కరెక్ట్ గా వాడుకోవాలే కాని ఈ భూమి మీద వేస్ట్ మెటీరియల్ అంటు ఏది ఉండదండి. ఇక నుండి ఇంట్లో పనికిరాని చెత్త పేరుకుపోయి ఉంటే నువ్వు పడేయాలంటే నువ్వు పడేయాలి అని గొడవ పడాల్సిన అవసరం లేదు జస్ట్ ఒక్క ఫోన్ కాల్ చేస్తే చాలు మన ఇంటికి వచ్చి పనికి వచ్చే మన ఇంటి చెత్తనంతా డబ్బులిచ్చి మరి టోటర్(http://toter.in/) అనే సంస్థ వారు తీసుకెళతారు. హైదరాబాద్ లో స్టార్ట్ చేసిన ఈ సంస్థ ప్రతిరోజు 7 నుండి 10 టన్నుల చెత్తను కొనుగోలు చేసి ప్రతిష్టాత్మక టీ-హబ్ నుండి బెస్ట్ స్టార్టప్ గా కూడా అవార్డ్ తీసుకున్నారు.
మన హైదరాబాద్ లో ప్రతిరోజు ఎంత చెత్త బయటికి వస్తుందో తెలుసా.. 4500 టన్నుల చెత్త. ఇందులో రీ సైకిల్ అయ్యేది సుమారు 500 టన్నులు మాత్రమే. ఇలా ప్రతిరోజు మిగిలిపోయిన వేల టన్నుల చెత్త భూమిలో కలిసిపోవడమో, లేదంటే కాల్చడమో చేస్తుండంతో విపరీతమైన కాలుష్యం ఏర్పడుతుంది. ఇంతలా చెత్తను భూమిలో, వాతావరణంలో కలుపుతుండడంతో మన విషాన్ని మనమే తయారు చేసుకున్నట్టుగా ఉంది. డబ్బు సంపాదించడం కోసం మాత్రమే కాదు ఇందులో సామాజిక బాధ్యత కూడా ఉండడంతో మాతంగి స్వామినాథన్, రోషన్ వీరందరి కలయికలో ఈ సంస్థ రూపుదిద్దుకుంది. హైదరాబాద్ బాచుపల్లి కేంద్రంగా ఈ సంస్థ నడుస్తుంది. కొనుగోలు చేసిన చెత్త ద్వారా ఎరువులు(పాడైపోయిన ఆహారం నుండి), టీ షర్ట్స్, షూస్, కూల్ డ్రింక్ బాటిల్స్, టాయ్స్ ఇంకా రకరకాల వస్తువులను రీసైకిల్ చేసిన మెటీరియల్స్ తో తయారుచేస్తున్నారు.
సంస్థ స్టార్ట్ చేసినప్పుడు అందరిలాగే వీరు కూడా చాలా రకాల ఇబ్బందులు ఎదుర్కున్నారు. ఇలా ఫోన్ చేసి పిలిచే బదులు మన ఇంటిదగ్గరనే అమ్మేయచ్చు కదా అని చాలా మంది వారి ఇంటిదగ్గర ఉన్న షాప్స్ లోనే అమ్మేవారు. కాని మిగిలిన షాప్స్ కన్నా ఇక్కడే మరింత ఎక్కువ ధరకు కొనడం, ఫుడ్ దగ్గరినుండి పనికిరాని వస్తువులను మంచి ధరకు కొనడం, సర్వీస్ నచ్చడంతో వీరికి కస్టమర్ల సంఖ్య పెరిగి బిజినెస్ మంచి లాభాలలో నడుస్తుంది. కేవలం ఇంట్లో నుండి మాత్రమే కాదు గూగుల్, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, యూనీలివర్, టెట్రాప్యాక్, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ భవన నిర్మాణ సంస్థలు.. మొత్తం కలిపి దాదాపు 60కి పైనే కార్పొరేట్ సంస్థలు వీరి కస్టమర్ల జాబితాలో ఉన్నాయి.