Contributed by భరద్వాజ్ గొడవర్తి
సమయం సుమారు అర్ధరాత్రి 'ఒంటి గంట' కావొస్తోంది, హైదరాబాద్ నుండి రాజముండ్రి ప్రయాణిస్తున్న బస్సు ఒక 'ధాబా' ముందు ఆగింది.
ఎలాగైనా బలవంతంగా తన ధాబా 'పరోటా' రుచి చూపియాలని ఆ ధాబా వాడు గట్టిగా నిశ్చయించుకున్నాడు కాబోలు!! సౌండ్ చెవులు దద్దరిలెలా పెట్టాడు.
ఆ పాటల సౌండ్ కి మేలుకున్న నేను, పక్క సీట్లో ఉన్న నాన్న ఇంకా మేల్కొని ఉండడం గమనించి
నేను: ఏంటి నాన్న, నిద్ర పట్టట్లేదా??
నాన్న: టీవీ సౌండ్ ఎక్కువగా ఉందిరా బస్సులో, అందుకనే నిద్ర పట్టలేదు.
నేను: టీ తాగుతారా?
నాన్న: తీసుకో.
టీ తీసుకోని, ఎప్పటిలానే ఫోన్ తీసి ప్రపంచంతో సంబంధం లేకుండా "ఫేస్బుక్" ఓపెన్ చేసి, ఏ కొత్త విషయం లేకపోయినా రిఫ్రెష్ బటన్ కి కూడా విసుగు వచ్చేలాగా రిఫ్రెష్ చేస్తూ ఉన్న!!
ఫోన్ కి కూడా విసుగు వచ్చినట్లు ఉంది, హ్యాంగ్ అయిపొయింది.
ఒక్కసారి ప్రపంచంలో ఉన్న బాధ అంతా నాకే వచ్చేసింది, ఎంత ప్రయత్నిస్తున్న ఆ ఫోన్ పనిచేయట్లేదు!! దీనికితోడు ఆ ధాబా వాడు నా సిట్యుయేషన్ కి సింక్ అయ్యేలాగా పాట కూడా పెట్టాడు??
"నీ పంతం నీదే అంటావే, నా సొంతం అయ్యే దారున్నా కనపడనంటావే"
"ఎందుకు, ఎందుకు, ఎందుకు నీకీ మొండితనం ఓ ఫోనూ, నాకు దూరం అవ్వడమే గెలవడమా!!"
వారం రోజుల నుండి నా దెగ్గరే ఉంటున్నా 'ఆఫీస్, సినిమాలు, ఫేస్బుక్, ట్విట్టర్లతో' మునిగిపోయిన నాతో మాట్లాడానికి సమయం దొరకని మా నాన్నకి, ఇదే సరైన సమయంగా తోచినట్టు ఉంది.
మొదటి సారి నా చేతిలో ఫోన్ లేకపోవడంతో, మా నాన్న ఆనందానికి అవధులు లేవు, అంత గోలలో కూడా ఆయనకి బోల్డంత నిశబ్దం దొరికింది. ఇది అనువుగా నాతో సంభాషణ మొదలు పెట్టారు.
ఆ కాస్త సమయంలోనే చాల విషయాలు మాట్లాడుకున్నాము మేము, కానీ మా సంభాషణలో, మా నాన్న చెప్పిన ఒక సంఘటన నాకు బాగా గుర్తు ఉంది,
"తన ఫ్రెండ్ సుబ్బారావు గురించి చెప్తూ, అతను ఎప్పుడూ తన పిల్లల పట్ల అసంతృప్తిగా ఉంటాడని, గొప్ప చదువులు చదివించి, ఉన్నత హోదాలో ఉండేలా చేసిన తమకి ఇవ్వాల్సిన సమయం ఇవ్వరని, కనీసం వాళ్ళకోసం కేటాయించిన వాటిగురించి కూడా తెలుసుకునే సమయం లేదు అని, టూర్లు, పబ్ లు, పార్టీలు, ఫోన్లు, వీటిలో పొందే ఆనందం తమతో సమయం కేటాయించడంలో పొందరని చెప్తూ, బాధపడుతూ, ఉంటారు, అని చెప్తూ ఉండగా
బస్సు మొదలైంది, మా సంభాషణకు అక్కడితో బ్రేక్ పడింది, నా మనసాక్షికి ప్రయాణం అప్పుడే మొదలైంది,
నాకు ఆ సంభాషణ విన్నాక మొదటిగా కలిగిన భావన "నేను ఈ బాపతేగా కదా, ముమ్మాటికీ"!!
అవును నిజమే చిన్నప్పటినుండి ఆకాశం అంత ఎత్తు ఎదగాలని, ఆలా ఎదగడానికి నిచ్చనని అందించి, ఇంకా అందుకోపోతే తన భుజాలమీద ఎత్తుకొని, ఎలాగో అలాగే ఆ ఆకాశాన్ని అందుకునేలా చేస్తారు.
తీరా మనం ఆ ఆకాశం అందుకున్నాక, అక్కడ ప్రేపంచాన్ని బాధ్యతగా తీసుకోవడం మొదలు పెడతాం, అక్కడి సంస్కృతికి లోపడిపోతాం, మనదంటూ కానీ ప్రపంచంలో, అంత పెద్ద రంగస్థములో, మనదంటూ కానీ పాత్రని మనకి ఆపాదించుకొని అదే సర్వము అనే భ్రమలో బ్రతుకుతూ ఉంటాం, ఇంత గందరగోళంలో మనకి భూమి నుండి ఆకాశానికి నిచ్చన్న వేసిన వాడి ప్రాధాన్యతని మనకి తెలీకుండానే తగ్గిస్తూ ఉంటాం.
కానీ ఆ భూమి మీద ఉన్నవాడు, అప్పటిదాకా తమతో భూమి మీద వున్న తన కొడుకును/కూతురును ఆకాశానికి చేర్చడమే పరమావధిగా పెట్టుకున్నవాడు, తీరా ఆకాశానికి చేరాక, అప్పటిదాకా తమతో ఉన్నపుడు లెక్కచేయని సమయం కోసం వెంపర్లాడడం మొదలు పెడతారు. తమ కోసం కేటాయించే కాస్త సమయానికే పొంగిపోతూ ఉంటారు. ఇంత సంఘర్షణ అనుభవిస్తూ ఉన్నా, తన సమాజంలో తన పిల్లలని ఎప్పుడు అంబారిమీద మోస్తూనే ఉంటారు!!
ఇలా ఆలోచిస్తూ ఉండాగా
నాన్న: పడుకో నాన్న, పొద్దున్న ఎప్పుడు లేచావో ఏంటో!