A Railway Station Narrates 4 Stories Of Passengers & They Explain What Life Truly Is - Part 2

Updated on
A Railway Station Narrates 4 Stories Of Passengers & They Explain What Life Truly Is - Part 2

మొదటి అధ్యాయం

నేనండీ మీ రైల్వే స్టేషన్ ని...అప్పుడెప్పుడో మీకు కొన్ని కథలు చెప్పాను గుర్తుందా..చాన్నాళ్ల తరువాత మళ్ళీ మీతో మాట్లాడాలి అనిపించి కొన్ని కథలు,నిజానికి కొన్ని వ్యధలు మీతో పంచుకొని మనసులో భారం దించుకోడానికి,భయం చెప్పుకోడానికి,భాద పంచుకోడానికి ఇలా వచ్చాను. అదేదో ప్రాణాంతక వ్యాధి అంట,ప్రపంచం మొత్తాన్నీ గడగడలాడిస్తుందిట . దానివల్ల దాదాపు రెండు నెలలు అలజడి కూడా లేకుండా స్తబ్దుగా ఉండిపోయాను..ఈ అరవై రోజులూ అరవై యుగాల్లా గడిచాయి.చూడకూడనివి ఎన్నో చూశాను..ఎప్పుడూ ఎన్నో భావోద్వేగాల కథలు చెప్పే నేను..ఈసారి భాదోద్వేగాల వ్యథలే చెబుదామని వచ్చాను.

1.భయపెట్టిన నిశ్శబ్దం నేను కట్టి బుద్దెరిగినప్పటి నుండీ నిత్యం హడావిడిగానే ఉన్నాను.బోసి పోయి ఒక్క రోజూ లేను.బంద్ లూ,హర్తాళ్లూ జరిగినా,యుద్దాలు,వైపరీత్యాలూ వచ్చినా ఏనాడూ నేను స్తంబించింది లేదు.రోజూ వందల రైళ్లు,వేల మంది మనుషులు, కోలాహలంగా సందడిగా ఉండే నేను.ఒక్కసారిగా నిర్మానుష్యంగా మారిపోయాను.ఒక్క రాత్రిలోనే పరిస్థితి పూర్తిగా తారుమారు అయిపోయింది. కూతలు పెట్టె రైళ్లు రాలేదు.రోజూ గంట కొట్టి నా ఒడిలో సేదదీరే వారిని నిద్ర లేపే స్టేషన్ మాస్టర్ గంట కొట్టలేదు.నా ఒడిలోనే వ్యాపారం చేసుకొని జీవితాల్ని నడిపించే చిన్న వ్యాపారస్తులు ఎవరూ రాలేదు.అసలేప్పుడూ వాడని తలుపు మూసివేయబడ్డాయి. ఎప్పుడూ పనిచేసే పట్టికలు ఏ వార్తా లేకుండా నిశ్చలంగా ఉండిపోయాయి. అంతా నిశబ్దం.నేను భరించలేనంత, ఊహించలేనంత నిశ్శబ్దం. చివరి ప్లాట్ ఫారంలో గాలికి కొట్టుకునే కాగితాల శబ్దం కూడా వినపడేంత నిశ్శబ్దం. మాట్లాడేందుకు ఒక మనిషి కూడా కానరాలేదు.రోజూ కొన్ని వేల కథలు నా కళ్లెదుట జరిగేవి....ఇప్పుడు ఒక్కరంటే ఒక్కరూ లేరు..అనాధగా మారిపోయాను నేను.ఎలా ఉన్నావని కాదు కదా...అసలు నేనంటూ ఉన్నానని కూడా ఎవరికీ గుర్తు లేదు. భయంతో గడిపిన క్షణాలు అవి.భారంగా వెళ్లదీసిన కాలం అది.మళ్ళీ వెనక్కి తిరిగి చూడడాడనికి కూడా వీళ్లేనంత ఒంటరితనం అది.

2.నా గోడ గుండెల్ని పిండేసిన విషాదం రాతితో చేసినా నిర్మాణాన్ని, నా కన్నులే చెమ్మగిల్లే విషాదం చూశాను ఈ ఆపత్కాలంలోనే.నా గోడ గుండెలు అవిసెల రోదించాను ఆ సంఘటన చూసి.నాకు ఒక రెండు మైళ్ళ దూరంలో, ఎక్కడికో వలస పోయిన బడుగు జీవులు. కాయ కష్టం చేసుకునే ఊరు నుండి సొంత ఊరికి రైళ్లూ,బస్సులూ ఏవీ లేవని చేతిలో డబ్బులూ లేవని కాలి నడకన ఇంటి బాట పట్టారు. ఒట్టి కాళ్లతోనే వందల మైళ్ళు నడిచారు.రాత్రికి అలసి పోయి రైళ్లేమీ రావనుకొని అక్కడే పట్టాల పైనే ఉండిపోయారు.అలసిపోయిన ఆ వలస జీవులు తమతో తెచ్చుకొన్న రొట్టె ముక్కలు తిని అప్పుడే అలా నిదురలోకి జారుకున్నారు.ఇంకో నాలుగడుగులు వేసి నా ఒడిలో సేద దీరండి అని చెబుదాం అనుకుంటే ఎవరినీ నా దగ్గరికి రావడానికి అనుమతులు ఇవ్వట్లేదు అని ఆగిపోయాను. కానీ ఖర్మమో,ఏం పాడో అది గూడ్స్ రైలు వచ్చే వేళ, నిర్ణీత కాల పట్టిక ఏమీ లేకపోవడంతో నాకూ తెలియలేదు,పట్టాలపైనే విశ్రాంతి తీసుకుంటున్న ఆ అమాయకుల మీదుగానే వెళ్లిపోయింది. పోరుగూరులో బతుకు లేదు అని సొంత ఊరికి ప్రయాణం ప్రారంభించిన ఆ అనామకులు అందరూ అనంత లోకాలకి చేరిపోయారు.అసలిక్కడ ఎవరిని నిందించను నేను? రైళ్లు రావేమో అనుకునే ఆ అమాయకత్వాన్నా? అసలు ఇలా జరుగుతుంది అని ఊహించని ఆ రైలు డ్రైవరునా??అతను మాత్రం ఏం చేస్తాడు.. శిలలా పడి ఉన్న నా నిస్సహాయతనే నిందించుకున్నాను.ఇలాంటి దారుణాలు మళ్ళీ జరగకూడదూ అని ప్రతీ రోజూ కోరుకుంటూనే ఉన్నాను .

3.ఒంటరిని చేసి ఒక్కడే వెళ్లిపోయాడు వసుంధర... భర్త ఏదో ప్రమాదంలో చనిపోయాడట,ఎక్కడో నాలుగు రాష్ట్రాల అవతల నుండి బతుకు దెరువు కోసం బిడ్డని ఎత్తుకొని వచ్చింది.ఊరంతా తిరిగింది నెల పాటు,ఎక్కడ పని దొరకలేదు.ఉన్న కాస్తంత డబ్బుతో నా ఒడిలోనే. మూడో ప్లాట్ ఫామ్ లో న్యూస్ పేపర్లూ, మ్యాగజీన్లూ అమ్ముతూ ఉండేది.గొప్ప రాబడి ఏమీ లేకపోయినా తనకీ తన కొడుకు ప్రశాంత్ కి రెండు పూటలా తిండికి సరిపోయేది.నా పక్కనే పూరీ గుడిసెలో ఉండే వాళ్ళు.దాదాపుగా నాతోనే అనొచ్చు.ప్రశాంత్ కి చదువుకోవాలనే ఆశ,రోజూ పక్కనున్న బడికెళ్తూ,తీరిక దొరికితే వసుంధరకి సాయం చేస్తూ ఉండే వాడు.దాదాపు పదేళ్ళుగా తెలుసు వాళ్ళిద్దరూ నాకు.వాడి బాల్యం నా ఒడిలోనే గడిచిపోయింది.వసుంధర కష్టం వల్ల ఆ చిన్న వ్యాపారం ఒక రూపుకి వస్తుంది.కొంత కూడబెట్టోచ్చు ఇంకొంత కాలం రాబడి ఇలానే ఉంటే అని అనుకుంది..కానీ ..ఆ సమయానికే ఈ వైరస్ దాపురించింది.అన్నీ మూసివేయాలన్నారు. వసుంధర ఆశలు అడియాసలు అయ్యాయి..చేతిలో ఉన్న కొంత సొమ్ముతో ఈ గండం గట్టెక్కిద్దామ్ అనుకుంది.కొడుకు కోసం ఎన్నో కలలు కంది ఆ పిచ్చిది..కానీ ...ఆ మాయదారి వైరస్ ఎక్కడ నుండి సోకిందో ఏమో వసుంధరకి అంటుకుంది.పరీక్షలు జరిపి ఫలితాలు రాగానే వసుంధరని తీసుకెళ్లిపోయారు..అదే ఆఖరు సారి ప్రశాంత్ వాడి అమ్మని చూడడం.దాదాపు వారం రోజులు ఆసుపత్రిలోనే ఉంది.రోజూ ఆసుపత్రి బయటే ఉండే వాడు ప్రశాంత్.ఓ నాడు..వసుంధర చనిపోయింది.దేహాన్ని పూడ్చెసాము అని ప్రశాంత్ కి చెప్పారు ఆసుపత్రి వాళ్ళు. వాడి ఏడుపుని ఆపడం నా తరం అవలేదు.కనీసం చివరి చూపుకి కూడా నోచుకోలేదు వాడు.తండ్రి ప్రేమ తెలియదు.తల్లి కూడా దూరం అయింది.వాడి భాద అనంతం. వాళ్ళ కొట్టు ఉండే ప్లాట్ ఫామ్ దగ్గరే కూర్చొని రోజంతా ఏడ్చేవాడు.వాడిని చూస్తూ నేనూ రోదించే దాన్ని.దేవుడా ఈ పసివాడు ఏం పాపం చేశాడని వీడికీ శిక్ష వేశావూ అని అడిగే దాన్ని.తన తల్లి దూరం అవడంతో వాడు మనిషిలా ఉండలేకపోయాడు .ఆ జ్ఞాపకాలు వాడిని వెంటాడేవి.భరించలేక పోయాడు.ఇక ఇక్కడ ఉండలేను అని నిర్ణయించుకొని.శ్రామిక్ రైళ్లు మొదలవగానే అన్నీ మూట గట్టుకొని గుండెల నిండా శోకాన్ని నింపుకొని వెళ్లిపోయాడు. పోయే ముందు ఆ మూడో నెంబర్ ప్లాట్ ఫామ్ మీద కూర్చొని,మా అమ్మని నాకు దూరం చేశావు,ఇంకా జన్మలో నీ దగ్గరికి రానంటూ వెక్కి వెక్కి ఏడవడమ్ ఇంకా గుర్తుంది.నా ఒడిలోనే పెరిగిన నా బిడ్డ, ఒంటరిగా సొంత ఊరికి వెళ్లిపోయాడు నన్ను ఒంటరి దాన్ని చేసి.

4.ఈ శోకంలో ఒక చిన్న స్వాంతన గ్యాంగ్ మెన్ రామ్ బాబు,నా వెనుక ఆవరణలోనే రైల్వే క్వాటర్స్లో ఉండేవాడు.కూతురు మహా తెలివిమంతురాలు.చదువుల్లో చురుకు, డాక్టర్ అవ్వాలని తనకి ఆశ.తన బిడ్డని గొప్ప స్థాయిలో ఉంచేందుకు, కూడబెట్టిందీ,ఊర్లో ఉన్న కొద్దిపాటి స్థలం అమ్మేసీ,రైల్వేలో తెలిసిన పెద్దవాళ్లతో సిఫారసు చేయించి బ్యాంక్ లోన్ తీసుకొని ఎలాగోలా కష్టపడి కూతురిని డాక్టర్ చదువు కోసం చైనాకి పంపాడు.ఎవరో సలహా ఇస్తే.చాలా ఏళ్ళే అయింది వెళ్ళి,చదువు కూడా పూర్తి అయ్యిందట.ఈ వానా కాలంలో వచ్చేద్దామ్ అనుకుందట.కానీ ఈ లోగానే జనవరిలో అక్కడ ఈ పాడు వైరస్ పెరిగిపోయింది.అపుడే వద్దామనుకుంటే కుదరలేదు.ఈలోగా రాకపోకలు ఆగిపోయాయి.అక్కడే తోటి విద్యార్ధులతో స్వీయ నిర్బంధంలో ఉందిట.ఎక్కడ ఆ వైరస్ సోకుతుందో అని ఇక్కడ రామ్ బాబు కంగారూ.రోజూ తిండే సహించేది కాదు ఆ దంపతులిద్దరికీ,ఎలా ఉందో.ఎప్పుడొస్తుందో అనే బెంగే... రోజులూ, వారాలూ, నెలలూ, గడుస్తున్నాయి..ఫోనులో మాట్లాడుకోవడం వల్ల కనీసం ఊపిరి పీల్చుకుంటున్నారు కానీ అదీ లేకుంటే అసలు ఉండేవారే కాదు వీళ్ళు.మొత్తానికి అక్కడ చిక్కుకున్న మన పౌరులని గుర్తించి తరలించారట డిల్లీకి.ఇక్కడకి చేరాక మళ్ళీ మరో బెంగ,ఈ ప్రయాణంలో ఏమైనా సోకుతుందేమో అని.పరీక్షలు జరిపి ప్రభుత్వ క్వారంటైన్లో ఉంచి,నెగటివ్ అని తేలాక ఊరికి పంపారు.ఇక్కడా పరీక్షలు చేశాక నిర్ధారణ అయ్యాక ఇంటికి చేరింది పూజ,దాదాపు ఐదు నెలలు రామ్ బాబు నరకం అనుభవించాడు,ఎలా ఉందో ఏమవుతుందో అని గాబరా పడ్డాడు.చివరికి క్షేమంగా ఇంటికి చేరింది.

ఇన్ని వ్యధలూ,భాదలూ చూసినా ఇంకా రాయిలానే ఉన్నాను కదా...ఓహ్ రాయినే కదా.. ఉంటానండీ...ఇలాంటి క్లిష్ట సమయం మళ్ళీ రాకూడదు అని కోరుకుంటున్నాను..మీరూ క్షేమంగా ఉండండి...ఈసారి కలిస్తే నవ్వుతూ పలకరించుకుందాం.సెలవు మీ రైల్వే స్టేషన్