గ్రూప్ 1లో ఫస్ట్ ర్యాంక్ తో విజయం సాధించి రాబోయే కాలంలో కలెక్టర్ అవ్వాలని కలలుకంటున్న రమణ కేవలం తనకోసం మాత్రమే ఇంతలా ఎదగలేదు.. సమాజం కోసం కూడా.. ధనవంతుల పిల్లలు విజయం సాధిస్తే ఓ పేదవాడు అతనితో పోల్చుకోలేడు. అదే ఓ పేదవాడు విజయం సాధిస్తే ధనవంతుడు కూడా ఎంతో స్పూర్తి పొందుతాడు. ప్రకాశం జిల్లా మార్కాపురానికి చెందిన రమణ జీవన గమనం ఎందరిలోనో ఆత్మవిశ్వాసాన్ని నింపగలదు..
నాన్న శ్రీరాములు గారు, అమ్మ లక్ష్మీ నరసమ్మ గారు కొద్దిపాటి భూమిలో వ్యవసాయం చేస్తుండేవారు. అదనంగా వ్యవసాయ కూలీలుగా పనిచేస్తూ తమ పిల్లలను చదివించడానికి ఎంతగానో శ్రమపడ్డారు. నిజానికి ఇలాంటి వాతావరణంలో కుటుంబంలో జన్మించడం వల్ల రమణకు రైతులు, పేదవారి కష్టాలు, ఆర్ధిక పరిస్థితుల మీద పరిపూర్ణ అవగాహన ఏర్పడింది. తెలుగు మీడియంలో చదువు కొనసాగించారు రమణ. పదవ తరగతిలో 68%, ఇంటర్మీడియట్ లో 74% మార్కులు తెచ్చుకుని ఎంసెట్ వెయ్యవ ర్యాంకుతో విజయవాడ కే.ఎల్ యూనివర్సిటీలో ఇంజినీరింగ్ పూర్తిచేశారు. వయసులో మాత్రమే కాదు జీవితంలోనూ ఎదుగుతున్నాడు అని తెలుసుకోవడానికి ఈ మార్కులే ఉదాహరణ.
ఆ తర్వాత ఓ మంచి సాఫ్ట్ వేర్ కంపెనీలో జాబ్ వచ్చింది కాని అందులో నాకు, సమజానికి ఆనందం ఉండదని రాజీనామా చేశారు. గ్రూప్స్ కు ప్రిపేర్ అవ్వడం మొదలుపెట్టారు. అద్భుతంగా పరీక్షలు రాశారు. కాని ఫలితాలు రావడం ఆలస్యమయింది. సమయాన్ని సరైన విధంగా ఉపయోగించుకోవాలని ఓ పక్క 'లా' చేస్తూనే, మరోపక్క గ్రూప్స్ కు ప్రిపేర్ అయ్యే విద్యార్ధులకు టీచింగ్ ఇవ్వడం కూడా చేశారు. తీరక సమయాలలో సంక్షేమ హాస్టళ్ళకు వెళ్ళి పిల్లలకు వివిధ సబ్జెక్ట్స్ పై విలువైన క్లాసులు కూడా తీసుకునేవారు.
ఏడు సంవత్సరాల తర్వాత తెలిసింది తాను రాసిన పరీక్షలో తనే అత్యున్నత మార్కులు సాధించానని.. ఇది తన విజయం మాత్రమే కాదు.. తన కోసం సమస్త త్యాగాలు చేసిన అమ్మనాన్నలది.. నాలో కసిని రగిలించి స్పూర్తినింపిన సమజానిది. ప్రస్తుతం తన లక్ష్యం ఒక్కటే ప్రభుత్వ అధికారిగా అధికారాలను ఉపయోగించుకుని పేదరికాన్ని నిర్మూలించడం.