This Organization Is Developing Government Schools In A Way You'd Never Imagine!

Updated on
This Organization Is Developing Government Schools In A Way You'd Never Imagine!

ఒకప్పుడు ఖమ్మం జిల్లా బసీత్ నగర్ తండా గ్రామీణ ప్రాంతంలోని గవర్నమెంట్ స్కూల్ కి వెళ్ళే పిల్లలందరిలో చాలామంది "చదువు" కోసం వెళ్ళేవారు కాదు మధ్యాహ్నం పెట్టే భోజనం కోసం మాత్రమే వెళ్ళేవారు. ఇది వినడానికి అత్యంత దయనీయంగా ఉన్నా జీర్ణించుకోవాల్సిన కఠిన వాస్తవం. ఇంకో హృదయ విధారకమైన పరిస్థితి ఏంటో తెలుసా "ఆ మధ్యాహ్నం చేసే భోజనానికి సైతం కంచాలు లేకపోవడం. ఒక్కో కంచంలో ఒకేసారి ముగ్గురు పిల్లలు కలిసి భోజనం చేసేవారు. ఎంతోకాలం ఈ పరిస్థితే రాజ్యమేలింది. ఈ వార్త ఎక్కడో అమెరికాలో ఫ్లోరిడాలో ఉన్న శైల గారికి చేరింది. యుద్ధ ప్రాతిపదికన స్కూల్ యాజమాన్యం సూచనల మేరకు పిల్లల భోజనానికి అవసరమయ్యే కంచాల దగ్గరి నుండి పుస్తకాలు, పెన్సిళ్ళు, సైకిళ్ళు ఆఖరికి అక్కడి బాలికల వ్యక్తిగత అవసరాలను సైతం తీర్చి "సేవ"లో ఉండే అద్వితీయమైన ఆనందాన్ని జీవితంలో మొదటిసారి చవిచూశారు.

నా ఒక్క చేతితోనే ఇంత జరిగితే నాతో మరిన్ని చేతులు కలిస్తే ఎన్ని స్కూల్స్ బాగుచేయవచ్చు.. ఎంతమంది విద్యార్ధుల బంగారు భవిషత్తును నిర్మించవచ్చు అనే దివ్యమైమ ఆలోచన శైల గారి మనసులో కలిగింది. తనతో పాటు చిన్నతనంలో కలిసి చదువుకున్న స్నేహితులైన విజయరామి రెడ్డి, దీపా కమలాకర, భాను వల్లభనేని, అర్చన పూరిణి గార్లతో ఇదే విషయాన్ని చర్చించారు. వారందరూ కూడా నిండు మనసుతో "పిల్లందరిని తమ పిల్లలుగా భావించి" ప్యూర్ ఫౌండేషన్ ను రెండు సంవత్సరాల క్రితం స్థాపించారు.

ఈరోజుల్లో నాటి మన సంస్కృతి సాంప్రదాయాలు, మానవతా విలువలు మాత్రమే కాదండి "దేశం గర్వించదగిన ఎందరో మహానుభావులను మనకందించిన ప్రభుత్వ పాఠశాలలు కూడా కనుమరుగవుతున్నాయి". వీటిని కాపాడడం కోసం ప్యూర్ టీం ఎంతగానో శ్రమిస్తుంది. కేవలం రెండు సంవత్సరాల క్రితం ప్రారంభమైన ఈ ప్యూర్ సంస్థ ఇప్పటివరకు ఎన్ని ప్రభుత్వ పాఠశాలలో తమ సేవా కార్యక్రమాలను అందించిందో తెలుసా అక్షరాలా రెండు తెలుగు రాష్ట్రలలో కలుపుకుని 125 పాఠశాలలకు పై మాటే. పేదవారికి ఒక పూట భోజనం పెట్టడం కన్నా భోజనంతో పాటుగా పేదరికాన్ని నిర్మూలించడం ఒక చక్కని పరిష్కారం. పేదరికాన్ని నిర్మూలించే శక్తి చదువుకు ఉన్నది. ఆ చదువును అందుకోవడానికి విద్యార్ధులకు ఏ విధమైన ఆటంకాలు పిల్లలకు కలుగకుండా ప్యూర్ టీం శాంతి పోరాటం చేస్తున్నారు.

ప్రభుత్వ పాఠశాలల అభ్యున్నతి విషయంలో మాత్రమే కాదు అన్ని రకాల సేవా కార్యక్రమాలలో ప్యూర్ టీం ఆత్మీయతతో ముందుంటుంది. వికలాంగులకు లక్ష రూపాయాలు అంతకన్నా ఎక్కువ విలువ చేసే కృత్రిమ కాళ్ళు సమకూర్చడం నుండి డిగ్రీ, ఇంజినీరింగ్ విద్యార్ధులకు కాలేజీ ఫీజు చెల్లించడం వరకు కూడా వీరు ముందుంటారు.

రెండు సంవత్సరాల నుండి 125 స్కూళ్ళు, విద్యుర్ధుల ఫీజులు, వికాలంగులకు కృత్తిమ అవయవాలు, వీల్ ఛైర్లు లాంటి ఎన్నో రకాల సేవలకు గాను అమెరికా తానా నుండి తెలుగు రాష్ట్రాలలోని వివిధ సంస్థల నుండి వివిధ పురస్కారాలను కూడా అందుకున్నారు. "సమాజానికి మా వంతు బాధ్యత మేము చేస్తున్నాం తప్ప అవార్ఢులు అందుకోవడం మాకు అంతగా ఇష్టముండదు, మా కార్యక్రమాల వల్ల మరింత మంది ముందుకు వస్తే అవ్వే మాకు లభించిన గొప్ప అవార్ఢులుగా భావిస్తామని" వినమ్రంగా బదులిస్తుంటారు ఈ ప్యూర్ టీం సభ్యులు..

జిడ్డు కృష్ణమూర్తి గారు ఓ సందర్భంలో ఓ అద్భుతమైన మాట చెప్పారు "నువ్వు ఒక బిడ్డకు జన్మనిచ్చినంత మాత్రాన తల్లివి/ తండ్రివి అనిపించుకోలేవు ఈ ప్రపంచంలోని పిల్లల్లందరిని నీ బిడ్డలుగా నిండు మనసుతో భావించినప్పుడు మాత్రమే నీవు అసలైన తల్లివి, తండ్రివి అవుతావు" అని అంటారు. ఆ రకంగా చూసుకుంటే ఈ ఐదుగురు సభ్యులు నిజమైన తల్లిదండ్రులే..