Contributed By Sai Ram Nedunuri
"ఈ యాంత్రిక జీవితం తో పాటు అడుగులేస్తూ అలిసిపోతున్నందుకు అనుకుంట చాలా రోజులైంది తను నా మాటలు విని .. ఎన్నో నెలలుగా కదలకుండా ఉన్న నన్ను ఇన్నాళ్ళకి తన చేతిలోకి తీసుకుంది .. ముఖము పైన జాలువారే సెలయేరు లాంటి కురులని చెవి వెనకకి తన మృదువైన వేళ్ళతో సాగనంపుతూ నా నూట ఒకటవ పేజీ ని తిరగేసింది .. ఔను కదూ మూడు వారల క్రితం నా వందవ పేజీ మాటల దాకా వినేసింది .. నా కంటే బాగా తనకే గుర్తుంది .. కురుల సెలయేరు తాకడం వల్ల అనుకుంట .. తన చెవి పోగులు ఇంకా ఊగుతూనే ఉన్నాయి .. నేను మాట్లాడడం ప్రారంభించాను .. నాకు తెలుసు నేను మాట్లాడే మాటలు తన హృదయాంతరాలలో నిదురిస్తూ ఉన్న వేల ఆలోచనల్ని తట్టి లేపుతున్నాయని. తనదైన శైలి లో మునుపంటి తో తన కింద పెదవి ని అదిమిపెడుతూ .. నాకన్నా వేల రెట్లు ఎక్కువ భావాలు పలికించగల తన అందమైన కళ్ళ ని అటు ఇటు తిప్పుతూ .. ఆ ఆలోచనలన్నింటిని ఒక క్రమ పద్దతిలో విశ్లేషించుకుంటూ .... పువ్వు లాంటి తన పాదాలు భూమాత కి అంటీ అంటనట్టు ఆనిస్తూ.. నడకకి పరుగుకి మధ్యన ఉండే అడుగుల తీరుతో .. తన వాలు జడ కాలి అందెల శబ్దానికి తగట్టు క్రబద్ధం గా ఊగుతున్న సమయం లో .. ఇంటి మేడ పైకి అడుగులు వేసింది .. . చల్లని వెన్నెల లో మనసు కి ప్రశాంతత ని చేకూర్చే పిల్ల గాలులు పలకరిస్తున్న వేల నా మాటలు వింటూ పేజీ లు తిప్ప సాగింది .... నేను మాట్లాడే అక్షరాలు భావాలు గా మారి, రకరకాల పూలు చేరి తోట కి అందాన్ని తెచినట్టు, తన మనసుకి ఆహ్లాదాన్ని పంచసాగాయి .. నేను ఒక్కొక్క వాక్యం చెబుతోంటే తాను మరింత లీనమై వినసాగింది .. నేను చెప్పాల్సిన విషయాలు అయిపోవస్తున్నాయి .. తను మాత్రం చల్లని ప్రకృతి ని సైతం పట్టించుకోకుండా నేను చెప్పే మాటలనే ఆసక్తి గా వింటోంది .. ఆఖరి పేజీ విషయాలు వినేసి నన్ను మూసింది .. ఇప్పుడు చల్ల గాలిని మనసారా ఆస్వాదిస్తూ దరహాసం తో వెలిగిపోతున్న తన ముఖము చూసి .. దివి లో ని చందమామ తో పాటు భువి మీద వెలిగే చందమామ ని చూస్తున్నందుకు మురిసిపోతున్నాను .. మాట్లాడిన ప్రతిసారీ కొత్త కోణం లో ఆలోచనల్ని ఆవిష్కరించగల నా మాటల్ని మళ్లీ ఎప్పుడు వింటుందో .. "
అంటూ ఒక అందమైన మగువ చేతిలో ఉన్న పుస్తకం తన భావాల్ని వ్యక్తపరుస్తూ ఉండగా .. నాలో కూడా కోటి భావాలు బయల్దేరాయి