ప్రపంచ దేశాలన్నీటిలో కన్నా మన భారతదేశంలోనే ఎక్కువ మంది యువకులున్నారు, ఆ యువశక్తితో మనమెంతో అద్భుతాలను చేయగలము, మనదేశాన్ని ఈ విశ్వంలోనే అత్యున్నత దేశంగా నిర్మించగలము. అలాంటి యువత కోసం భారతదేశంలో ఒక ప్రత్యేక రోజు అంటు ఒకటుంది అదే స్వామి వివేకనందుని పుట్టినరోజు నాడు. ఆ రోజునే మన దేశంలో యూత్ డే గా ఘనంగ నిర్వహించుకుంటాం. అలా యువకులందరికి ఆదర్శుడు ఐన స్వామి వివేకనందుడే దైవంగా భావించె శ్రీరామకృష్ణుడి జీవితంలో జరిగిన ఒక 'సంఘటన' మన నిజమైన మంచి వ్యక్తిత్వన్ని ఎలా కాపాడుకోవాలో తెలియజేస్తుంది.
ఒకరోజు శ్రీరామకృష్ణ పరమహంస మరియు అతని శిష్య బృందం కాలినడకన ఒక ఊరు నుండి మరొక ఊరుకి వెళ్తున్నారు.. ఒక నది పక్కనుండి ప్రయాణం కొనసాగిస్తున్నారు. ఒక తేలు అకస్మాతుగా ఆ నదిలో పడిపోయింది, ఒడ్డుకు చేరడానికి విశ్వప్రయత్నం చేస్తుంది కాని దానికి శక్తి సరిపోవడం లేదు. ఇదంతా గమనిస్తున్న రామకృష్ణ పరమహంస హృదయం బరువెక్కిపోయింది. ఆ చిన్ని ప్రాణం కాపాడటానికి పరుగెత్తుకొని వెళ్ళి నీటిలో మునిగిపోతున్న ఆ తేలును తన చేతితో పట్టుకులేపాడు, ప్రాణభయంతో ఉన్న ఆ తేలు ఇంకా భయంతో పరమహంసను కుట్టింది..! ఆ భయంకరమైన నొప్పిని భరించలేక అనుకోకుండా ఆ తేలును వదిలేశారు ఆ తేలు మళ్ళి నీటిలో పడిపోయింది.. మళ్ళి నీటిలో నుండి ఒడ్డుకు రావడానికి ప్రయత్నిస్తుంది. పరమహంస మళ్ళి అదే చేతితో దానిని పట్టుకున్నాడు ఆ తేలు భయంతో మళ్ళి కుట్టింది.. మూడోసారి ఒక చిన్న చెట్టుకొమ్మ సహయంతో దానిని ఆ కొమ్మ మీద ఎక్కేలా చేసి దానిని ఒడ్డుకు చేర్చి దాని ప్రాణాలు రక్షించారు.
ఒక శిష్యుడు ఇదంతా గమనిస్తునే ఉన్నాడు, తేలు విషానికి విరుగుడు మందు ఇస్తూ ఇలా అడిగాడు.. గురువర్య.. ఆ తేలు కుడుతుందని తెలుసు ఐనా మీరు దాని ప్రాణాలు కాపాడారు, అది కుట్టింది ఆ నొప్పిని భరిస్తూనే రెండవసారి, మూడోసారి కూడా ఎందుకు దానిని కాపాడటానికి ప్రయత్నించారు..? అది ఉపకారం చేసిన వారికి కూడా అపకారం చేసే చెడు స్వభావం కలిగినది మీరెందుకు ఇలా చేశారు ?
పరమహంస(నవ్వుతు): చూడు నాయన తన స్వభావం ప్రకారం అది నాకు చెడు చేసింది కాని నా స్వభావం అది కాదు, ఒకరు నాకు చెడు చేశారని వారికి నేను చెడు చేయను.. దాని స్వభావం చెడు చేయడమైతే నా స్వభావం మంచి చేయడం అందుకే దాని ప్రాణాలను కాపాడాను.