ఈ రోజు(మే28) మా పెళ్లి రోజు. నా భార్యకు కనీసం ఒక చీర కొనడానికి కూడా నాకు స్థోమత లేదు, మా పిల్లలతో బయటకు వెళ్ళినప్పుడు 'నాన్న నాకది కావాలి' అని అడుగుతుంటారు, వాటిని కూడా కొనివ్వలేని స్థితిలో ఉన్నాను. ఐన కానీ నాకు టీచర్ వృత్తి మీద ఏ విధమైన కంప్లైంట్స్ లేవు, మొదటినుండి ఎలా గౌరవంగా ఉన్నానో ఇప్పటికి టీచింగ్ పట్ల అంతే గౌరవంతో ఉన్నాను. - కోటేశ్వరరావు గారు.
మొదట తల్లిదండ్రులు ఆ తర్వాత ఉపాధ్యాయుల మీదే ఈ దేశ ప్రగతి ఆధారపడి ఉంది. దాదాపు 15 సంవత్సరాలుగా టీచర్ గా పనిచేస్తున్న కోటేశ్వరరావు గారు లాక్ డౌన్ కారణంగా మూడు నెలలుగా జీతాలు రాకపోవడంతో ఇద్దరు పిల్లలున్న కుటుంబాన్ని బ్రతికించడం కోసం కూలి పనిచేయడం మొదలుపెట్టారు. తాను కరుగుతూ ఇతరులకు వెలుగునిచ్చే కొవ్వొత్తి లాంటి జీవితం ఉపాధ్యాయునిది. కోటేశ్వరరావు గారి పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది.
మిగితా ఏ ప్రొఫెషనలో ఐన తన అభివృద్ధి గురించి ఎక్కువ ఆలోచిస్తారు. విద్యార్థి అభివృద్ధి, తద్వారా సమాజపు అభివృద్ధిని పూర్తి స్థాయిలో కోరుకునేది ఉపాధ్యాయులు మాత్రమే. -కోటేశ్వరరావు గారు.
నా డ్రీమ్ టీచర్ అవ్వడం: మనందరికీ గుర్తే ఉంటుంది స్కూల్ లో ప్రతి ఒక్కరినీ నీ డ్రీమ్ ఏంటని అడుగుతూ ఉంటారు. చాలా తక్కువమంది మాత్రమే అప్పుడు చెప్పిన డ్రీమ్ ఫుల్ ఫిల్ చేసుకుంటారు. డ్రీమ్ సాధించడమంటే కోట్లాది స్పెర్మ్ సెల్స్ తో పోటీ పడి ఈ భూమి మీదకు రావడమే. కోటేశ్వరరావు గారు చిన్నతనం నుండి టీచర్ అవ్వాలని కలలు కన్నారు. చిన్నప్పుడు ఆరో తరగతి నుండి పది వరకు కూడా ఎప్పుడు 'సెల్ఫ్ డెవెలెప్మెంట్' కండక్ట్ చేసినా గాని మాథ్స్ టీచర్ గా చేసేవారు. B.Ed, పీజీ పూర్తిచేశారు, ఎన్నో పరీక్షలు రాశారు కానీ రకరకాల కారణాల వల్ల గవర్నమెంట్ స్కూల్ లో జాబ్ రాలేదు. పర్వాలేదు వేదిక మారితే ఏంటి లక్ష్యం ఒక్కటే కదా అని ప్రైవేట్ స్కూల్ లో టీచర్ గా పనిచేయడం మొదలుపెట్టారు.
మూడు నెలల నుండి జీతాలు లేవు, వచ్చే మూడు నెలల వరకూ జీతాలు కూడా రాకపోవచ్చు. -కోటేశ్వరరావు గారు. స్కూల్ మేనేజ్మెంట్ ఎలా వాడుకుంటారు అంటే.! టీచర్ గారి ఊరు సూర్యాపేట జిల్లా మునగాల మండలం. పుట్టి పెరిగిన ఊరు కన్నతల్లిలాంటిది, ఊరిని బాగుచేసుకోవాల్లన్న ఉద్దేశ్యంతో స్ఫూర్తి అనే యువజన సంఘం స్థాపించారు. సాక్షార భారతి సరిగ్గా విధులు నిర్వహించకపోయినా, పంచాయితీ సరిగ్గా పనిచెయ్యకపోయినా, అలాగే పిల్లలు మధ్యలోనే చదువు ఆపేస్తే వారితో డిస్టన్స్ ఎడ్యుకేషన్ ద్వారా డిగ్రీలు పూర్తిచేయడానికి కృషిచేసేవారు. 2006లో ప్రైవేట్ టీచర్ గా ఉద్యోగం మొదలుపెట్టినప్పుడు వారి నెల జీతం పదిహేను వందల రూపాయలు. పది సంవత్సరాల పాటు అదే స్కూల్ లో పనిచేస్తే పదివేలకు చేరుకుంది. ఒకరోజు మేనేజ్మెంట్ వారు కోటేశ్వరరావు గారిని పిలిపించి మీకింత జీతం ఇవ్వలేమని, మీరు మరోచోట ఉద్యోగం వెతుక్కొండని ఇన్ డైరెక్ట్ గా చెప్పారు. దానికి అసలు కారణం 'ఈయనకు పదివేలు ఇచ్చేకంటే మూడు వేల చొప్పున ముగ్గురు కొత్త టీచర్లను పెట్టుకోవచ్చు' అనే స్ట్రాటజీ. దేశంలో నిరుద్యోగ సమస్య పెరిగిపోయింది, స్కూల్స్, ఇతర కంపెనీలు తక్కువ జీతానికే పనిచేయించుకుంటున్నాయి. నువ్వు మానేస్తే మానెయ్యి, నువ్వు చేయకుంటే చాలామంది తక్కువ శాలరికే చేసేవారున్నారు అనే అతిగొప్ప ఆత్మవిశ్వాసం వారిది.
బయట ప్రపంచంలో ఉపాధిహామీ పథకం మీద రోజుకు రూ.150/రూ.200 ఇస్తున్నామని అధికారులు అంటున్నారు కానీ, ఇక్కడ మాకు మాత్రం రోజుకు రూ.30, రూ.50 అలా వస్తున్నాయి. నేను ఒక వారం రోజులు పనిచేస్తే అన్నిరోజులకు కలిపి రూ.250 మాత్రమే కూలి ఇచ్చారు. -కోటేశ్వరరావు గారు.
ఎలా ఉపాధ్యాయులు బ్రతుకుతారు.? కోటేశ్వరరావు గారు మాత్రమే కాదు ప్రైవేట్ టీచర్ గా పనిచేస్తున్న ప్రతి ఒక్కరిది దాదాపు ఇదే పరిస్థితి. నచ్చిన ఉపాధ్యాయ వృత్తిని కొనసాగించడానికి వారు పడుతున్న శ్రమ అంతాఇంతా కాదు. నా పరువు పోయినా పర్వాలేదు, నా లాంటి వాళ్ళ బాధలు ప్రపంచానికి తెలియాలి అని కోటేశ్వరరావు గారు ముందుకువచ్చారు. గురుకుల పాఠశాలలోని ఒక్కో విద్యార్థికి ప్రభుత్వం ప్రతి సంవత్సరం దాదాపు రూ.50,000 వరకు ఖర్చు చేస్తుంది, ప్రభుత్వం వారు అక్కడ అంత ఖర్చుపెడుతున్నారు, అలాగే చిన్న చిన్న ప్రైవేట్ స్కూల్స్ ను ఏరియాలాగా మార్చుకుని ప్రభుత్వం వారే వాటి బాగోగులు చూసుకుంటే అక్కడి విద్యార్థులతో పాటు, టీచర్లు కూడా బ్రతుకుతారు. ఒక టీచర్ కడుపు నిండితేనే అతను పరిపూర్ణంగా భావి భారతాన్ని నిర్మించగలడు, అర్ధాకలితో ఉంటే ఇది ఎలా సాధ్యం.??