(జరిగిన కథ – Part-1, Part- 2, Part-3, Part - 4.)
రెండు రోజులు తెలీకుండా, అర్ధంకాకుండా, సమాధానం దొరక్కుండా అలా గడిచిపోయాయి. ఆ వైద్యుడితో మాట్లాడినది నిజమా లేక భ్రమ అనే ప్రశ్నకు సమాధానం కోసం వెతుకుతూనే ఉన్నాను. అమ్మ, నాన్నకు చెప్పి వాళ్ళని ఆందోళన పడేలా చేయటం ఇష్టం లేదు. పోనీ ఒకసారి ఆ వైద్యుడి ఇంటి వరకూ వెళ్లి వద్దామా? ఆ ఇంటికి వెళ్లినట్టు తెలిస్తే అమ్మ భయపడుతుంది. అతని కొడుకు అదే ఆ పిచ్చివాడు నాతో మాట్లాడాడు కదా అంటే వాడు ఉన్నాడనే కదా వాడిని అడుగుదామా పోనీ? వాడే పిచ్చోడు పాపం...ఇంకా నాకేం చెప్పగలడు. ఆ రోజు వస్తుంటే నన్ను చూసిన వాళ్ళని అడుగుదామా ఎందుకు అలా చూసారని? ఆ రోజు వింతగా చూసారు ఇప్పుడు ఇలా అడిగితె పిచ్చోడిని చేసేస్తారేమో. హరిశ్చంద్ర వేదిక కంటే ఎక్కువగా ఈ వైద్యుడి గురించే ఆలోచిస్తున్నాను. తర్వాత రోజు నన్ను రమ్మనారు కదా, ఆ రోజు నేను వెళ్ళలేదు. ఆయన నిజంగా ఉండుంటే మరొక్కసారి ఎవరితో అయినా కబురు పెట్టేవారు కదా, మరి ఎందుకు పిలవలేదు? అసలు ఆ రోజేం జరిగిందో గుర్తుచేసుకునే ప్రయత్నం చేసాను కాని లాభం లేదు. ఆ వైద్యుడి ఇంటికి వెళ్ళే ముందు జరిగింది ఏమి గుర్తురావటం లేదు.
ఆ రోజు రాత్రి ఎదో డైరీ దొరికింది కదా, అది ఇప్పుడు కనపడటం లేదు. గది, ఇల్లు, వరండా, మేడపైన, ఇంటి వెనక, మంచం కిందా ఇలా ప్రతీ చోటా వెతికాను కాని దొరకలేదు. అమ్మని అడిగాను తెలీదని చెప్పింది, నాన్న చూసారేమో అంటే ఏంటది అని నన్నే ఎదురు అడిగారు, చెల్లి వచ్చి “ఏంట్రా తెగ వెతుకుతున్నావ్ నీ బ్యాగ్ కోసమేనా”. ఆ అవునే ఎక్కడ పెట్టావ్ ? “నీ రూమ్ లో బీరువా కింద పెట్టాను, ఏంట్రా ఏముంది అందులో అంత ఖంగారు పడుతున్నావ్ లవ్ లెటర్స్ ఏమన్నా ఉన్నాయా ఏంటి” ? ఆ...మొన్న నీకు పక్కింటి ముసలాయన రాసిన లెటర్స్ ఉన్నాయ్ కావాలా! పోవే...కాలేజి టైం అయ్యింది కదా వెళ్ళవమ్మా వెళ్ళూ...మొహం మీద ఎటువంటి ఖంగారు, భయం కనిపించకుండా అలా మాట్లాడటానికి తల ప్రాణం తోకకి వచ్చింది. తనని తప్పించుకొని రూమ్ కి లాక్ పెట్టి, బీరువా లో ఉన్న బ్యాగ్ లో డైరీ కోసం వెతుకుతున్నాను. బ్యాగ్ లో దొరకలేదు, ఏమైంది అనుకుంటూ షెల్ఫ్ లో ఉన్న బుక్స్ వైపు చూసాను వాటి మధ్యలో కనపడింది. వెంటనే తీసుకొని తెరిచి చదవటం మొదలెట్టాను. అప్పటివరకు నేను నిజం అనుకున్నది అంతా భ్రమ అని తెలిసిపోయింది డైరీ లో కొన్ని పుటలు చదివేప్పటికి. ఆ డైరీ ఆ వైద్యుడిది, ఒక పేజిలో ఆయన పని వాళ్ళ గురించి రాసారు, వాళ్ళు అస్సలు కదలకుండా అలానే ఆయన్ని చూస్తుండేవారు అని, మరో పేజి లో కొబ్బరి బొండాం పడటం, దెయ్యాల గురించి ఎవరో పెద్దాయన ఆయనకు చెప్పిన మాటలు, ధైర్యంగా ఉండమనటం, ఆయన మొదటి రోజు వచ్చినప్పుడు ఆ ఇంటి గురించి రాసుకున్నవి ఇలా అన్నిటిని చదివినప్పుడు నేనే నిజంగా వెళ్లినట్టు ఊహించుకున్నానా ? అంటే ఆ తర్వాత జరిగినది అంతా ఆయన రాసిన వాటికి నా ఊహ మాత్రమేనా ? మరి ఆ పిచ్చివాడు ? అసలు ఆ డైరీ నా దగ్గరికి ఎలా వచ్చింది అనేది గుర్తులేదు నాకు. లేదు...నేను అతన్ని చూసాను, ముట్టుకోలేదు కాని ఎదురుగా కూర్చొని పరిశీలించాను కదా. వెళ్ళాలి...తప్పదు...ఒక్కసారి చివరిసారిగా ఆ ఇంటికి వెళ్లిరావాలి. అసలు ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అనుకొని బయటకు వెళ్తున్నా అని ఇంట్లో చెప్పి బయలుదేరాను.
మధ్యానం 2 గంటలప్పుడు ఆ ఇంటి గేటు ముందు నిల్చున్నాను. దుమ్మ పట్టిపోయింది గేటు, లోపల ఎవరూ ఉంటునట్టు లేరు, రెండు రోజుల క్రితం వచ్చిన ఇళ్ళేనా అని నాకే అనుమానం కలిగింది. ఎవరైనా ఉన్నారా అని గట్టిగా అరిచాను. ఎవరూ లేరు అని సమాధానం వచ్చింది నా వెనుక నుండి. వెనక్కి తిరిగి చూస్తే ఎవ్వరు లేరు, మళ్ళీ పిలుద్దాం అని గేటు వైపు తిరగ్గానే ఎదురుగా పిచ్చివాడు. ఒళ్ళు జలదరించింది భయంతో. “మళ్ళీ వచ్చావూ...నాకు తెలుసు లే చిలక, తెలీకపోతే ఒక బాధ...తెలిస్తే తట్టుకోలేని వెధ...వద్దన్నా వినవు కదా...వెళ్ళు తెలుసుకో...అంతా మంచే జరుగుతుందని ఎవ్వరికి తెలుసు...కావలసినది అంతా నీ దగ్గరే ఉంది...హా హా హా” అంటూ గేటు తీసి వెళ్ళిపోయాడు. కొద్దిసేపు అతన్నే చూస్తూ ఉండిపోయాను, అతను అదే నవ్వుతో వెళ్తున్నాడు. బలంగా గాలి నెట్టి నట్టు అనిపించి ముందుకు కదిలాను గేటు లోపలకి. ధైర్యం చేసి ఒక్కో అడుగు వేసుకుంటూ...నేను ఇంతకు ముందు వచ్చిన దారిలో లోపలకి వెళ్ళాను. తలుపు దగ్గరికి వేసి ఉంది కాని గొళ్ళెం పెట్టి లేదు. ఎవరైనా ఉన్నారా అని పిలిచాను, సమాధానం లేదు. లోపలకి వెళ్లాను...అదో పెద్ద గది అప్పట్లో లైబ్రరీ లా వాడేవారేమో చుట్టూ పుస్తకాలు నిండిన అలమారాలు తప్ప ఇంకేం కనిపించటం లేదు. పెద్దగా దుమ్ము పట్టలేదు, చూస్తుంటే ఇంతకు ముందే ఇంకెవరో వచ్చినట్టు అనిపిస్తుంది. కుర్చీలు, బల్లాలు, పుస్తకాలు, టేబుల్ లైట్లు, సీలింగుకు చెక్క ఫ్యానులు ఉన్నాయి. చుట్టూ చూసాను గోడల మీద వరసగా చాలా పెయింటింగ్స్ ఉన్నాయి. పెయింటింగ్ లో ఆ వైద్యుడివి, కొడుకువి ఇంకా చాలా మందివి ఉన్నాయి. వాళ్ళవి కాకుండా ఇంకో ఇద్దరు వ్యక్తులు ఉన్న పెయింటింగ్ ఒకటి ఉంది. అందులో ఆడావిడ మంచి టేకు కుర్చీలో దర్జాగా కూర్చొని ఉంటె వెనుకగా ఒకతను నిలబడి ఉన్నాడు, ఇద్దరి మోహంలో నవ్వు స్పష్టంగా కనిపిస్తుంది, పెయింటింగ్ ఏ అయినా జీవం ఉట్టిపడుతుంది అందులో. బహుశా వైద్యడి కూతురు అల్లుడు అయ్యుంటారు అనుకుంటా.
ఆ గదిలో ఒక బల్లా ఎదురుగా ఉన్న నల్లటి కుర్చీ మీద ఎవరో కూర్చునట్టు మరకలు ఉన్నాయి. ఆ కుర్చీ ఎదురుగా పెద్ద కిటికీ ఉంది, అక్కడ కూర్చొని చూస్తుంటే వాళ్ళ ఇంటి వెనుక భాగం కనిపిస్తుంది. ఆ బల్ల అంతా దుమ్ము పట్టి ఉంది కాని...ఒక పుస్తకం అంత స్థలం మాత్రం దుమ్ము లేదు. ఎవరో అక్కడి పుస్తకం తీసినట్టు ఉన్నారు ఈ మధ్యే. ఆ బల్లా, కుర్చీ తప్ప నాకు ఆ లైబ్రరీ లో పెద్దగా వింతైనవి ఏమి కనపడలేదు. లైబ్రరీ నుండి ఇంటి వెనక వైపుకి వెళ్లాను, అక్కడ ఎడ్ల కొట్టం, పెద్ద కొబ్బరి చెట్టు, దాని కింద అరుగు, అరటి చెట్లు, వాటి ముందు రెండు కుర్చీలు అన్నీ ఉన్నాయి. రెండు కుర్చీల్లో ఒకటి బాగా దుమ్ము పట్టి ఉంది ఇంకోదానిపై పెద్దగా దుమ్ము లేదు. ఆ కుర్చీల దగ్గరలోనే చిన్న గాజు ముక్క మెరుస్తూ ఉంది. ఆ గాజు ముక్కను చూసినప్పటికి కాని అర్ధం అవ్వలేదు నాకు, ఆ రోజు నేను ఆ ఇంటికి రావటం నిజమే. పెరట్లో కూర్చొని కథ తెలుసుకోవటం కూడా నిజమే కాని ఆ కథ వైద్యుడు చెప్పలేదు అతని డైరీ చెప్పింది. అంటే నేను గేటు నుండి లోపలకి వచ్చి, లైబ్రరీ లో ఆ కూర్చి దగ్గర కూర్చొని ఆ డైరీ తీసుకొన్నాను. అక్కడి నుండి బయటకు వచ్చి ఈ కుర్చీల్లో కూర్చొని డైరీ చదవటం మొదలెట్టాను. ఆయన రాసిన ప్రతీ అక్షరం ఏ స్థాయిలో ఊహించుకున్నాను అంటే నిజంగా ఆయనే నా ఎదురుగా కూర్చొని చెపుతున్నారేమో అనేంత. అంతా ఈ డైరీలో ఉంది అన్నమాట అందుకే ఆ పిచ్చివాడు అంతా నీ దగ్గరే ఉంది అన్నాడు. అక్కడే కూర్చొని నవ్వుకున్నాను చాలా సేపు. మరీ పిచ్చోడిలా అవుతునన్నానేంటి అనిపించింది. తర్వాత ఏమైందో చదువుదాం అని డైరీ ఓపెన్ చేసాను. ఆ రోజు ఎక్కడైతే ఆగిపోయిందో అదే పేజి దగ్గర తెరుచుకుంది.
1924 మార్చి 1:
“రాధ గేటు దగ్గరలో ఉండగానే నాకు తెలిసిపోయేది తన మెడకు రాసే గంధం వాసన అలాంటిది మరి. తన పరికిణీకి చిన్న చిన్న ఘజ్జెలు ఉండేవి తను నడుస్తున్నప్పుడు అవి లయబద్ధంగా చేసే శబ్దం ఓ మధురమైన పాటలా అనిపిస్తుంది. రాధ మా ఇంటి ముందు గేటు మీద నిల్చుంటే గోవింద్ ముందుకు వెనక్కు ఊపుతుండేవాడు. ఆ సమయంలో తన ముఖంపై కనిపించే ఆనందానికి వెల కట్టలేము. రాధపై రోజు రోజుకు నాకు ప్రేమ పెరిగిపోతుంది, తనకు చెప్పాలంటేనే చాలా భయంగా ఉంది. గోవిందుకు తెలిసిందంటే నా ప్రాణం తీసేస్తాడు. చేతికి తెలీకుండా దానం చేయొచ్చేమో కాని గోవిందుకు తెలీకుండా రాధకు ఏమి చెప్పలేము. రాధకు కాదు గోవిందుకే చెప్పేస్తాను ఏమైతే అది జరుగుతుంది.”
ఆ తర్వాత పేజీలు చెదలు పట్టిపోయాయ్ సరిగా అర్ధం అవ్వటంలేదు. చాలా పేజీలు చదలు పట్టిపోయాయి, చదవటానికి వీలు లేకుండా. నేను డైరీ తిప్పుతూ చదవటానికి వీలైన పేజీలు చదువుతున్నాను...
1924 మార్చి 23:
“ఈ రోజు రాధ వస్తుంది, తోడుగా ఆ గోవింద్ గాడు రాకుంటే బావుండు. రాధ రాలేదు గోవింద్ వచ్చాడు. మజ్జిగలో విషం కలిపి ఇచ్చాను కాని గట్టి పిండం వీడు. దొంగ ముండ పిల్లి ఎక్కడినుండి వచ్చిందో గ్లాస్ పడేసి వెళ్ళింది. ఏంటి స్వామీ కాపాడుతున్నావా...చూస్తాను ఎంత కాలం కాపాడగలవో. ఎన్ని చేసినా రాధ నాది అంతే”
1924 ఏప్రిల్ 7:
“నేనేం చేస్తున్నానో అర్ధం అవ్వటం లేదు, రాధ మీద ఆశ పని మీద ధ్యాస లేకుండా చేస్తుంది. ఈ రోజు ఒకతను చనిపోయాడు కాదు చంపేసాను, నా అశ్రద్ధ వలన చనిపోయాడు. నా మీద నాకే అసహ్యం వేస్తుంది. ఒక్క ఆడపిల్ల కోసం ఎందుకింత ఆరాటం, ఇది నేను కాదు.”
1924 ఏప్రిల్ 12:
“రాధ మూడు రోజులు తర్వాత ఈ రోజు కనిపించింది వాళ్ళ వీధిలో. పక్క ఊరిలో సంచార గ్రంధాలయం పెట్టరాని తెలిసి వెళ్లిందంట పుస్తకాల కోసం. తెలుగు చదవటం వరకు చదువుకుంది. రాధ కోసం నేనే ఓ చిన్న గ్రంధాలయం ఎందుకు ప్రారంభించకూడదు !?”
1924 ఏప్రిల్ 19:
“మొత్తానికి అనుకున్నది ఒక్కటి అయ్యింది, చిన్న గ్రంధాలయం తయారు చేసాను. రాధ కోసమే ఇదంతా. తనకు ఎలా అయినా దగ్గరవ్వాలి. గోవింద్ కు చదువు రాకపోవటం నాకు కలిసొచ్చే అంశం. రాధతో ప్రారంభోత్సవం చేయించాలి.”
1924 ఏప్రిల్ 21:
“ఈ రోజే గ్రందాయలం ప్రారంభం జరిగింది, రాధ కు తోడుగా గోవింద్ వచ్చాడు. ఇద్దరూ కలిసి ప్రారంభించారు. రాధ పక్కన నేను నిల్చొని ఉండాల్సిన పెయింటింగ్ లో గోవింద్ గాడు ఉన్నాడు. వీడిని ఏదోటి చేసెయ్యాలి తప్పదు.”
1924 మే 12:
“రోజూ వస్తుందనుకుంటే రెండు మూడు రోజులకు ఒక్క సారి కూడా రావటం లేదు రాధ. తనని రోజూ చూడాలంటె ఇంకేదైనా చేయాలి. తనకి తెలుగు రాయటం నేర్పిస్తే ? నేర్చుకోవటం కోసమైనా రోజు వస్తుందనే ఆశ !”
1924 మే 17:
“నేను రాస్తున్న డైరీ గురించి తెలుసుకొని తనకు ఓ డైరీ రాయాలని ఉందని చెప్పింది రాధ. చాలా ఆనందంగా ఉంది. తనకొ డైరీ కొన్నాను, రేపటి నుండి తెలుగు రాయటం నేర్పించాలి. నేను అనుకున్నది ఒక్కటి జరుగుతుంది ఇప్పటికి.”
1924 జూలై 23:
“రాధని రోజూ చూడటం చాలా సంతోషంగా అనిపిస్తుంది. తనూ రాయటం నేర్చుకుంది. డైరీ కూడా మొదలెట్టింది. డైరీ గ్రంధాలయం లోనే ఓ లాకర్ లో పెట్టి ‘కీ’ తను తీసుకువెళ్తుంది. నాకు అర్ధం అవ్వలేదు అలా ఎందుకు అని ?”
1924 ఆగష్టు 2:
“వైద్యం అంతా అటకెక్కేసింది. రాధ రాధ రాధ తప్ప ఇంకేం ఆలోచించటం లేదు మనసు. రాధ నాకు కావాలి. నా మీద తన అభిప్రాయం తెలుసుకోవాలి. తను నా సొంతం కావాలి. రాధకు నేనే మొగుడ్ని, ఈ విషయంలో అడ్డొస్తే ఆ చావునైన ఎదురిస్తాను,ఆ దేవుడిని అయినా చంపేస్తాను ఇక ఆ గోవింద్ గాడు ఎంత.”
1924 ఆగష్ట్ 8:
“రాధ డైరీ లో ఏం రాస్తుందో చూసాను దొంగచాటుగా, రాధే గోవిందా అట తన డైరీ పేరు. గోవింద్ గాడు తన గొప్ప ప్రపంచం అట మరి నేనేవడిని గోడ మీద పిడకనా !? నువ్వు నాదానివి వాడ్ని మరిచిపో అని చెప్పాలనిపించింది కాని చెప్పలేదు.”
1924 ఆగష్టు 17:
“రాధ చేతిని మొదటిసారి ముట్టుకున్నాను, ఎంత మృదువుగా ఉందొ అప్పుడే తీసిన వెన్నెలా, కాచి చల్లార్చిన జున్ను ముక్కలా. తనకు నా ఉద్దేశం అర్ధం అవ్వటం లేదా లేక నటిస్తుందా అని నాకు తెలీటం లేదు. ఏమో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇకపై.”
1924 ఆగష్టు 18:
“నిన్న రాత్రి ఎవడో చనిపోయాడని నాకు నిద్ర లేకుండా నరకం చూపించారు. వైద్యం వికటించి మరణిస్తే యముడు అంటున్నారు, బతికిస్తే దేవుడు అని అభినందించిన వాడు ఒక్కడు లేడు. రాధ వాళ్ళ తాత నా వాళ్ళ చనిపోయాడంట, ఆ ముసలి నక్క వైద్యం సవ్యంగా చేసిన బతికి సాధించేది ఏముందని. హరిశ్చంద్ర వేదిక నా వల్లే నిండుతుందట. నా ఇంటి పై అర్ధరాత్రి రాళ్ళు విసరటం, అద్దాలు పగల కొట్టటం, శవాన్ని ఇంటి ముందు పెట్టటం, గేట్లు విరిగేల విసిరికొట్టటం నాకెందుకు ఈ తలనొప్పి ? నేనెందుకు నా జీవితాన్ని ఇలాంటి జనాల కోసం వృధా చేసుకోవాలి ? ఎవడి ఖర్మ కు వాడే భాద్యుడు. పైన ఒకడు ఉన్నాడు అంటారుగా వాడే కాపాడుకుంటాడు లే వీళ్ళని. రాధని పెళ్లి చేసుకొని ఈ ఊరి నుండి వెళ్లిపోవటమే నా లక్ష్యం.”
1924 ఆగష్టు 29:
“రాధకు గోవింద్ కు పెళ్ళంట వచ్చే కార్తీక మాసంలో. నేను తన కోసం పడిన శ్రమంత వృధానా ?రాధ నాకు కావలి నాకే కావలి అంటే...అంటే...అంటే గోవింద్ చావాలి. కాదు చంపాలి. అవును నేనే చంపాలి. సమయం వృధా చేయకూడదు. ఎలా చంపాలి, వాడు నాకంటే బలవంతుడు పైగా ఇది వాడి ఊరు. పొడిచి చంపే ధైర్యం లేదు, కొట్టి చంపే బలం లేదు కాని మోసం చేసి చంపే తెలివి ఉందిగా! గోవింద్ ని నేనే చంపినట్టు రాధ కు తెలీకూడదు.”
1924 సెప్టెంబర్ 15:
“గోవింద్ గాడు ఈ పాటికి మంచాన పడుండాలి కాని దిట్టంగా ఉన్నాడు మందు పనిచేయలేదా ? ఒకవైపు రాత్రి పూట భయపెట్టే సంఘటనలు ఎక్కువ అవుతున్నాయ్. మనుషులు చేస్తున్న పనిలా అనిపించటం లేదు. దయ్యాలయ్యి నా పై పగ తీర్చుకుంటున్నారా అని భూత వైద్యుడిని సంప్రదించాను వాడేమి చెప్పలేదు. చచ్చిపోతనేమో అనే భయం వెంటాడుతుంది రాధ ని ఈలోపు దక్కించుకోవాలి.”
1924 సెప్టెంబర్ 28:
“గోవింద్ గాడికి జబ్బు చేసిన తర్వాత ఈ రోజే రాధను చూసాను. గోవింద్ పరిస్తితి రోజు రోజుకు దారుణంగా అవుతుంది నన్నేదైనా సాయం చేయమని అడిగింది. ఆ సమయం లో కూడా గోవింద్ మీద తన ప్రేమ చూస్తుంటే నాకు ఒళ్ళు మండిపోయింది. తను నాకు దక్కటం కష్టం అని నిశ్చయించుకున్నాను. కాని తనపై నాకున్న కోరిక చావటం లేదు. జీవితాంతం కాకపోయినా ఒక్క రోజుకి నా దానిలా ఉండమని ప్రాధేయపడ్డాను. తను ప్రతిఘటించింది. నేను బ్రతిమాలను తను తిరస్కరించింది. నా ఆలోచనలు అస్తవ్యస్తంగా ఉన్నాయి తను నాకు కావాలి అనే తప్ప నేనేం చేస్తున్నానో తెలీటం లేదు. ఆ గందరగోళం లో గోవింద్ పరిస్తితికి కారణం నేనే అని చెప్పేసాను. ఆ షాక్ కి తన మాట పడిపోయింది. ”
1924 అక్టోబర్ 5:
“గోవింద్ చనిపోయాడు, రాధకు నన్ను చంపేయాలన్నంత కోపం ఉంది కాని నోరు తెరిచి ఎవ్వరికి చెప్పలేదు. రెండు వారాలుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతున్నాయి, హరిశ్చంద్ర వేదిక నిండిపోయింది. గోవింద్ ని కాల్చటం కోసం పాత ఇనుప సామాన్లు అన్ని జతచేసి పడవ చేసాను. రేపు వాడిని బూడిద చేసి ఆ తర్వాత రాధ కు కుంకుమ పెట్టాలి.”
1924 అక్టోబర్ 6:
“అంతా అయ్పోయింది. గోవింద్ తో పాటుగా రాధ కూడా కాలి బూడిద అయ్పోయింది. కాలిపోతున్న తను మాట్లాడిన చివరి మాటలు ‘అంతా గుర్తుంది...తిరిగి వస్తాము !!’. ఆహా...మళ్ళీ వస్తుందట...తనేం చేస్తుందో నేను చూస్తాను.”
1924 అక్టోబర్ 23:
“రోజూ రాత్రి గ్రంధాలయం లో గంధపు వాసన వస్తుంది. గోడకు ఉన్న పెయింటింగ్ లన్నీ కింద పడుతున్నాయి రాధ గోవింద్ ఉన్నది తప్ప. పుస్తకంలో పుటలు తిప్పుతున్నట్టు, కుర్చీలు కదిలిస్తున్నట్టు, గేటుని ముందుకి వెనక్కి ఆడిస్తున్నట్టుగా శబ్దాలు వస్తున్నాయి. నాతో పాటుగా చాలా మంది ఉన్నట్టు అనిపిస్తుంది. దీపాలు ఆరిపోతున్నాయి, అప్పుడే వండిన పదార్ధాలు కుళ్ళిపోయిన కంపు కొడుతున్నాయి. నా శరీరంలో భాగాలు నా ఆదీనంలో లేకుండా పోతున్నాయి. గోవింద్ మాత్రమె అనే పదం “ఏంటండీ! ఇట్టా వచ్చారు...” చాలా గట్టిగా ప్రతిధ్వనిస్తుంది.”
1924 నవంబర్ 12:
“పని వాళ్ళు ఉండలేం అని చెప్పి వెళ్ళిపోయారు. నాకు తోడుగా ఉండేందుకు ఊరిలో ఎవ్వరు రావటం లేదు. పక్క ఊరి నుండి 15 ఏళ్ల అనాధ నాస్థిక కుర్రాడిని దత్తత తెచ్చుకున్నాను నాకు తోడుగా ధైర్యంగా ఉంటాడని. ”
ఆ రోజుతో డైరీలో పేజిలు అయ్పోయాయ్. రాధ, గోవింద్ ని చంపింది ఈ వైద్యుడేనా ? మరి ఈ వైద్యుడిని చంపింది ఎవరు ? రాధ గోవింద్ కథ ఇంతేనా ? రాధ డైరీ దొరికితే కాని అసలు కథ తెలీదు అనుకుని లైబ్రరీ లో వైద్యుడి డైరీ ఉన్న చోటులో ఉంచి ఇంటికి వెళ్ళపోతుంటే అరల్లోంచి ఎదో పుస్తకం కింద పడిన శబ్దం వచ్చింది, ఆ వెంటనే ఒక పెయింటింగ్ కూడా కింద పడింది అదే సమయంలో దట్టంగా గంధపు వాసన రావటం మొదలైంది...
మిగతాది తర్వాతి భాగం లో