(జరిగిన కథ - Part-1, Part- 2)
ఆయన చెపుతుంటే నేను ఊహించుకుంటున్నాను, నేను గమనించిన విషయం ఏమంటే రాధ గురించి చెప్పటం మొదలెట్టగానే బాగా వేగంగా వీచిన గాలి గోవింద్ పేరు చెప్పగానే నెమ్మదించింది. ఆ విషయం ఆయన గమనించారో లేక నాకు మట్టుకే అలా అనిపిస్తుందో తెలీదు. గోవింద్ పేరు చెప్పినప్పుడు ఆయన స్వరంలో మార్పు, కళ్ళలో బెరుకు, శరీరంలో ఒణుకు స్పష్టంగా కనపడింది. ఉండపట్టలేక అడిగేశాను మాష్టారు ఇక్కడో విషయం గమనించారా గోవింద్ పేరు చెప్పేంత వరకు బాగా వేగంగా వీచిన గాలి పేరు చెప్పగానే ఆగిపోయింది చూసారా!?. కథ చెప్పేప్పుడు మధ్యలో ఇలా ప్రశ్నలతో విసిగిస్తే చాలా విషయాలు మరుగునపడతాయ్ అబ్బాయ్ నీ ఇష్టం మరి అన్నట్టు చూసారు ఆ పెద్దాయన. “ఒక్క విషయం అబ్బాయ్ ఇది కథ కాదు, చరిత్ర కూడా ఇంకెప్పుడు చూడాలనుకోని ఓ ప్రేమజంట జీవితం. అనుకోని విధంగా మరణించిన వ్యక్తుల గురించి తెలుసుకుంటున్నావ్ మరణం తర్వాత జీవితం ఉంటుందని తెలీదు కనుక ఎలా ఉంటుందా అని తెలుసుకోవాలని ఎంతో ఆరాటపడుతున్నావ్. నువ్వు ఊహించలేని, నీ ఆలోచనకు తర్కానికి శాస్త్రానికి అంతుపట్టని సంఘటనలు సంభవించే అవకాశం ఉంటుంది. ధైర్యంగా ఉండటం మంచిదే కాని కొద్దిగా జాగ్రతగా ఉండు ఎందుకంటే మరణించిన వారి గురించి తెలుసుకోవాలని చూసే వారికోసం, ప్రతీ ఆత్మ కాచుకు కూర్చుంటుంది. మన చుట్టూ మరో ప్రపంచం ఉంటుంది నీ దృష్టి మారితే మరో సృష్టి కనిపిస్తుంది ఆ లోకాన్ని చూసి తట్టుకునే సామర్ధ్యం శక్తి దాన్ని అర్ధం చేసుకోగల ఆలోచనా స్థాయి నీకు ఇంకా లేవు. అందుకే అనవసరపు విషయాలపై దృష్టి పెట్టక చెప్పింది వింటే నీకు నాకు ఇద్దరికీ మంచిది.”
ఆయనలా చెప్పగానే అప్పటివరకు హరిశ్చంద్ర వేదిక గురించి తెలుసుకోవాలనే కుతూహలం తప్ప తెలుసుకుంటే ఏం అవుతుందో అనే భయం లేని నాకు ఒక్కసారిగా అంతా మారిపోయింది. గాలికి చెట్ల ఆకులు కదిలిన శబ్దం, మట్టి రేణువులు కదులుతున్న శబ్దం, దగ్గరలో ఉన్న ఆవులు నెమరువేస్తున్న శబ్దం, నా గుండె చప్పుడుతో లబ్ డబ్ మధ్య ఒక్క క్షణం అంతరం తో సహా అన్నీ స్పష్టంగా వినిపిస్తున్నాయి. మొదటసారి కొద్దిగా భయం కలిగింది, చుట్టూ చూడాలంటెనే చెమట పట్టేస్తుంది. పని వాళ్ళ వైపు చూసాను నేను వచ్చినప్పుడు ఎక్కడ ఉన్నారో అక్కడే ఉన్నారు ఇంచు కూడా కదలలేదు, అదే హావభావం ముఖంలో కదలిక లేదు. ఆకాశంలో మబ్బులు మింగేస్తున్నాయా అనిపిస్తుంది సూరీడిని, గాలికి కదులుతున్న చెట్ల ఆకులు చేసే శబ్దం వింత నవ్వులా వినిపిస్తుంది వెన్నులో వణకుపుట్టింది. లేచి వెళ్ళిపోదామా అనిపిస్తుంది కాని చిన్ననాటి నుండి నన్ను వెంటాడుతున్న చిక్కుముడిని విప్పే వ్యక్తిని ఎదురుగా ఉంచుకొని వెళ్ళలేకపోయాను. తెలివి వెళ్ళమంటుంది తెగువ తెలుసుకోమంటుంది. నాలోనే ఇద్దరు వ్యక్తులు కొట్టుకుంటున్నారు వెళ్ళమని ఒకరు, ఎలా వెళ్తావ్ అని మరొకరు, భయాన్ని వెంటేసుకువచ్చి బెదిరిస్తున్నాడు ఒకడు, ధైర్యాన్ని దగ్గర చేస్తు ఆసరా ఇస్తూ మరొకడు. ఒక్క మాటకే వెనుదిరిగే మనస్తత్వమా నాది కాదు అది నేను కాదు, తెలుసుకొనే వెళ్ళాలి. జరిగేది ఆపటానికి నేనేవడిని ఎలా ఉందో అలా జరుగుతుంది ఏదేమైన హరిశ్చంద్ర వేదిక గురించి తెలుసుకొనే కదలాలి అని గుండె ధైర్యం పెంచుకొని క్షమించాలి ఇక పై ఆటంకం కలిగించను చెప్పండి అన్నాను.
రాధ సొంత మేన మామ కొడుకు గోవింద్, ఇద్దరూ ఒకే రోజు పుట్టారు పుట్టిన రోజే భార్య భర్తలని నిశ్చయించారు వాళ్ళ తల్లి తండ్రులు. వాళ్ళకు ముందే తెలుసో లేక దేవుడు ముందే నిర్ణయించాడో ఏమో కాని చిన్నప్పటి నుండి రాధ గోవింద్ ఒకరిని విడిచి ఇంకొకరు ఉండేవారు కాదు. నేను వచ్చిన కొత్తలో రాధా గోవింద్ గురించి బాగా వింటుండేవాడిని, వాళ్ళ గురించి తెలీక ముందు రాధ గోవింద్ అంటే ఒక్కరే అనుకునేవాడిని. రాధని మొదటిసారి చూసింది వాళ్ళ బామ్మకు వైద్యం చేయించటానికి నా దగ్గరికి వచ్చిన రోజు. అప్పటివరకు మూలికలు, తైలాలు, మందు బిళ్ళలు, రోగులు, వాళ్ళ బాధలు చూస్తూ గడిపిన నాకు అమావాస్య రోజు చంద్రున్ని చూసినంత ఆశ్చర్యం ఆనందం కలిగాయి తనని చూడగానే. మొదటిసారి చూడగానే తనంటే ఇష్టం కలిగింది పెళ్లి చేసుకొని ఇంటికి తీసుకొచ్చేయ్యాలి అనేంత. బహుశా ఆ సమయం లో ఏ ఆడపిల్లని చూసిన అలానే ఉండేదేమో ఎందుకంటే నా దగ్గరికి వచ్చే వారందరూ ముసలి వాళ్ళే కదా. రాధ వాళ్ళది పెద్ద ఇల్లు, ఆ పక్కగానే గోవింద్ ఇల్లు. రాధ అప్పుడప్పుడు ఐనా కనపడేది కాని తన పక్కన గోవింద్ ఎప్పుడూ కనపడలేదు నాకు. వాళ్ళ ఇద్దరి ఇళ్ళలో అందరూ నాకు తెలుసు, అందరికి నేను తెలుసు. నా ఆతురుతకు దేవుడి ఆశీసులు కూడా తోడైనట్టు అనిపించింది వాళ్ళది మా సామాజిక వర్గమే అని తెలిసినప్పుడు. అప్పుడప్పుడు రాధ వాళ్ళ ఇంటిలోపలకు వెళ్ళేవాడిని, అప్పట్లోనే అత్యంత ఖరీదైన భవనం వాళ్ళది. క్రైస్లర్ మోడల్ బి-70 కారు, తెల్ల గుర్రాల బండి, ఆ పక్కగా రెండు ఎద్దుల బండ్లు, రెండు నల్లటి గుర్రాలు ఉండేవి వాళ్ళ ఇంటి ముందరి పెద్ద తాటాకు పందిరికి పక్కగా ఉన్న కొట్టంలో. జమీందారులంత కాదు కాని బాగానే ధనవంతులు. రాధ వాళ్ళకు ఏ మాత్రం తీసిపోరు గోవింద్ వాళ్ళు.
రాధ వాళ్ళ తాతగారు జబ్బు చేసి చనిపోయారు హరిశ్చంద్ర వేదిక లో మొదటి సమాది ఆయనదే. ఊరికి దూరంగా ఉన్న పదెకరాల పొలాన్ని జబ్బు పడిన వారిని పూడ్చే సమాదులకోసం దానం చేసారు వాళ్ళ తాత. దురదృష్టమో అదృష్టమో కాని ఆ పొలంలోకి ఆయనే మొదటిగా వెళ్ళాల్సివచ్చింది. చనిపోయిన తాతతో వాళ్ళిద్దరికి ఎంతో చనువు, ఆయనకు వాళ్ళంటే ఎంతో ప్రేమ, వాళ్ళిద్దరికీ పెళ్లి చేయాలని నిశ్చయించిన వ్యక్తి ఆయనే. ఆయన మరణాన్ని జీర్ణించుకోలేక పోయారు, ఆ తర్వాత ఇద్దరు కలిసి చాలా నెలలు ఆ సమాధికి దగ్గరలో ఎదురుగా ఉన్న ఒక మట్టి దిబ్బ మీద కూర్చునేవాళ్ళు ఎక్కువ సమయం. నాకు రాధంటే ఇష్టమో, ప్రేమో, ఆకర్షనో, కోరికో నాకే ఓ స్పష్టత లేదు కాని రాధని చూడటంకోసమే వాళ్ళ వీధికి వెళ్ళేవాడిని రోజు ఎదో ఒక కారణం వెతుక్కొని మరీ. తనతో మాట్లాడింది లేదు, ఎప్పుడో ఒకసారి కనిపించేది ఆ కనిపించిన ఒక్కసారే నాతో ఎంతో ఆప్యాయంగా మాట్లాడేది. తనకు నేనో దేవుడిని, వైద్యుడంటే దేవుడు అనేంత అభిమానంగా చూసేవారు అప్పట్లో. వాళ్ళ వీధికి వెళ్ళినప్పుడు అప్పుడప్పుడు గోవింద్ నన్ను చూస్తుండేవాడు, కాని తనే గోవింద్ అని నాకు తెలీదు. అలా రాధ కోసం వాళ్ళ వీధికి వెళ్ళిన ఒక రోజు, ఆ రోజే గోవింద్ అంటే అతనే అని నాకు తెలిసింది. గోవింద్ నాతో మాట్లాడిన మొదటి సంభాషణ నాకు ఎప్పటికీ గుర్తుంటుంది.
గోవింద్ అన్న మాటలు “మనం ప్రాణంగా ప్రేమించిన వారిని పెళ్లి చేసుకోగలగటం విజయం, మనం పెళ్లి చేసుకున్న వాళ్ళు మనని ప్రేమించటం అదృష్టం. విజయం గర్వాన్ని పుట్టిస్తే, అదృష్టం సంతోషాన్ని సృష్టిస్తుంది. గర్వం తెగింపుని పరిచయం చేస్తే, సంతోషం ధైర్యన్ని దగ్గర చేస్తుంది. నేను గర్వం ఇచ్చే తెగింపు కోసం ఎదురుచూస్తున్న వాడిని, నీకు ధైర్యం రావాలని కోరుకుంటున్నా.సూటిగా చెప్పాలంటే రాధ నాది, ఇకపై రాధకై మా వీధి వైపు రావని ఆశిస్తున్నా. అలా కాదు అంటే చెప్పు, రాధ పేరు కలలో వినిపించినా భయపడేలా ఇప్పుడే ఓ పీడకల చూపించి వెళ్తాను మరి.” ఈ సంభాషణ మొదలెట్టినప్పుడు నాకు గోవింద్ అనే వ్యక్తి అసలు ఎలా ఉంటాడో తెలీదు ఈ ఒక్క సంభాషణతో అతను ఎలాంటి వాడో అర్ధం అయ్యింది. గోవింద్ వ్యక్తిత్వం కొద్దిగా భిన్నంగా ఉంటుంది అని అందరు అంటుండేవారు, అతనికి రాధంటే పిచ్చి ఆరాధన అని, రాధ తనతో కాకుండా ఇంకెవ్వరితో మాట్లాడిన రగిలిపోతుండే వాడని, ప్రేమనే ముసుగు ధరించిన ఉన్మాదని, రాధ కోసం ఎంతకైనా వెళ్ళేంత పిచ్చివాడని, రాధ తనకు దక్కదేమో అనే భయం ఉండేదని ఇలా ఎవ్వరి ఆలోచనా స్థాయికి తగినట్టుగా వారు అర్ధం చేసుకొని చెప్తుండేవారు. అతను ఆవిధంగా మాట్లాడేప్పటికి నేను కూడా అందరిలానే అనుకున్నాను, కాని అతని గురించి తెలిసిన తర్వాత అతను ఆ విధంగా నన్ను భయపెట్టడానికి కారణం అర్ధం అయ్యింది. అప్పుడు ఆ విధంగా మాట్లాడటానికి కారణం రాధపై అతనికున్నది అనుమానం కాదు, రాధకు చిన్న ఇబ్బంది కూడా కలగకూడదు అనేంత అనురాగం. వాళ్ళ బంధానికి ప్రేమ అనే ఒక్క మాటతో సరిపెట్టటం సరికాదేమో నాకు తెలిసినంత వరకు వాళ్ళిద్దరూ ఒక్కటే. దేవుడు ప్రేమ అనే పదానికి ఉదాహరణగా చూపేందుకు వీరిని ఇద్దరిగా పుట్టించాడేమో. వారి బంధాన్ని ఒక్క మాటలో చెప్పాలంటే రాధ ప్రపంచం గోవింద్, గోవింద్ ప్రాణం రాధ. నాకు రాధంటే ఇష్టం, తనకు నేనంటే గౌరవం, గోవింద్ కు నా పై ఎలాంటి అభిప్రాయం ఉండేదో తెలీదు కాని రాధకు తోడుగా కలిసినప్పుడు చాలా పద్దతిగా మాట్లాడేవాడు.
"ఇప్పటికే చాలా సమయం అయ్యింది మిగిలినది రేపు చెప్తానులే ఇంకో వారం ఉంటావుగా వెళ్ళు ఇంట్లో వాళ్ళు ఎక్కడికి వెళ్ళావో అని భయపడుతుంటారు" అని కథని ఆపేసి నన్ను వెళ్ళమన్నారు పెద్దాయన. పర్లేదు చెప్పండి ఇంట్లో చెప్పే వచ్చాను మొత్తం కధ తెలుసుకొనే వెళ్తాను. "నీ కోసమనే కాదబ్బాయ్, నేను ఎక్కువ సేపు కూర్చో కూడదు మిగిలినది రేపు చెప్తాను లే చాలా ఉంది. ఈ రోజు మొత్తం కూర్చున్నా అవ్వదు వెళ్ళు వెళ్ళు" అన్నారు ఆయన. ఆయన అంత గట్టిగా చెప్పేప్పటికి వెళ్ళక తప్పలేదు. ఆ ఇంటి గేటు వేసి వస్తున్న నా వైపు అదోలా చూస్తున్నాడు రోడ్ మీద ఎదురైన ఓ పిచ్చివాడు. నా దగ్గరిగా వచ్చి "నేనొక్కడినే కాను పిచ్చివాడను. ఉన్నవారు కానరారు లేని వారిని కనుగొనరాదు. రాయి దేవుడేంటి అని ప్రశ్నిస్తే పిచ్చి అనే వారు గాలిని చూస్తూ మనిషనుకునే వీడ్ని ఏమంటారో !? ఎందుకే రామ చిలక...ఉన్నవారితొ తృప్తిపడక..." అంటూ వెళ్ళిపోయాడు.
మిగతాది తర్వాతి భాగంలో