(జరిగిన కథ – Part-1, Part- 2, Part-3, Part – 4, Part - 5.)
నేను వెళ్ళపోతుంటే ఓ పుస్తకం, పెయింటింగ్ కింద పడ్డాయి. పెయింటింగ్ ని తీసి బల్ల మీద ఉంచాను, పుస్తకం కోసం వెతికాను. అది ఓ పెద్ద అల్మారా కింద పడింది, అక్కడ గంధపు వాసన దట్టంగా వస్తుంది, బహుశ ఆ పుస్తకం లో గంధపు పొడి దాచారేమో. ఆ పుస్తకాన్ని అందుకొని చూసాను అదీ ఓ డైరీ లా ఉంది. మొదటి పేజి లో రాధే గోవింద అని రాసి ఉంది. రాధ డైరీ ఆ ఇది. ఇంటికి వెళ్ళాలి అనే ఆలోచన పోయి చదవాలనే ఆసక్తి పెరిగింది. అక్కడే కూర్చున్నాను డైరీ చదవటం మొదలెట్టాను. చిత్రం ఏమిటంటే డైరీ లో పేజీలు ఒక్కటి కూడా చదలు పట్టలేదు. కొత్తగా లేవు కాని చదవటానికి వీలుగా ఉంది. రాధ డైరీ లో...
1924 జూలై 12:
రాధే గోవింద ఎందుకు పెట్టానో తెలీదు కాని డైరీ మీద కలం పెట్టగానే నాకు తెలీకుండానే రాసిన మొదటి పదాలు అవి. డైరీ కి పేరేంటి అనిపించింది కాని బావుంది కాదా నేనే బావ అనట్టు.
గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుద్దేవో మహేశ్వరః గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మైసి గురవే నమః.
నాకు గురువు, మా ఊరిని కాపాడే దైవం రెండు వైద్యులు గారే. ఆయన లేకపోయుంటే నేను ఈ రోజు ఇలా రాసేదాన్ని కాదు. ఆయనకి కృతజ్ఞత ఎలా చెప్పాలో తెలీటం లేదు.
1924 జూలై 13:
ఎదో రెండు పుస్తకాలు చదవటం, కొద్దిగా రాయటం వచ్చేప్పటికి నాలో గర్వం మొదలైంది. చదువురాని వాడు కదా ఏం చెప్తాడో చూద్దాం అని చెప్పి అడిగాను బావని ఈరోజు, తన దృష్టి లో ప్రేమంటే ఏంటి అని. నా కనురెప్పల కాటుక మాటున దాగిన చీకటి గర్వాన్ని బావ చెప్పిన మాటల కాగడాల కాంతులు కాల్చేసాయి. అంతటి కాంతిని తట్టుకోలేని నా గర్వం ఎక్కడా దాక్కునే దారిలేక కనుల దారిన కన్నీరై కారి ఎక్కడికో పారిపోయినట్టుంది.
బావేం చెప్పాడంటే...
అర్ధాన్ని విడమర్చి చెప్పటానికి అదేం సిద్ధాంతం కాదు,
అర్ధం చేసుకోలేం అని వదిలేయటానికి వేదాంతము కాదు,
ఒక మనసు మరో మనసు కోసం తపించే అద్భుతమైన అనుభూతి.
మాటల్లో చెప్పేది, పదాల్లో రాసేది, చిత్రంలా గీసేది కాదు కనుకే దానికి అంత గర్వం బలుపు పొగరు.
ప్రేమంటే అంతులేని స్వార్ధం, అణిచేయలేని బలుపు, విజయ గర్వం, భయపెట్టలేని ధైర్యం, తప్పుకాని కోరిక, రాసివ్వని అధికారం, నేరం కాని తప్పు, శిక్ష లేని నేరం, సంతోషం వేసే సంకెళ్ళు, పట్టుకోలేని ఆనందం, కారణంలేని కోపం, స్వచ్చమైన స్వేచ్చ, నిర్మలమైన ఈర్ష, వీడిపోని భయం, ఆపలేని ఆత్రం. తెలివికి చిక్కని, ఆలోచనకు అందని, మెదడుకు దొరకని, తలపుని వదలని మనసుకు మాత్రమే అర్ధమయ్యే భాష ప్రేమంటే.
కాని నాకు మట్టుకు ప్రేమంటే నువ్వు(అంటే నేను) అంతే.
అప్పుడు నాకనిపించింది బావకి చదువు ఒక్కటే లేదు. చదవు వలన కలిగే తెలివి, సంస్కారం, ఆలోచన, వ్యక్తిత్వం, అనుభవం అన్నీ ఉన్నాయి. చదువురాని వాడని ఆటపట్టిద్దాం అనుకున్న నాకు బావ గొప్పతనం అర్ధం అయ్యింది.
1924 జూలై 14:
బావ చాలా గంభీరంగా, కోపంగా ఉంటారని అంటారు అందరూ. కాని నేనెప్పుడు బావని అలా చూసింది లేదు. ఒక్కసారలా చూడాలనిపించింది. ఆ కోరిక ఈరోజు తీరింది. ఎవరో పట్నం అతను మా ఊరి సాంబడి పొలాన్ని బలవంతంగా లాక్కుంటున్నాడని తెలిసి అతనితో గొడవకు దిగాడు బావ. ఆ పట్నం వ్యక్తికి...సాంబడి మీద కంటే బావ మీద కోపం పెరిగింది. మొదటిసారి బావ కోపాన్ని చూసాను బావకు తెలీకుండా. సాంబడి పొలం లో ఆ పట్నం అతన్ని బావ బెదిరించిన తీరు నాకు తెలీని బావను పరిచయం చేసింది. కోప్పడటం అంటే గట్టిగా అరవటం, కళ్ళెర్ర చేయటం, చెయ్యెత్తి కొట్టటం కాదు మా బావ శైలి వేరు. అతనితో బావ...
“నన్ను చంపటం వళ్ళ నీకేం లాభం రాదు, నేను బతికుండటం వళ్ళ నీకేం నష్టం కాదు, అందువల్ల ఈ గొడవకు అర్ధం లేదు. అలా కాదు పంచె ఎగ్గట్టాలి, నన్ను భయపెట్టాలి, చచ్చే వరకు కొట్టాలి, ఈ గొడవని ఇప్పుడే తెగ్గొట్టాలి అని నీ మనసులో గట్టిగా ఉంటె చెప్పు...నిన్ను కొట్టి, నీ మనసులోని ఆ ఆలోచనని పాతి పెట్టి, ఇంకోసారి మా ఊరిలో కాలుపెట్టటానికి భయపడేలా చేయటానికి నాకేం ఇబ్బంది లేదు.”
బావ అలా చెప్పినప్పుడు తన పొలానికి ఎటువంటి ఇబ్బంది రాదని తెలిసి సాంబడి కంట్లో సంతోషం, తను బావని ఏమి చేయలేనని తెలిసి పట్నం అతని కంట్లో భయం ఒకేసారి చూసాను నేను. మా బావ ఇంత పెద్ద మనిషి అని తెలీదు నాకు, ఎప్పుడూ నా వెంటే తిరిగే బావలో ఇంత గొప్ప వ్యక్తి ఉన్నాడని ఆ రోజే తెలిసి ఆశ్చర్యం వేసింది.
1924 జూలై 15:
చరిత్ర గురించిన పుస్తకాలు ఇచ్చే వైద్యుడు ఈ మధ్య ప్రేమకు సంబంధించిన పుస్తకాలు చదవమంటున్నాడు, ఎందుకో తెలీదు కాని ఈ పుస్తకాలు భలే ఉన్నాయి. వాటిలో చెప్పినట్టు బావ ఒక్కటి కూడా చేయటం లేదు. చాలా కథలలో ప్రేమికులు ముద్దు పెట్టుకోవటం అని రాసుంది, అవి చదివినప్పుడు ఇదేం విడ్డూరం అనిపించింది నాకు. బావ కనీసం నన్ను ముట్టుకోను కూడా ముట్టుకోడు అలాంటిది ముద్దు పెట్టుకోవటమా!? ముద్దు గురించి ఊహించుకుంటే బావుంది కాని బావని అడగాలంటేనే భయంగా ఉంది. ఐనా ఆడపిల్లని నేను అడిగితె ఏం బావుంటుంది. తప్పు కదూ. కొత్తగా ఉంది బావని చూడటం. ఎదో తెలీని అనుభూతి. ప్రతి క్షణం పరవశంతో గడిచిపోతుంది.
1924 జూలై 17:
కారు, గుర్రపు బడి ఉన్నా బావకి సైకిల్ మీద వెళ్ళటం అంటేనే ఇష్టం. అవెందుకు ఉపయోగించవ్ అని ఎన్ని సార్లు అడిగినా చెప్పేవాడు కాదు. ఎప్పుడూ లేనిది ఈ రోజు సూర్యుడి కంటే ముందుగానే లేపి, తన సైకిల్ పైన ముందు కూర్చోపెట్టుకొని పొలానికి తీసుకెళ్ళాడు బావ. మా పొలం లో కంచె పైన కూర్చొని చూస్తుంటే భూమి ఆకాశం కలిసినట్టు కనిపించే చివర వరకు కనిపిస్తుంది. మా పొలానికి ఓ పర్లాంగు దూరం లో పెద్ద చెరువు, ఆ చెరువు చాలా పెద్దది. నా జీవితంలో మొదటిసారి అంత సుందరమైన సూర్యోదయం చూసాను నేను. కాషాయ కిరణాలతో ఆకాశాన్ని పట్టిన చీకటి తెరను చీల్చుతూ వస్తున్నాడు సూర్యుడు. ఒకే సారి రెండు ఆకాశాలు, ఇద్దరు సూర్యులను చూసి ఆశ్చర్యపోయాను నేను. ఆకాశ ప్రతిబింబం మా చెరువులో మరో ఆకాశాన్ని తలపిస్తుంది. సూర్యుడి ప్రతిబింబంలో తిరుగుతున్న బాతులు చూడముచ్చటగా ఉన్నాయి. ఆ క్షణలో నాకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పి ఆ ఆశ్చర్యాన్ని అద్భుతమైన జ్ఞాపకంలా మార్చేశాడు బావ. నేను బావకు శుభాకాంక్షలు తెలిపాను ఎందుకంటే మేము ఇద్దరం ఒకే రోజు పుట్టాం. తనకు ఈనాటితో పాతిక నిండాయి, నాకు పద్దెనిమిది. మా పెళ్లి ఈ పాటికి జరిగిపోయుండాలి కాని బావకు మరీ చిన్న వయసు ఉన్నప్పుడు చేసుకోవటం ఇష్టం లేదు. ఇక బావకు ఎటువంటి అభ్యంతరం ఉండకపోవచ్చు.
1924 జూలై 21:
తాత బావని అడిగాడు మరి ఇక పెళ్లి చేసుకుంటావా అని. బావ నా అభిప్రాయం అడిగాడు. నీకు నేనంటే ఇష్టమా లేదా ఆలోచించుకొని రేపు చెప్పు రాధమ్మ అని. ఎంత ఊరికి పెద్ద అయినా ఆడపిల్ల మనసు అర్ధం చేసుకోలేని మాగాడే కదా అనిపించింది నాకు. పిచ్చి బావ...నువ్వంటే ఇష్టం లేకుండానే ఇంత కాలం నీ వెంట తిరిగానా. నువ్వంటే నాకు ఇష్టం బావ, నీ వెంట తిరగటం ఇష్టం, నేను కనపడకపోతే నీ కన్నులు నన్ను వెతకటం ఇష్టం, నేను కనపడని క్షణం నువ్వు పడే ఖంగారు ఇష్టం, నీ మాటల్లో నా పేరు వినటం ఇష్టం, నీ అడుగులు నా అడుగులను అనుసరించటం ఇష్టం, నా గురించి నువ్వు విచారించటం ఇష్టం, నా ప్రతీ కదలిక నువ్వు కనిపెడుతుండటం ఇష్టం, నా పేరు వినపడగానే నీ పెదాలపై కదిలే చిరునవ్వు ఇష్టం, నీ కన్నుల్లో కనపడే మెరుపు ఇష్టం, నీ ముఖం పై చిగురించే వెలుగు ఇష్టం, నీకు ఆకలి వేస్తే నా ఆకలి గురించి ఆరా తీయ్యటం ఇష్టం, నాకు పెట్టకుండా నువ్వు తినకపోవటం ఇష్టం, నా పై ప్రేమ కురిపించే నీ కన్నులు, ఆప్యాయత పలికించే నీ పెదాలు, అనురాగం చూపించే నీ ముఖం, ఆరాధించే నీ దేహం ఇలా ప్రతీది ఇష్టం. నన్ను వీడిపోని నీ ఆలోచనలు, నేను కానరాని నీ ఊహలు, నేను తోడురాని నీ ప్రయాణం, నన్ను మరిచిపోని నీ తలపు ఒక్క మాటలో నేను లేకుండా నువ్వు ఉండవని నాకు తెలుసు. ఇదంతా బావకు చెప్పాలనిపించింది కాని చెప్తేనే తెలుస్తుందా ఏంటి. నాకు బావంటే ప్రాణం అని బావకు తెలుసు, కాని అడగటం ధర్మం కనుక అడిగాడు.
1924 జూలై 21:
బావను చేసుకోవటం నాకు ఎంతో సంతోషం అని చెప్పాను తాతకు బావ సమక్షంలో. తాత.. మరి ఇంకెందుకు ఆలస్యం పెళ్లి ముహూర్తం పెట్టేద్దాం అని అన్నారు. నాకు ఇష్టమో కాదో తెలుసుకున్నారు కదా మరి బావకు నేనంటే ఇష్టమని తెలుసు కాని తన ఇష్టాన్ని మాటల్లో చెప్పమనండి అని అడిగాను నేను. బావ కారణాలు చెప్పలేను అన్నాడు, నేను చెప్పాల్సిందే అని పట్టుపట్టాను. ఎంత బతిమాలిన బావ చెప్పనన్నాడు, చెప్పకపోతే నా మీద ఒట్టే అన్నప్పుడు చెప్పటానికి ఒప్పుకున్నాడు. మనల్ని ప్రాణంగా ప్రేమించే వ్యక్తి తన అనంతమైన ప్రేమను మాటల్లో చెప్పటం, అది ఎదురుగా ఉండి మనం చూడటం అనేది నిజంగా అరుదైన అదృష్టం. కాని నేను ఊహించనట్టు బావేం ప్రాసలతో కూడిన వ్యాసాలు చెప్పలేదు, సుధీర్గమైన దీర్గాలు తీయలేదు, తెలీని పదాలు వాడలేదు, అవసరం లేని పద ప్రయోగాలు, అర్ధం కాని అలంకారాలు ఉపయోగించకుండా నాకు అప్పటివరకు తెలీని కొన్ని నిజాలు చెప్పాడు. బావ లో మరోకోణం చూసాను ఆ రోజు.
“నువ్వు పుట్టకముందు నుండే మా అమ్మ చెపుతుండేది, నాకోసం ఒక దేవత రాబోతుంది అని. నాకు అమ్మే దేవత ఇంకో దేవత ఎందుకూ అనిపించేది. నవ్వు పుట్టావ్, అప్పుడు నాకు ఏడేళ్ళు. అందరూ నీ పెళ్ళాం పుట్టింది రా అన్నారు. ఆ మాట నాకు అర్ధం అవ్వలేదు, వాళ్ళ ఆనందానికి కారణం తెలీలేదు. నీ ఆరవ పుట్టిన రోజు నాడు దీవెనలకోసం ఏడుకొండల సామి కోవెలకు వెళ్ళాం. తిరిగి వస్తున్న వేళ నువ్వు, నేను, తాత జట్కా బండిలో ముందు వస్తున్నాం, మన తల్లితండ్రులు వెనుక కొత్తగా కొన్న మోటారు కారులో వస్తున్నారు. ఉన్నపళంగా కారులో మంటలు రావటంతో అందరూ కారులోనుండి దూకేశారు. మీ అమ్మా నాన్న, మా నాన్న రాయి మీద పడటం వలన అక్కడే మరణించారు, మా అమ్మ పొదల్లో పడటం వలన పెద్దగా దెబ్బలు తగల్లేదు అనుకున్నాం. వైద్యశాలకు తీసుకు వెళ్ళాక తెలిసింది తానో చెట్టుని బలంగా తగలటం వలన తలలో రక్తం గడ్డకట్టిందట, తను నాతో అన్న చివరి మాటలు “గోవిందా...బావంటే బాధ్యత తీసుకునేవాడు, బాధ పెట్టనివాడు, భరోసా ఇచ్చేవాడు, భయం పోగొట్టేవాడు, భద్రంగా చూసుకునేవాడు. నువ్వు రాధకు బావవి తనని బరువు అనుకోకు ఎప్పటికీ” అని. పదమూడేళ్ళ కుర్రాడికి ఆ మాటల్లో లోతు, ఆ క్షణంలో తీవ్రత, ఆ సమయంలో ఆవేదన, తన తల్లి చివరి కోరిక అవగతం అవ్వకపోయినా ఆ సన్నివేశం మనసులో ధృడంగా నాటుకుపోయింది. అమ్మే లేకపోతె ఎందుకు బతకాలి అనిపించింది కాని...నాకు దేవత మా అమ్మ, తనే నిన్ను దేవత అని చెప్పి నాకు అప్పగించి తను దేవుడి దగ్గరికి వెళ్ళిపోయింది. అప్పుడు నిర్ణయించుకున్నాను నేను బతికున్నంత వరకు నీకు బాధంటే తెలీకూడదు, నువ్వు బాధపడిన రోజున నేను బతికుండకూడదు అని. నేను బతుకుతున్నదే నీకోసం రాధమ్మ...ఆ బతుక్కి ఓ పేరు కావాలంటే అదే ప్రేమ.”
ఆ రోజు వరకు బావకు నేనంటే ప్రాణం అనుకున్నాను కాని ఆ రోజే తెలిసింది బావ బతికుండటానికి కారణమే నేనని. ప్రాణం లా ప్రేమించే వారు దొరకటం అదృష్టం, మనల్ని ప్రేమించటం కోసమే బతకేవాళ్ళు ఉండటం వరం.
1924 జూలై 23:
రొజూ గ్రంధాలయానికి రావటం కుదరటం లేదు, ఇంట్లో రాయటం వీలుకావటం లేదు, గ్రంధాలయంలో డైరీ ఉంచి వెళ్దామా అనిపించింది కాని వైద్యుడు చూస్తాడేమో అని సందేహం కలుగుతుంది. ఈ రోజు నా వెనుక నిల్చొని నేనేం రాస్తున్నానో చూస్తున్నారు వైద్యుడు. మొదటిసారి ఆయన చూపుల్లో, ప్రవర్తనలో వ్యత్యాసం కనిపించింది.
1924 జూలై 29:
తాత కి ఒంట్లో బావుండటం లేదు. వైద్యుడు రోజు వస్తున్నాడు కాని తాత ఆరోగ్యం ఏ మాత్రం మెరుగవ్వటం లేదు. మా బంధువులట తాత పొతే ఆస్తిలో వాట ఎంత ఇస్తారని అడగటానికి వచ్చారు. ఆస్తి కోసం వచ్చారో, అంతం చేయాలని వచ్చారో ఏమో కాని బావతో కావాలని గొడవపెట్టుకున్నారు. వచ్చిన వాళ్ళు మా నాన్న వాళ్ళ తోడబుట్టిన చెల్లెలట అంటే నాకు మేనత్త, ఇన్నేళ్ళలో ఒక్కసారి కూడా ముఖం చూపించని తను ఉన్నపళంగా ఊడిపడింది. నేను గడప ఆవలె వెళ్ళమని చెప్పను కాని బావ ఇంటికి వచ్చినవారిని అలా అనకూడదని చెప్పి లోపలకి రానిచ్చాడు. మేనత్తకు ఇన్నాళ్టికి అన్న గుర్తొచ్చాడు, సంబంధం కోసం వచ్చింది, నన్ను చేసుకొని పూలల్లో పెట్టి చూసుకుంటుందట, ఎలాగో ఆస్తి లో వాట ఉంటుంది కనుక అది ఇచ్చేస్తే తీసుకువెల్తుందట. బావ మాటలతో చెప్పటానికి ప్రయత్నించాడు వాళ్ళు గొడవ పడటానికే వచ్చినట్టుఉన్నారు. బావ మీద చేయిచేసుకున్నాడు ఒకడు, చెప్పుతో కొట్టాను నేను వాడిని. బావ సర్ది చెప్పి వెళ్ళగొట్టాడు అందరిని. పైగా ఎంతకాదన్న వాళ్ళు మన చుట్టాలు, అలా దురుసుగా ప్రవర్తించకూడదు అని నన్ను మందలిస్తున్నాడు బావ. నిజానికి ఆస్తి మాది కాదు, నాన్నకు ఎవరు లేకపోయినా మంచి వాడని చెప్పి ఇల్లరికం చేసుకున్నారట. ఈ రోజు వచ్చిన ఆమె నాన్నకే దూరపు బంధువట తాత చెప్పాడు.
1924 ఆగష్టు 05:
తాత ఆరోగ్యం బాగా క్షీణిస్తుంది. మందులు పని చేస్తున్నట్టు లేవు. నాకు వైద్యుడి మీద అనుమానం కలిగింది. బావకు చెప్పాను, మరో వైద్యుడిని తీసుకువచ్చారు. అతను కూడా పరిస్తితి అదుపులో లేదు, ఇప్పుడు నేనేం చేయలేను ఇప్పటివరకు చేసిన వైద్యుడినే సంప్రదించండి అని చెప్పి వెళ్ళిపోయాడు. ఒక పక్క బావని అందరూ వాడుకుంటున్నారు, వాళ్ళ ఇబ్బందులకు పిలుస్తున్నారు. బావ గొడవపడైన ఇబ్బందులు తొలగిస్తున్నాడు. పిలిచినవాడు బావకి కృతజ్ఞత చూపించటం లేదు, గొడవపడిన వాడు బావపై కోపం పెంచుకుంటున్నాడు. నీకెందుకు బావ ఇవన్నీ అంటే “మంచి చేసినవాడికి మంచే జరుగుతుంది. ఎప్పుడైనా ఒక్కటి గుర్తుపెట్టుకో తప్పు చేస్తేనే భయపడాలి, భయపట్టేవాడిని భయపెట్టాలి, బలం లేని వాడికోసం పోరాడాలి.” అనేవాడు.
1924 ఆగష్టు 17:
తాతకు ఆరోగ్యం మెరుగుపడింది కొద్దిగా. చాలా రోజులు అయ్యిందని చెప్పి గ్రంధాలయానికి వెళ్ళాను. వైద్యుడి రూపు, ప్రవర్తన, వ్యవహారం అంతా కొత్తగా ఉంది. ఎదో ఒక వంకతో నా దగ్గరగా వస్తున్నాడు. హద్దులు దాటుతున్నాడు అనిపించింది. చేయి పట్టుకున్నాడు, చెప్పు తీసుకుకొట్టాలనిపించింది, కాని తాతకు వైద్యం చేస్తున్నాడు కదా అని ఏమి అనలేకపోయాను. ఇంటికి రాగానే తాత ఓ శుభవార్త చెప్పారు, బావకూ నాకూ పెళ్లి ముహూర్తం వచ్చే కార్తీక మాసంలో ఎనిమిదవ రోజున కుదిర్చారు. తాత కళ్ళలో ఆనందంతో నీళ్ళు నిండిపోయాయి, నాకు కూడా.
1924 సెప్టెంబర్ 28:
బావకు కూడా ఆరోగ్యం బాగుండటం లేదు. దృడంగా ఉండే మనిషి నీరసించిపోతున్నాడు. తాత చనిపోయిన నెల రోజులకే బావ కూడా మంచం పట్టాడు. ఏం జరుగుతుంది మాకు. ఎవరో పగ పట్టినట్టు ఉన్నారు. తాత చనిపోక ముందు వచ్చిన నా మేనత్త మళ్ళీ ఈ రోజు వచ్చింది బావని చూడటానికి. తన చూపులో ఎదో వేరే ఉద్దేశం కనపడుతుంది. ఊరిలో దాదాపు ప్రతీ ఇంట్లో ఒకరు మంచాన పడ్డారు. వైద్యుడు రోజూ మందులు, కాషాయాలు ఇస్తున్నాడు కాని వాటి ప్రయోజనం కనిపించటం లేదు.
ఆ రోజు తర్వాత డైరీ లో అన్నీ ఖాళీ కాగితాలే ఉన్నాయి. తర్వాత ఏమైంది, గోవింద్ ఎలా చనిపోయాడు ? వైద్యుడు చంపాడని రాధకు ఎలా తెలిసింది ? వైద్యుడే కాకుండా ఇంకెవరైనా గోవింద్ పై పగ పట్టరా ? రాధ వాళ్ళ మేనత్త ఎందుకు వచ్చింది ? ఈ ప్రశ్నలన్నీ నా మెదడుని తొలిచేసున్నాయి. టైం చూసాను అర్ధ రాత్రి దాటి పొయింది, పూర్ణమి రావటానికి ఇంకో పదిహేను రోజులు ఉండి ఉండొచ్చు, పవర్ సేవింగ్ అంతా మా ఊరిలోనే జరుగుతున్నట్టు ఉంది. వీధి లో స్థంబాలకు ఉన్న లైట్స్ వెలగటం లేదు, కొన్ని స్థంబాలకు లైట్లే లేవు. రంగయ్య మావ ఇంటి వెనక వీధిలో ఉనట్టు తెలుస్తుంది ఎందుకంటే వాళ్ళ ఇంటి వెనుక కొలిమిని ఎప్పుడూ ఆర్పిందిలేదు, కొద్దిగా పొగ వస్తుంది. దానిపైన శీతాకాలం కదూ పొగమంచు ఎలాగు ఉంది. చేయి చాస్తే అందనంత, రెండు మూడు అడుగులు వేస్తే దగ్గరయ్యేంత దూరం లో ఎవరో నిల్చున్నారు. కాళ్ళకు పూసిన పసుపు, చేతికి వేసిన గాజులు మసకగా కనిపిస్తున్నాయి కాని మొహం సరిగ్గా కనిపించటం లేదు. దట్టమైన గంధపు వాసన వస్తుంది, గాలికి ఊగుతున్న పరికిణీకి ఉన్న ఘజ్జెలు కదలటం వలన శబ్దం వినిపిస్తుంది...అంత అర్ధరాత్రి వేళ గంధం, పసుపు, ఘజ్జెలు, పరికిణీ అంటే ఎదురుగా ఉన్నది రాధా...!?
మిగిలినది వచ్చే వారం...