మన తెలుగు రాష్ట్రాలలోనే భద్రాచాలన్ని రాముల వారికున్న గొప్ప క్షేత్రంగా పూజిస్తారు. ఆ తర్వాత విజయనగరం లోని శ్రీరామ తీర్ధాన్ని రెండో భద్రాచలంగా భక్తులు పరిగనిస్తారు. ఇక్కడ త్రేతాయుగంలో రాముల వారు వనవాసంలో కొంతకాలం గడిపారని, ఆ తర్వాత ద్వాపరి యుగంలో పాండవులు కూడా వనవాస సమయంలో ఇక్కడ ఉన్నారని చారిత్రక ఆధారాలతో సహా భక్తులు వివరిస్తారు. ఈ శ్రీరామ తీర్ధం విజయనగరం జిల్లా నుండి 12కిలోమీటర్ల దూరంలోని నెల్లిమర్ల అనే గ్రామంలో ఉన్నది.
ఇక్కడి దేవాలయం మాత్రమే కాదు ఈ దేవాలయానికి చేరుకునే మార్గం కూడా కొండలు, పచ్చని ప్రకృతి అందాలతో, ప్రశాంతంగా ఉంటుంది. ఈ దేవాలయం అత్యంత ప్రాచీన దేవాలయాలలో ఒకటి. ఇక్కడి శ్రీ సీతారాముల ప్రతిమలు నీటిలో దొరకడం వల్ల ఈ ఆలయాన్ని రామతీర్ధం అని పిలుస్తారు. ఇక్కడ పాండవులు కొన్నిరోజులు నివసించారని అది నిజమని తెలిపేందుకు ఇప్పటికి వారికి సంబంధించిన ఆనవాళ్ళు కనిపిస్తుంటాయి. భీముని గుహా, భీముని పాద ముద్రలు, అలాగే శ్రీరాముని పాద ముద్రలు, ఆంజనేయ స్వామి వారి పాద ముద్రలు కూడా కనిపిస్తాయి. ఈ ఆలయాన్ని ఆనుకుని 13ఎకరాల విస్తీర్ణంలో సుందరమైన భాస్కర సరస్సు ఉంటుంది.
సీతారాముల వారి విగ్రహాలను పాండవులకు సాక్షాత్తు శ్రీ కృష్ణుడు ఇచ్చాడని ఒక పురాతన కథ ఉంది. ఇక్కడ పాండవులు సేదతీరుతున్న సమయంలో శ్రీ కృష్ణుడిని కూడా ఇక్కడికి గౌరవంతో ఆహ్వానించారట కాని ఇందుకు శ్రీ కృష్ణుడు సున్నితంగా తిరస్కరించి తన పూర్వపు అవతారమైన సీతా రాముని ప్రతిమలు ఇచ్చి ఇందులోను నన్నే చూసుకోండి అని చెప్పారట.. పాండవులు అక్కడ ఉన్నంత కాలం ఆ ప్రతిమలను పూజించారు ఆ తర్వాత వారు వేరే చోటుకు వెళ్ళే సమయంలో వేద గర్బుడికి ఇచ్చారట.
వేద గర్బుడు తాను బ్రతికున్నంత కాలం పూజించి మరణించే సమయంలో ఎవ్వరికి తెలియకుండా ఒక ప్రత్యేక ప్రదేశంలో దాచిపెట్టారు. ఆ తర్వాత అతను మరణించాక ఒక వృద్దురాలికి కలలో కనిపించి విగ్రహాలు ఉన్న స్థలం చెప్పి ఈ ప్రతిమలు పూజిస్తే పుట్టు మూగతనంతో బాధపడుతున్న నీకు మాటలు వస్తాయని చెప్పారట(కొంతమంది కలలో శ్రీరాముడే కనిపించారని నమ్ముతారు). ఆ వృద్దురాలు కలలో చెప్పిన ప్రదేశంలో వెతికితే సీతారాముల లక్ష్మణుల ప్రతిమలు దొరికాయి అంతేకాకుండా ఆమెకు మాటలు కూడా వచ్చాయి ఈ విషయం అప్పటి మహారాజుకు తెలియజేస్తే మహారాజు ఆ ప్రతిమలను ప్రతిష్టించి మొదటిసారి ఆలయాన్ని నిర్మించారట.