జైలు అంటే అది శిక్షను విధించే బందిఖానా కాకూడదు తమ తప్పును తాము తెలుసుకుని కొత్త మనిషిగా రూపాంతరం చెందే ఓ గొప్ప కర్మాగారంలా ఉండాలని చెప్పి భారతదేశంలోని చాలా జైళ్ళను ఉన్నతమైన పద్దతులతో తీర్చిదిద్దుతున్నారు. వారిని శిక్షించడం కాదు వారికో బ్రతుకుతెరువు చూపాలని జైళ్ళశాఖ డీ.జి కృష్ణంరాజు గారు ఐజి జనార్ధన్ కలిసి ఈ అద్భుతమైన కేఫ్ స్థాపించడం జరిగింది.
సుమారు మూడు సంవత్సరాల క్రిందట స్థాపించిన ఈ కేఫ్ లో దొరికే ఆహార పదార్ధాలు అన్ని కూడా కడప జైలు మహిళా ఖైదీలు తయారుచేసేవే. ముందుగా పురుష ఖైదీల కోసం ఏర్పాటుచేసిన ఈ కేఫ్ ఆ తర్వాత మహిళ ఖైదీలు ఇందులో భాగం అయ్యారు. ఈ కేఫ్ కూడా నేషనల్ హై వే మీద ఉండడం, ఇంకా రుచి విషయంలో కూడా మంచి మార్కులు పడడంతో ఇక్కడికి వినియోగదారులు ఎక్కువగా వస్తుంటారు.
కడప మహిళా జైలులో మొత్తం 60 మంది ఖైదీలున్నారు ఇందులో వంటలలో మంచి ప్రావీణ్యమున్న ఖైదీలు కూడా ఉండడంతో అరిసెలు, కజ్జికాయలు, జంతికలు, లడ్డులు, సీమకారంతో చేసిన కంది పొడి ఇలాంటి 30రకాల ఆహార పదార్ధాలను ఖైదీలు తయారుచేస్తుంటరు. మొదట ఈ కేఫ్ ప్రారంభించినప్పుడు పోలీసులు, ఖైదీలు నిర్వహిస్తున్న కేఫ్ అని చెప్పి అంతగా రాకపోయినా గాని రుచి, నాణ్యత విషయంలో ఉన్నత ప్రమాణాలు ఉండడంతో ఇప్పుడు ఈ కేఫ్ చాలా బాగా ఆదాయాన్ని అందుకుంటుంది.
ఇందులో ఆహారపదర్ధాలకు అవసరమయ్యే పెట్టుబడి అంతా ప్రభుత్వం భరిస్తున్నా గాని లాభాలలో కొంత మొత్తాన్ని ఖైదీలకు కూడా అందిస్తున్నారు. జైలు జీవితం తర్వాత అసలు ఎలాంటి జీవితం ఉంటుందో, తమకు ఉద్యోగం ఎవరిస్తారో అనే భయపడుతున్న ఖైదీలకు ఈ కేఫ్ ద్వారా ఏ భయం లేకుండా తమ కాళ్ళ మీద తాము బ్రతికేందుకు కొండంత ఆత్మవిశ్వాసాన్ని అందిస్తున్నారు.
Image Source: Eenadu