్ ను ఎన్నుకుని చిన్నతనం నుండే పర్యావరణంపై పూర్తి అవగాహన కల్పించడం. -ప్రభుత్వ సహకారంతో సంవత్సరమంతా వివిధ కార్యక్రమాలతో గ్లోబల్ వార్మింగ్ తగ్గించేందుకు ముందుకుసాగడం. -ప్లాస్టిక్ వాడకం పూర్తిగా తగ్గించి ఎకో వస్తువులు ఉపయోగించేలా అవగాహన కల్పించడం.