ఒకరోజు కె.సి.ఆర్ ప్రొఫెసర్ జయశంకర్ ను ఇలా అడిగారు.. "సార్ 1952 నుండి మీరు ఉద్యమిస్తున్నారు.. 1969 తర్వాత నుండి ఉద్యమం తగ్గిపోయింది మళ్ళి ఇప్పటికి 35 సంవత్సరాల తర్వాత ఉద్యమం ప్రారంభం అయ్యింది మీకు తెలంగాణ రాష్ట్ర ఉద్యమ కాంక్ష ఎక్కువ కదా మరి ఇన్ని సంవత్సరాలు ఏమి చేశారండి.?? జయశంకర్; ఆ ఉద్యమం తర్వాత అందరిలో స్పూర్తి తగ్గిపోయింది కాని నాలో మాత్రం కాలేదు.. అక్కడక్కడా తెలంగాణ ప్రాంతంలో జరిగే చిన్న చిన్న సభలకు వెళ్ళేవాడిని.. తెలంగాణ రాష్ట్రం రావడం ఎంత అవసరమో అని ప్రతి ఒక్కరికి పేరు పేరునా వివరించేవాడిని ఆ సభలకు పట్టుమని 20మంది కూడా వచ్చేవారు కాదు ఐనా కూడా ఇన్ని సంవత్సరాలు పగలు రాత్రి అన్న తేడా లేకుండా వెళ్ళేవాడిని.. అప్పటికి నా లక్ష్యం ఒక్కటే "ప్రతి ఊరులో ఉన్న ఆ 20మందిలో ఉన్న ఉద్యమ స్పూర్తిని బతికించికోవాలి అన్నదే నా లక్ష్యం" నాకు తెలుసు ఎప్పటికో ఒకనాటికి నీ లాంటి మొండి పట్టున్న శక్తివంతుడైన నాయకుడొస్తాడు... ఎందుకంటే అన్యాయం ఉన్నచోట ప్రతిఘటన తప్పదు, అనిచివేత ఉన్నచోట ఉన్న చోట తిరుగుబాటు తప్పదు అందుకే వాటిని ఎదురించే ఆ నాయకుడి కోసం బలమైన అనుచరులను తయారుచేసుకునే పనులలో ఉన్నాను.. ఈ ఒక్కమాటలోనే అర్ధం చేసుకోవచ్చు 'ఏది ఏమైనా సరే ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం జరిగితేనే ఇక్కడి దీన ప్రజల జీవితంలో ఆనందం సిద్దిస్తుందని బలంగా నమ్మి అత్యంత కష్టపడి కనపడని గమ్యం కోసం ఏదో ఒక మొండి ధైర్యంతో పోరాడిన ధీరుడు ప్రొఫెసర్ జయశంకర్.
కొత్తపల్లి జయశంకర్ అగస్ట్ 6 1934లో వరంగల్ జిల్లా ఆత్మకూరు మండలం అక్కంపేట అనె గ్రామంలో జన్మించారు. తల్లిదండ్రులు లక్ష్మికాంత రావు, మహాలక్ష్మి లది వ్యవసాయమే ప్రధాన జీవనాధరం. పుట్టింది పల్లెటూరులో ఐనా చదివింది మాత్రం భారతదేశంలోని ప్రధాన యూనివర్సిటీలలో.. బెనారస్ హిందూ యూనివర్సిటీలో, అలిఘడ్ యూనివర్సిటీలో చదివి ఎకనామిక్స్ లో నిష్ణాతులయ్యారు, బి.యి.డి, పి.హెచ్.డి ఉస్మానియా యూనివర్సిటీలో చేశారు. టీచర్ గా ప్రోఫెసర్ గా, కాకతీయ యూనివర్సిటీకి వైస్ ఛాన్స్ లర్ గా బాద్యతలు నిర్వహించారు. 1975 నుంచి 1979 వరకు వరంగల్ లోని సీకేఎం కళాశాల ప్రిన్సిపాల్‌గా పనిచేశాడు. 1979 నుంచి 1981 వరకు కాకతీయ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్‌గా, 1982 నుంచి 1991 వరకు సీఫెల్ రిజిస్ట్రార్‌గా, 1991 నుంచి 1994 వరకు అదే యూనివర్శిటీకి ఉపకులపతిగా పనిచేశాడు. జయశంకర్ కు వ్యవసాయమంటే అమిత గౌరవం ఉండేది అందువల్ల జయశంకర్ మరణాంతరం ఆచార్య ఎన్.జి.రంగా అగ్రికల్చర్ యూనివర్సిటికి జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీగా పేరును గౌరవ సూచికగా మార్చారు. తెలంగాణ ఉద్యమం అంటే చాలామందికి కె.సి.ఆర్ మాత్రమే గుర్తుకొస్తారు కాని కె.సి.ఆర్ కు, ఉద్యమానికే గురువు జయశంకర్. మనకు ఆకాశానికి తాకే భయనం మాత్రమే కనిపిస్తుంది కాని దానికి ఆధారమైన పునాది కనిపించదు ఆ పునాదే ప్రొఫెసర్ జయశంకర్.
ఎన్నో సందేహలకు, అపోహలను లేవనెత్తుతున్న ఎంతోమందికి జయశంకర్ ఒక నిర్ధిష్ట ఆధారాలతో సందేహాలను నివృత్తి చేసేవారు. వెయ్యి ప్రశ్నలకు జయశంకర్ ఒక సమాధానంగా నిలిచారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడక ముందు నుండి పూర్వం చరిత్ర మీద సమగ్ర అవగాహన ఉండటంతో ప్రత్యర్ధులను ధీటుగా ఎదుర్కున్నారు. పేరుకు తెలంగాణ ఉద్యమాన్ని నడిపించినా ఉపాద్యాయుడిగా ఉన్నప్పుడు తెలంగాణ వారిని ఒకలా మిగితా వారందరిని ఒకలా చూసేవారు కాదు.. ఒక ఉలిని పట్టుకున్న శిల్పిలా ప్రతి ఒక్కరిని మంచి శక్తివంతమైన పౌరుడిగా సమజానికి అందించారు. జయశంకర్ ఎంతటి మొండిపట్టున్న వ్యక్తో అంతటి సున్నిత మనస్కులు కూడా ప్రజల బాధలు చూసి చలించిపోయేవారు.. 1969లో జరుగుతున్న తెలంగాణ ఉద్యమంలో కొంతమంది విద్యార్ధులపై కాల్పులు జరగడంతో విద్యార్ధులు చనిపోయారు జయశంకర్ ఆ సమయంలో అక్కడలేరు "ఆ సమయంలో నేను అక్కడున్నా బాగుండేది ఆరోజే చనిపోయేవాడిని ఇన్నిరోజులు బ్రతుకుతు తెలంగాణ ప్రజల గోస చూసే అవకాశం చూసుకుండక పోయేవాడిని అని ఎన్నోసార్లు బాధపడిన సంధర్భాలున్నారు. "
1952 నాన్ ముల్కి ఉద్యమం నుండి 2011చనిపోయేంతటి వరకు ఎన్నో ఉద్యమాలు, ఎన్నో సభలు సమావేశాలు, అమెరికా లాంటి దేశాలలో మాత్రమే కాదు ఆంధ్రప్రాంతానికి వెళ్ళి అక్కడి వారితో కూడా తెలంగాణ అవిర్భావంలో తప్పులేదు అని తన ప్రసంగాల ద్వారా ఒప్పించిన గొప్ప వ్యక్తి. చెన్నరెడ్డి నుండి చిన్నారెడ్డి వరకు కోదండరాం నుండి కె.సి.ఆర్ వరకు ఇలా ప్రతి ఒక్కరిని కలుపుకొని ఉద్యమమే ఊపిరిగా బ్రతికారు.. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి అహర్నిషలు కృషిచేశారు. పెళ్లి చేసుకుంటే తన కుటుంబం తన పిల్లలు అంటు ఎక్కడ ఉద్యమంలో భయంతో వెనకడుగు వేస్తానో అని పెళ్లి చేసుకోకుండా తన జీవితాన్నే తెలంగాణ ప్రజలకు త్యాగం చేసిన మహా త్యాగి ప్రొఫెసర్ జయశంకర్.