తనకి ఇష్టం లేకపోయినా గాని శిష్యుల కోరిక మేరకు శ్రీరామకృష్ణ పరమహంస ఒకరోజు పల్లకిలో కూర్చుని ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి వెళ్తున్నారు. వారు వెళ్తున్న మార్గంలో ఒక వేశ్య వాడ వచ్చింది, చీకటి పడింది. విటుల కోసం ఎదురుచూస్తూ వేశ్యలు వారి ఇంటి గుమ్మం ముందు నిల్చుని ఉన్నారు. ఆ దృశ్యాన్ని రామకృష్ణ పరమహంస పల్లకిలో నుండి చూశారు. వెంటనే ఆ పల్లకి నుండి రామకృష్ణ పరమహంస బయటికి వచ్చి ఆ వేశ్యల దగ్గరికి వెళ్ళి వారి పాదాలకు మనస్పూర్తిగా, భక్తిభావనతో నమస్కారం చేస్తున్నారు. ఏమి జరుగుతుందో తెలియని ఆశ్ఛర్యంలో మునిగిపోయిన శిష్యులందరూ రామకృష్ణ పరమహంస గారిని తిరిగి పల్లకిలో కూర్చోబెట్టి కాళిమాత ఆలయానికి తీసుకువచ్చారు. శిష్యులందరూ.. "ఏంటిది గురువు గారు.. పల్లకి నుండి దూకి వేశ్యల కాళ్ళమీద పడి మొక్కడం ఏంటండి.." అని వినమ్రంగా అడిగారు.. దానికి పరమహంస "వాళ్ళు వేశ్యలుగా కనపడ్డారా మీకు.. నాకు మాత్రం సాయంత్రం వేళలో అన్ని చోట్ల అందరి రూపంలో నిలబడి నా తల్లి కాళిమాత నన్ను ఆప్యాయంగా పిలుస్తున్నట్టుగా అనిపించింది.." అని అన్నారు. ఈ సమాధానం వినేసరికి శిష్యులందరి హృదయంలో జ్ఞాన సూర్యుడు ఉదయించాడు.
జన్మకు అర్ధం: ప్రతి ఒక్కరి పుట్టుకకు ఒక కారణం ఖచ్చితంగా ఉంటుంది. ఇక్కడ పనికిరాని వాడు అంటూ ఎవరూ లేరు. ఒకరు స్వాతంత్రం సాధించడానికి పుడితే ఇంకొకరు సైంటిస్ట్ గా నూతన ఆవిష్కరణల కోసం పుట్టారు. ఒకరు డాక్టర్ గా ప్రాణాలను రక్షించడానికి పుడితే మరొకరు జవానుగా దేశ రక్షణ కోసం పుట్టారు. తమలోని శక్తిని, తమ విలువను పరిపూర్ణంగా తెలుసుకున్న వారే మహాత్ములుగా ఎదిగారు.. వారే చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయారు. రామకృష్ణ పరమహంస గారి జన్మకు కారణం సకల ప్రాణులను చైతన్య పరచడం. ఆధ్యాత్మిక తత్వమే సకల జనులను ఉన్నతులగా తీర్చిదిద్దుతుందని, ఆధ్యాత్మిక తత్వమే జనులకు పరిపూర్ణ మనశ్శాంతిని కల్పిస్తుంది.. అని ఆచరించి, జీవించి, బోధించి ఎంతోమంది జీవితాలను కేవలం కొన్ని క్షణాలలో మార్చిన గురువు రామకృష్ణ పరమహంస. తల్లిదండ్రులు పరమహంసకు పెట్టిన పేరు గదాధర్, పశ్చిమ బెంగాల్ లోని కామార్పుకూర్ అనే మారుమూల గ్రామంలో అతిపేద తల్లిదండ్రులకు వారు జన్మించారు. పరమహంస గారికి చిన్నతనం నుండి చదువులు గాని, డబ్బు సంపాదించడం అనే వాటి మీద అస్సలు ఇష్టం ఉండకపోయేది. కాని లలితకళలు, చిత్రలేఖనం, ప్రకృతిని చిన్నతనం నుండి మనస్పూర్తిగా ప్రేమించేవారు. పాఠశాలకు వెళ్ళి ఉపాధ్యాయులు చెప్పే పాఠాల కన్నా సాధువుల బోధనలే శ్రద్ధగా వినేవారు. అప్పటి వరకు వారి జీవితం సాధారణంగానే సాగిపోయింది కాని కొంత కాలానికి పరిస్థితుల మూలంగా దక్షిణేశ్వరంలోని కాళిమాత దేవాలయంలో పూజారిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత వారి జీవితం సమూలంగా మారిపోయింది.
కాళిమాత దర్శనం: పూజారిగా బాధ్యతలు తీసుకున్న నాటి నుండి గర్భగుడిలో ఉన్న కాళిమాత ప్రతిమను చూస్తూ "ఈ రూపంలో ఉన్నది నిజంగా కాళిమాత యేనా లేదంటే ఉట్టి జీవంలేని రాయి మాత్రమేనా" అని తదేకంగా చూసేవారు. ఇందులో నిజంగా దేవత ఉంటే ఖచ్చితంగా నాకు కనిపించాలి, మాట్లాడాలి, నా ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలి అని కాళిమాత ప్రత్యక్షం కావాలని ప్రార్ధనలను ప్రారంభించారు. చిన్నపిల్లవాడిని కన్నతల్లి ఒంటరిగా ఒదిలిపెడితే ఆ పిల్లవాడు అమ్మకోసం ఎలా ఏడుస్తారో అలా అమ్మ దర్శనం కోసం కన్నీటితో వేడుకునేవారు.. రాత్రి, పగలు అన్న తేడా లేకుండా ఆలయం, అడవి అన్న ప్రాంతం లేకుండా కాళిమాత దర్శనం అయ్యేంత వరకు ప్రార్ధన ఆపలేదు. ఒక దివ్య రోజునాడు కాళిమాత దర్శనం పరమహంసకు కలిగింది. ఇలా ఒక్కరోజు జరగలేదు.. ఆయన ఎప్పుడు ఆర్తితో పిలిచినా గాని కన్నబిడ్డను చేరుకునే తల్లిలా ప్రేమతో అమ్మవారు దర్శన భాగ్యం కల్పించేవారు.
బోధనలు, వివేకనందుని శిష్యరికం: రామకృష్ణ పరమహంస, శారదామాతలకు చిన్నతనంలోనే వివాహం జరిగినా కాని సంతానం, సంసార బంధంతో సమస్త మానవాళికి చెయ్యవలసినవి చెయ్యలేమని దంపతులిద్దరూ శారీరకంగా జీవితాంతం కలవకుండా బ్రహ్మచర్యం పాటించారు. రామకృష్ణ పరమహంస గారి గురువు తోతాపురి. ఆయన బోధనలతో పరమహంసకు తాను ఎవరో తన పుట్టుకకు అర్ధం ఏమిటో తెలుసుకున్నారు. ఇక అప్పటి నుండి తన బోధనలను విశ్వవ్యాప్తం చేశారు. హిందూ మతం నుండి మాత్రమే కాదు ఇస్లాం, క్రైస్తవం మొదలైన మతాలవారు పరమహంస వద్దకు వచ్చి జీవితంలోని ఆనందాన్ని పొందేవారు. ఈ క్రమంలోనే అప్పటివరకు ఎన్నో అనుమానాలతో ఉన్న నరేంద్రనాథ్ దత్తా రామకృష్ణ పరమహంసను కలుసుకుని ఆయన స్పర్శతో భగవంతుని దర్శన అనుభూతికి లోనై స్వామి వివేకనందునిగా ప్రపంచ చీకటిలో ఒక జ్ఞాన కాగడా ద్వారా వెలుగునందిస్తున్నారు.
పరమహంసుల అద్వైత తత్త్వం. ఒక లక్ష్యానికి తమకు తోచినట్టుగా ఒక మార్గాన్ని నిర్ధేశించుకున్నట్టే దైవాన్ని చేరుకోవడానికి మనుషులు అనేక మార్గాలు నిర్మించుకున్నారు.. ఆ మార్గాలే వివిధ మతాలు. ప్రతి ఒక్క ప్రాణిలో భగవంతుడు ఉంటాడు. ప్రతి ఒక్క వస్తువు భగవంతుని అద్భుత సృష్టి. సృష్టి అంతా ఒకే శరీరంలో ఉంది ఆ శరీరమే భగవంతుడు. ఉన్నది ఒక్కడే భగవంతుడు కాని పేర్లు అనేకం, శరీరాలు అనేకం. కామం, స్వార్ధం, ఈర్ష్య, కోపం మొదలైన వాటిని వీడితేనే భగవంతుని దర్శనం కలుగుతుంది. వీటి మూలంగానే మానవుడు కర్మ చక్రంలో బంధిగా ఉంటున్నాడు. వీటిని వదిలినప్పుడు మాత్రమే ప్రతి ఒక్కరిలో దేవుడిని చూడవచ్చు. ప్రతి ఒక్కరిలో భగవంతుడు ఉన్నాడు కనుక ప్రాణులకు సేవ చేస్తే ఆ సేవ భగవంతునికి చేసినట్టే.
రాముడు, కృష్ణుని కలయికయే రామకృష్ణ పరమహంస అని ఆయన శిష్యులు విశ్వసిస్తారు. కులాలు మతాలలో ఉన్న భేదాలను, మూడనమ్మకాలను రూపుమాపి ప్రతి ఒక్కరిలో మనస్పూర్తిగా దేవుడిని దర్శించమని ఆయన బోధించారు. రామకృష్ణ పరమహంస గారు మరణించి ఇప్పటికి 131సంవత్సరాలైనా గాని ఆయన సందేశం నిరంతరం కొనసాగాలని దేశంలో ఎన్నో వందల రామకృష్ణ మఠాలను ఆయన గౌరవ శిష్యులు స్థాపించి యువకులకు మార్గనిర్ధేశం చేస్తున్నారు. ఆ యువకులలోనే ఎంతోమంది వివేకనందులు వస్తున్నారు.. నిజంగా ఒక్కరి పుట్టుక ఎంతోమంది జీవితాలను ఉన్నతంగా మార్చగలదు అన్నదానికి ఉత్తమ ఉదాహరణ పరమహంస గారు.. ఇవ్వాల్టిరోజు ఈ భూమి మీదకు వచ్చిన రామకృష్ణ పరమహంస గారికి శతకోటి జన్మదిన శుభాకాంక్షలు.