సోర్స్: ఆనంద రామాయణం
అయోద్య కు మహారాజైన దశరధునికి తన కుమార్తె కౌసల్యను ఇచ్చి వివాహం చేయాలని కోసల మహారాజు పరితపించి అయోద్యకు తన దూతలను పంపిస్తాడు. ఇందుకు దశరధుడు కూడా అంగీకారం తెలపడంతో కోసల మహారాజు మహాదానందం పొంది వివాహానికి ఏర్పాట్లు చేస్తాడు. ఇటు వైపు వివాహ ఏర్పాట్లు జరుగుతుంటే అటువైపు రావణుడు పరమేశ్వరుడి ద్వారా వరాలు పొంది అప్పటికే దేవతలను దాసోహం చేసుకుంటాడు, రావణుడిని ఎదురించడం వారి తరం కాక రావణుడికి దాసోహం అయ్యారు. ఒకరోజు సృష్టికర్త, సకల జీవరాశుల తలరాతలను రాసే బ్రహ్మదేవుడిని తన లంకకు రావణుడు ఆహ్వానిస్తాడు. అతిధి మర్యాదల తర్వాత బ్రహ్మ దేవుడు రావణుడికి తన మంచికోరి 'పుట్టిన వాడు ఏదో ఒకరోజు తప్పక చస్తాడు అని హితోపదేశం చేస్తాడు'. దానికి రావణుడు అలా ఐతే నాకు మరణం సంభవిస్తుందా.. పరమేశ్వరుని పరమ భక్తుడైన నన్ను, దేవతలు సైతం చిధ్రం చేయలేని నా శరీరాన్ని ఎవరు తుదమొట్టించగలరు అని బ్రహ్మదేవుడుని ప్రశ్నిస్తాడు. దానికి సృష్టికర్త 'ఇదిగో ఇదే సమయంలో నిన్ను చంపే వ్యక్తికి జన్మనివ్వబోయే వారు పెళ్ళి చేసుకోబోతున్నారు. దశరధునికి కౌసల్య కు సాక్షాత్తు ఆ నారాయణుడే రాముడు పేరుతో పుట్టబోతున్నాడు ఆ రాముడి చేతిలోనే నువ్వు చావబోతున్నావు ఇది విధి. నీ మరణాన్ని నువ్వు ఆపలేవు.. ఇది నిజం అని బ్రహ్మ అక్కడి నుండి వెళ్ళిపోతాడు.
ఎలాగైనా వారి వివాహం జరగకూడదు జరిగితే నన్ను చంపే రాముడు పుడతాడు అని అయోద్యకు తన సైన్యంతో బయలుదేరుతాడు. ఆ సమయంలో దశరధుడు ఇంకా మంత్రి సుమంతునితో సరయూ నది నావలో జలవిహారం చేస్తుంటాడు. ఆకాశం నుండి రావణుడు ఒక్క ఉదుటన నావ మీదకు దూకి నావను ముక్కలు ముక్కలు చేస్తాడు.. దశరధునితో సహా నావలో ఉన్న వారందరూ నీటిలో మునిగిపోతారు. ఇదంతా నవ్వుతూ గర్వంతో చూసిన రావణుడు కౌసల్య ఉండే కోసల దేశానికి ఆకాశ మార్గాన పయణమవుతాడు. అక్కడ కోసల రాజును ఎదురించి కౌసల్యను చెరబట్టి లంకకు బయలుదేరుతాడు. ఆ ప్రయాణంలో రావణుడికి ఒక ఆలోచన మెదులుతుంది.. దేవతలను, సకల జీవరాశిని వణికించే నేను కేవలం ఒక మహిళను చంపడం ఏంటి.? ఈ విషయం అందరికి తెలిస్తే నా వీరత్వం ఏమవుతుంది.? మరణ భయంతోనే ఒక స్త్రీని చంపాడనే మాట నా శక్తికి కలంకం అని అలాగే ఈమెను ఎవ్వరు గుర్తించలేని ప్రదేశంలో ఉంచాలి లేదంటే ఎవరైనా వచ్చి కౌసల్యను తీసుకెళ్ళి పెళ్లి చేసే అవకాశం ఉంది, అని మార్గం మధ్యలోని ఒక దీవిలో ఒక పెట్టెలో బంధించి తన సైన్యంలోని రాక్షసుడిని తిమింగలంలా మార్చి ఆ పెట్టెకు రక్షణగా ఉండాలని ఆదేశిస్తాడు. తిమింగలం ఆ పెట్టెను మింగి సముద్రంలోకి ప్రవేశించి తన జాడ ఎవ్వరికి తెలియకుండా అటు ఇటు సంచరిస్తుంది.
రావణుడు నాశనం చేసిన నావ మునిగిపోవడంతో దశరధుడు మరియు మంత్రి సుమంతుడు తప్ప మిగిలిన వారందరూ మరణిస్తారు. దశరధుడు, సుమంతుడు నావ యొక్క పెద్ద చెక్క మీద ఎక్కి కూర్చుంటారు. గంగానది ప్రవాహం వారిద్దరిని సముద్రంలోనికి తీసుకువెళ్తుంది.. వారిని కౌసల్యను బంధించి పెట్టెను మింగిన తిమింగలం సంచరించే సముద్రంలోనికి ఆ గంగా ప్రవాహం తీసుకెళ్తుంది. అదే సమయంలో మరో భారీ తిమింగలం ఈ రాక్షస రూపంలో ఉన్న తిమింగలంపై పోరాటానికి సిద్ధపడుతుంది. పొట్టలో పెట్టె ఉండడం వల్ల సరిగ్గా పోరాడడం లేదని భావించి రాక్షస తిమింగలం పెట్టెను ఒడ్డున చేర్చి ఆ తిమింగలంతో పోరాటానికి వెళ్తుంది. దశరధుడు, సుమంతుడు చెక్కమీద వివిధ ప్రాంతాలు ప్రయాణం చేసి చివరకు కౌసల్య ఉన్న ఒడ్డుకే చేరుకుంటారు. ఒడ్డున ఏదో పెట్టె ఉందని భావించిన వారిద్దరు అక్కడికి వెళ్ళి పెట్టెను తెరిస్తే ఆశ్ఛర్యం తాను ఎవరినైతే వివాహం చేయదలుచుకున్నానో ఆ కౌసల్య ఇక్కడ బంధింపబడడం చూసి ఆశ్ఛర్యపోయాడు. ఆ తర్వాత కౌసల్య దశరధునికి జరిగినదంతా వివరిస్తుంది.. పండితులు, మహార్షులు నిర్ణయించిన ఆ శుభముహుర్తానే దశరధుడు కౌసల్యను గాంధర్వ వివాహం చేసుకుంటాడు.
పెళ్లి తర్వాత రాక్షస తిమింగలం రాకను గమనించిన ఆ ముగ్గురు అదే పెద్ద పెట్టెలోకి వెళతారు. రాక్షస తిమింగలం ఆ పెట్టెను మింగి ఎప్పటిలాగే సముద్రంలో సంచరిస్తుంది. ఈ వివాహ ముహుర్తం దాటిపోయిన కొన్ని రోజుల తర్వాత బ్రహ్మదేవుడిని రావణుడు లంకకు ఆహ్వానిస్తాడు. విజయ గర్వంతో రావణుడు అశేష సభికుల మధ్య "మీరు చెప్పింది ముమ్మాటికి తప్పు.. విధిని ఎదురించలేనని అన్నారు ఇప్పుడు చూడండి దశరధుని చంపి కౌసల్యను రహస్యంగా దాచాను, వారి వివాహం జరగలేదు, ఇక రాముడు పుట్టడు.. నా మరణం ఇక సంభవించదు అని గర్వంతో నవ్వుతాడు". దానికి బ్రహ్మదేవుడు రావణుడిని చూస్తూ జాలితో 'నువ్వు ఎప్పటిలాగే ఇప్పుడు పొరబడ్డావు.. దశరధుడు బ్రతికే ఉన్నాడు, మహార్షులు నిర్ణయించిన శుభముహూర్తానే వారి వివాహం జరిగింది అని వివరిస్తాడు'. రావణా.. విధిని ఎదురించానని విర్రవీగకు, భగవంతుడిని ఆశ్రయించి అనీర్వచనీయమైన భక్తితో, ఆర్తితో, మంచి ధర్మంతో కూడిన కర్తవ్యం కోసం వేడుకుంటే తప్ప విధిని మార్చలేవు నీకున్న వెర్రి అహంకారంతో విధిని ఉల్లంఘించలేవు.. నీ మరణం వైపు నువ్వే వేగంగా గుడ్డిగా పరిగెడుతున్నావు. అని హెచ్చరిస్తాడు.
దానికి రావణుడు బ్రహ్మదేవునికి తాను ఊహిస్తున్నది నిజమని వివరించాలనుకుంటాడు. వెంటనే రాక్షస తిమింగలాన్ని పిలిపిస్తాడు. ఆ పెట్టెలో కౌసల్యను చూపించి తనది ఊహ కాదు వాస్తవం అని వివరించాలనే తపనతో ఆ పెట్టెను తెరుస్తాడు.. తెరిచిన పెట్టెలో దశరధుడు, కౌసల్య, సుమంతుడిని చూసి ఒక్కసారిగా రావణుడు కుప్పకూలిపోతాడు, బ్రతికుండగానే తన మరణాన్ని ముందుగానే చూశానన్న భయంతో ఆ తర్వాత వచ్చిన కోపంతో కౌసల్య దశరధుని చంపబోతాడు. అది చూసి బ్రహ్మదేవుడు "ఆగు రావణా ముర్ఖత్వంతో విచక్షణ మరుస్తున్నావు.. నువ్వు ఒక్కరిని బంధించిన పెట్టెలో ఇప్పుడు ముగ్గురయ్యారు వీరు కోట్లాది మనుషులుగా ఎందుకు మారరు.? ఇప్పుడే ఆ రాముడు పుట్టి ఎందుకు నిన్ను సంహరించడు? నీ వీరత్వాన్ని, శూరత్వాన్ని దాచి భవిషత్తులో వచ్చే రాముడి మీద ప్రయోగించు అప్పటి వరకు నీ ఆయుష్షును కాపాడుకో. నీ ముర్ఖత్వంతో ఇప్పుడే ఆ మరణాన్ని ఆహ్వానించకు, మరణ సమయంలో భయంతో నూతన దంపతులను సంహరించావు అనే అపవాదుని మూటగట్టుకోకు, వీరిని అయోద్యకు పంపించి పెద్దమనిషి తరహా వ్యవహరించు అని బ్రహ్మదేవుడు హితోపదేశం చేస్తాడు. బ్రహ్మదేవుడి మాటలకు రావణుడు ఆలోచనలలో మునిగిపోతాడు.. "నా మరణాన్ని నేను ఎదురించలేక పోవచ్చు లేదా ఎదురించవచ్చు" అనే అనుమానంతోనే ప్రస్తుతానికి గండం గడిచిపోవాలని తన దూతలతో అయోద్యకు దశరధుడిని, కౌసల్యను, సుమంతుడుని పంపిస్తాడు. ప్రస్తుతానికి తాత్కాలిక ఉపశమనం లభించిందని రావణుడు ఊపిరి పీల్చుకుంటాడు.