"ఇరవై ఒక్క సంవత్సరాల నిర్బంధ విద్య సంకెళ్ళు తెంచుకొని,
విద్యాలయం అనబడే ఖారాగారం నుండి విడుదలయ్యి,
విరమణ వయసు వచ్చిందని విద్యార్ధి అనే పదవిని విడిచిపెట్టి కొన్నాళ్ళు అలా అయ్యిందో లేదో...
నా ఊసు తప్ప ఊసుపోని ఉద్దండులెందరో; ఏం చేస్తున్నావ్ అని పదే పదే పోరు పెడుతుంటే...
ఓ మాట అందాం అంటే పెద్దవారు అనే మర్యాదను దాటలేక,
నోటినే తుపాకీగా మార్చి మాటలనే తూటాలుగా పెల్చుతుంటే తట్టుకోలేక,
కళ్ళతోనే పదాలు కూడా వర్ణించలేనంత అసహ్యంగా చూస్తుంటే పడలేక,
అమీర్ పేట్ లో ఆరు నెలలు అష్టకష్టాలు పడి కంప్యూటర్ భాష ఒకటి ఔపాసన పట్టి,
అరవై రూపాయల స్లిప్పర్లు ఆరు రోజుల్లోనే అరిగిపోయేంతగా ఆఫీసుల చుట్టూ తిరిగి,
అడిగిన వాడికి - అడగని వాడికి, తెలిసిన వాడికి - తెలీని వాడికి, ఒక్కమాటలో కనపడిన ప్రతీవాడికి కరపత్రాల్లా రెస్యూమ్ ఇస్తే,
ఏ జన్మలో చేసుకున్న పుణ్యఫలమో ఈ జన్మకు జమైనట్టుగా, ఒక్క ఇంటర్వ్యూ కి హాజరయ్యే అవకాశం వచ్చి,
ఉతకని షర్టు, ప్యాంటు పక్కరూం వాడిని పావుగంట బతిమాలి ఇస్త్రీ చేసుకొని,
నిద్రపోతున్న ఫ్రెండ్ గాడి ఫార్మల్ షూ సాక్స్ లేకుండానే వేసుకొని,
ఆటోకి డబ్బులు లేక మండుటెండలో మూడు కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లి,
గేటు ముందు గార్డుకి నా వాలకం చూసి అనుమానం వస్తే,
నేనొచ్చింది ఇంటర్వ్యూ కే అని నమ్మించటానికి నా నా తిప్పలు పడి లోపలి వెళ్లేందుకు అనుమతి సంపాదించి లోపలకి వెళ్తే,
నాలాంటి మరో ముప్పై మూడు మంది నిరుద్యోగ అభాగ్యులు అప్పటికే అక్కడ అవకాశం కోసం ఆతురుతగా ఎదురుచూస్తుంటే,
మనసొప్పకపోయినా చేయక తప్పదు కనుక వాళ్ళందరిని దాటి ఇంటర్వ్యూ పాస్ అయ్యి ఉద్యోగం సంపాదిస్తే...
ఇప్పుడు నా ఉద్యోగాన్ని చూపించి ఒకప్పుడు నాలా ఇబ్బంది పడుతున్న నీ సొంత కొడకునే తిడుతున్నావా తిక్క సన్నాసీ...పోతావ్ రరేయ్ సంకనాకి పోతావ్!"
ఒకప్పుడు నన్ను మానసికంగా ఎంతో హింసించిన మా నాన్నగారి వేలువిడిచిన చుట్టానికి దూరపు బంధువు ఒకాయన, ఓ పెళ్ళిలో కలిసినప్పుడు నన్ను చూపించి ఆయన కొడుకుని బుద్దితెచ్చుకోమని తిడుతూ, నువ్వైనా కొంచెం చెప్పరా అబ్బాయ్ అని నన్ను అడిగినప్పుడు...
పైదంతా మనసులో మెదిలినా...స్వతంత్ర భారతం కదూ వాక్స్వాతంత్రాన్ని దుర్వినియోగం చేయకూడదనే ప్రాధమిక హక్కు నిబంధనకు తలొగ్గి “మీరేదంటే అదే బాబాయ్ గారు" అని పళ్ళికిలించి పక్కకి వెళ్లాను.