అందరు పుష్ప ఈ పాటికే చూసే ఉంటారు కదా. చూడకుంటే చూసాక కంటిన్యూ చెయ్యి మచ్చ. చూస్తే గనుక సినిమా చివర్లో వచ్చే సాంగ్ మర్చిపోయుండరు. షెకావత్ సార్ కి, పుష్ప కి మధ్య రాజుకున్న శత్రుత్వం తరువాత జరిగే పరిణామాలకి సంకేతంగా ఆ పాట, ఆ పాట లోని లిరిక్స్ ఉంటాయి. ఈ పాటని రాసింది, జొన్నవిత్తుల గారు. ఏదైనా హోమం జరుగుతున్నప్పుడు, సంకల్పం చెప్తారు. ఈ కారణం కోసం ఈ హోమం చేస్తున్నాం అని, అలా ఓ సంకల్పం చెప్తున్నప్పుడు, శ్లోకం చెప్తారు. అలాంటి శ్లోకమే ఈ పాట.
పాట లోని ప్రతి పదానికి అర్థం ఏంటో తెలుసుకుందాం రండి.
సాహిత్యం:
హిరణ్య పుష్ప ప్రాభవం
అరణ్య యుద్ధ ప్రావృతం
కుతంత్రయుక్తం రక్త సిక్తం
మృత్యు నిర్యుక్తం
నిరంత విస్మయ దుశ్క్రుతం
పురస్త్రశస్త్రా సంహతం
సేన వృత్తం చద్మ ఛత్రం
శృంఖలాశ్లిష్టం
నక్ర నాటక వక్ర కాతుక
చక్ర వ్యూహ స్థావరం
రక్త చందన వృక్షకారణ
ఖగచ ద్వంద్వ యోధనం
ప్రపంచ దారుణ వన్య విధ్వంసం
విరామ శూన్య రణాంగనం
విఘాత బాణ పురస్కృతం
త్రిశూల వర్షం తీవ్ర హర్షం దేహ నిర్లక్ష్యం
మహోగ్ర వాయ ప్రేరితం
మనుష్య జంఝమారుతం
అదృశ్య హస్తం అస్తవ్యస్తం రాక్షసావ్యస్తం
నిత్య వంచక వృక్షనాశక
ప్రకృతి శత్రు ప్రాపకం
అగ్ని పుష్ప మహాటవీఘన
తస్కారాగ్రణి జ్రుంభనం
త్రిదుషంవా లయ వినం శ్రుజతీ
ప్రతిపదార్థం:
హిరణ్య : బంగారం, ధనం
పుష్ప ప్రాభవం: పుష్ప ఆధిక్యం,
అరణ్య: అడివి
యుద్ధ: రణం, యుద్ధం
ప్రావృతం: కప్పుకొనబడింది, కమ్మేసింది
కుతంత్ర యుక్తం: కుట్రలతో నిండినది
రక్త సిక్తం: రక్త మయం అయినది
మృత్యు: మరణం
నిర్యుక్తం/నిరుక్తం: శాస్త్రం, వేదం లో భాగం
నిరంత విస్మయ: ఎప్పుడు ఆశ్చర్య పరిచే
దుశ్క్రుతం: చెడు పనులు
పురస్త్రశస్త్ర: కత్తులుకొడవలు తో పాటు ఆధునిక ఆయుధాలతో
సంహతం: దృడంగా తయారు చెయ్యబడింది
సేన వృత్తం: చుట్టూ సైన్యంతో
చద్మ ఛత్రం: తలపై గొడుగు పట్టి ఉండి
శృంఖలాశ్లిష్టం: సంకెళ్లతో గట్టిగ బిగిసి ఉన్నది
నక్ర నాటక: మొసలి నాటకాలు
వక్ర కాతుక: వంకరచేష్టలు
చక్ర వ్యూహ: తప్పించుకోలేని వ్యూహాలు
స్థావరం; కోట, చోటు
రక్త చందన: ఎర్ర చందన
వృక్ష కారణ: వృక్షము వలన
ఖగచ: సర్పమువంటి
ద్వంద్వ యోధనం: ఇద్దరు మధ్య యుద్ధం
ప్రపంచ దారుణ: ప్రపంచం లోనే దారుణమైన
వన్య విధ్వంసం: అడివి విద్వంసాన్ని సృష్టించబోతోంది.
విరామ: విరామం, విశ్రాంతి
శూన్య: లేని
రణ+అంగనం: రణం జరిగే చోటు
విఘాత: పెద్ద దెబ్బ తీసేటి
బాణ: బాణాలతో, ఆయుధాలతో
పురస్కృతం: నిండిపోయుంది
త్రిశూల వర్షం: త్రిశూలాలు వర్షం లా కురుస్తుంటే
తీవ్ర హర్షం: అందరు పెద్దగా నవ్వుతున్నారు
దేహ నిర్లక్ష్యం: ఒంటికి తగులుతున్న దెబ్బలని పట్టించుకోవట్లేదు
మహోగ్ర: అమితమైన కోపంతో
వాయ: కొండనేల
ప్రేరితం: ప్రేరింప పడింది, ప్రభావితం అయ్యింది
మనుష్య: మనుషులు
జంఝమారుతం: హోరు గాలి ని సృష్టిస్తున్నారు
అదృశ్య హస్తం: ఎవరిదో తెలియని చెయ్యి
అస్తవ్యస్తం: అన్నిటిని చిందర వందర (ఉండాల్సిన చోట ఉండనివ్వకుండా) చేసింది
రాక్షసావ్యస్తం: రాక్షసుల చేతుల్లో ఉండేలా చేసింది
నిత్య వంచక: ఎప్పుడు ఎదుటి వారిని ఓడించాలని
వృక్షనాశక: చెట్టుని పడగొట్టాలి అని
ప్రకృతి శత్రు: ప్రకృతికి మేలు చెయ్యని పనిని
ప్రాపకం: చెప్పట్టాలని
మహాటవీఘన: పెద్ద ఘనమైన అడవిని
తస్కారాగ్రణి: ఆక్రమించేవాళ్లలో మొదట ఉండే
అగ్ని పుష్ప: మండుతున్న పుష్ప
జ్రుంభనం: విజృంభించడం, గాండ్రించడం
త్రిదుషంవ: మూడు దోషాలు వల్ల
లయ వినం: ఎవరు తగ్గే పరిస్థితి
శ్రుజతీ : సృష్టించబడుతుందో?
భావం:
ఎప్పుడైతే భూమి పై దొరికే బంగారం పైన, పుష్ప ఆధిక్యం మొదలయ్యిందో
అప్పుడే అడివి అంత యుద్ధం కప్పేసింది. ఆ యుద్ధం రక్తం తో నింపుతోంది. మరణ శాస్త్రాన్ని రాస్తోంది.
ఎదుటి వారిని అంచనాలకి అందని ఎత్తుకి పై ఎత్తులతో కత్తులు, కొడవళ్లు, తుపాకులతో చుట్టూ సైన్యం తో ధృడంగా బలగం ఉంది. తలపై గొడుగు పట్టి ఉండి, సంకెళ్లను బిగిసేలా చేస్తోంది. మొసలి నాటకాలూ, వంకర బుద్ధులున్న మనుషులు, తప్పించుకోలేని వ్యూహాలతో పుష్ప కట్టుకున్న స్థావరం(కోట) నిర్మించబడింది.
ఎర్ర చందనం వృక్షం వల్ల, సర్పమువంటి ఇద్దరి మధ్య యుద్ధం మొదలయ్యింది. ఆ యుద్ధం ప్రపంచం లో నే దారుణమైన విధ్వంసాన్ని సృష్టించబోతోంది. ఆ యుద్ధ రంగానికి విరామం లేదు, విశ్రాంతి లేదు. దెబ్బ తీసేటి ఆయుధాలు, త్రిశూలాలు వర్షం లా కురుస్తుంటే గాయాలని కూడా పట్టించుకోకుండా వికట హాసం చేస్తున్నారు.
పుష్ప కి వచ్చిన కోపం, కొండ నేలంతా పాకింది. వాడే మొత్తం హోరుగాలి ని సృష్టిస్తున్నాడు. ఎవరిదో తెలియని చెయ్యి, అన్నిటిని చిందర వందర చేస్తోంది. రాక్షసుల చేతుల్లోకి ఉండేలా చేస్తోంది. ఒకరిని ఒకరు ఓడించాలని, చెట్లని పడగొట్టాలి అని ప్రకృతికి హాని చెయ్యాలని, మొత్తంగా ఈ అడివిని ఆక్రమించాలని. పుష్ప చేస్తున్న ఈ విజృంభణం, ఎవరు తగ్గే పరిస్థితిని సృష్టించబోతోందో చూడాలి.
P.S: Song meaning telusukovali ane excitement lo, naaku telisinanthalo, nenu vethiki adiginanthalo, explain cheyyadaniki try chesaanu.. akkadakkada mistakes unte kshaminchandi. Thank you.