అన్ని కథలు అందరికి ఒకేలా అర్థం అవ్వదు. అలాగే రామాయణం, మహాభారతం కూడా. ఎవరి దృక్పథం(perspective) వాళ్ళది. ఎవరు చూసే తీరు లో వాళ్ళు చూస్తారు. ఇలానే ఎందరో దర్శకులు తమ కథలని రామాయణం నుండి, రామాయణ పాత్రల్లో ఉన్న వ్యక్తిత్వాల నుండి ప్రభావితులై రాసుకున్నారు. కానీ కొందరు ఉదాహరణ తీస్కుని, రామాయణాన్ని వాళ్ళు చూసిన తీరుని వివరించే ప్రయత్నం ఇది.
1. బాపు:
సినిమాలని తెగ చూసే వాళ్లకి రామాయణం అంటే మొదట గుర్తొచ్చేది బాపు గారి సినిమాలు. ఆయన తీసిన సంపూర్ణ రామాయణం సినిమా ఇప్పటికి రామాయణానికి దృశ్యకావ్యంగా చెప్తారు. ఆయన చివరి సినిమా శ్రీరామరాజ్యం వరకు ఆయన ప్రతి సినిమా లో రామాయణం ప్రభావం ఉంటుంది.
ఉదాహరణలు:
ముత్యమంత ముగ్గు: రామాయణానికి ఆధునికత ని జోడించి ఈ సినిమా ని తీశారు బాపు గారు
రాంబంటు: రాముడిలా కొలిచే తన యజమానికి కష్టమొస్తే, ఆంజనేయుడు లాంటి ఒక వ్యక్తి ఎలా ఎదురుకొన్నాడు అనేదే కథ.
పెళ్లి పుస్తకం: శ్రీరాముడు, సీతమ్మ ఒకరికి ఒకరు ఉండే తీరుని, వారి మధ్య ఉండే ఎడబాటుని, అప్పుడు అప్పుడు తొంగి చూసే అనుమానాల్ని, అందులో కూడా నిండి ఉన్న ప్రేమని, ఈ సినిమాలో ఆధునికంగా ఆహ్లాదంగా చూపిస్తారు బాపు గారు.
2. కే.విశ్వనాథ్:
విశ్వనాధ్ గారి సినిమాలలో, నాయిక నాయకుల మధ్య ప్రేమ కన్న, ఒకరి వ్యక్తిత్వం మీద ఒకరికి ఉండే గౌరవం, ఆరాధనా భావం, ఒకరి ప్రయాణంలో ఒకరు తోడు గా ఉండటం చాలా ఎక్కువ కనిపిస్తాయి. సీతారాముల కథలో కూడా, వనవాసానికి రాముడితో వెళ్ళింది సీత, తరువాత సందర్భాలలో దూరంగా ఉన్నా, ఒకరిని ఒకరు ఆరాధించుకుంటూనే ఉంటారు. ఒకరి ఆలోచనని ఒకరు గౌరవించుకుంటూనే ఉంటారు. ఈ అంశాన్ని తీస్కుని, విశ్వనాథ్ గారు ఆయన కథల్లో పాత్రలని రాసుకుంటారు
ఉదాహరణలు:
స్వర్ణకమలం, శుభలేఖ: ఈ సినిమాలలో ఒకరి మీద ఇంకొకరికి ఉన్న ప్రేమని చివరి వరకు చెప్పుకోరు . కానీ ఒకరి ప్రయాణంలో ఇంకొకరు తోడుగా స్నేహితులుగా ఉంటారు.
శంకరాభరణం, సాగరసంగమం లాంటి సినిమాలో ఒకరి కళ, వ్యక్తిత్వం పట్ల ఇంకొకరికి ఉండే ఆరాధనా భావం, వారి కళని ప్రపంచానికి తెలియజేయడానికి ఒకరికి ఒకరు తోడుగా నిలిచినా తీరుని చూపించారు విశ్వనాథ్ గారు.
3. మణిరత్నం:
రాముడితో ఒక సమతుల్యత (Balance), సౌమ్యత(subtle) ఉంటాయి. సీత లో, ఆత్మ విశ్వాసం, ఎవరికీ అర్థం కానీ లోతు ఉంటుంది. ఈ రెండు వ్యక్తిత్వాలని తన ప్రతి కథలో రాసుకుంటారు మణిరత్నం గారు. ఇలాంటి రెండు వ్యక్తులు ఎన్నో పరిస్థితులలో తోసి, వారికి కొంచెం అప్పటి పరిసరాల ప్రభావాన్ని జోడించి కథలని రాసుకుంటారు మణిరత్నం గారు.
ఉదాహరణలు:
మౌనరాగం లో, రోజ లో రాముడిని ఇష్టం లేని పెళ్లి చేసుకున్న సీత ని చూపిస్తారు. సఖి లో ప్రేమ పెళ్లి చేసుకున్న రాముడు సీతని చూపిస్తారు. ఇలా అప్పటి కాలమాన పరిస్థితుల్లో రాముడు సీత లాంటి పాత్రల మధ్య ప్రేమ కథని రాస్తారు మణిరత్నం గారు.
ఆయన సినిమా అన్నిటిలో రామాయణం వల్ల చాలా ప్రభావితమై తీసిన సినిమా మాత్రం రోజా. లంక లో బందీగా ఉన్న రాముడికోసం, సీత చేసిన పోరాటం ఈ సినిమా. రామయానికి దేశభక్తికి, చాలా చక్కగా జత కలిపారు మణిరత్నం గారు.
4. గుణశేఖర్:
తారక్ ని బాల రాముడిలా చూపించారు గుణశేఖర్ గారు. రాముడు, సీత, రావణుడు, లంక, ఆయన ప్రతి కథలో వస్తువులుగా ఉంటాయి.
ఉదాహరణలు:
ఒక కథ ప్రకారం, సీత కి తండ్రి రావణుడు. ఒకవేళ అదే నిజమయితే, లంక లో బందీగా ఉన్న తన వాళ్ళకోసం రాముడు చేసే ప్రయత్నం, చూడాలని ఉంది.
ఎవరో తెలియని అమ్మాయిని రావణుడు లాంటి ఒకడు కొండారెడ్డి బురుజు దగ్గర ఏడిపిస్తుంటే, వాడిని ఎదిరించి, ఆమె కథలో రాముడవుతాడు హీరో.. ఆ అమ్మాయిని తన కథలో సీతని చేసుకుంటాడు.
రాముడిని, రావణుడు అనుకుని పోలీసులు బంధిస్తే. తన రాముడికోసం ఒక సీత చేసిన పోరాటం. మనోహరం
5. కృష్ణవంశీ:
కృష్ణవంశీ గారి సినిమాలలో, ఆయన పాత్రలలో, రామాయణం, భారతం లోని వ్యక్తిత్వాలు కలిసిపోయుంటాయి. హీరో లో రాముడిలోని రాజసంతో పాటు, కృష్ణుడిలోని కొంటెతనం ఉంటుంది, హీరోయిన్ లో సీతలోని ఆత్మాభిమానంతో పాటు, సత్యభామలోని పొగరు ఉంటుంది.
ఉదాహరణలు:
ఆయన మొదటి సినిమా గులాబీలో మూలకథ, సీతని ఎత్తుకుని వెళ్లిన రావణుల మీద రాముడు చేసిన యుద్ధం బేస్ చేస్కునే ఉంటుంది
కానీ, అద్భుతంగా తన దృక్పథంలో రామాయణాన్ని చూపించింది మాత్రం, అంతఃపురం అనే సినిమాలో. లంకలో చిక్కుకున్న సీతమ్మని రక్షించేందుకు, రాముడే లేకుంటే.. సీతమ్మ పడే వేదన ఈ సినిమా.
6. త్రివిక్రమ్:
రామాయణం ని ఉదాహరణ గా తీస్కుని త్రివిక్రమ్ గారు రాసిన డైలాగ్స్ లెక్కపెట్టడం చాలా కష్టం. కానీ అన్నిటికన్న, అతడు, అరవిందసమేత వీర రాఘవ సినిమాలలో రాముడి లో ఉండే సౌమ్యతని, ఏకాగ్రత, లోతుని, హీరోకి చాలా బాగా అన్వయించారు త్రివిక్రమ్. son of సత్యమూర్తి, జులాయి లాంటి సినిమాలలో, పితృవాక్య పరిపాలన అనే కాన్సెప్ట్ ని చాలా బాగా చూపిస్తారు.
ఉదాహరణలు:
కుటుంబానికి దూరమయిన అత్తని తిరిగి తీసుకొచ్చే హనుమంతుడిలా రాముడు మారితే అత్తారింటికి దారేది.
అదే హనుమంతుడిలా సీత మారితే అ ఆ.
7. SS రాజమౌళి:
నా కథలలో రామాయణం, మహాభారతం ప్రభావం ఉంటుంది అని రాజమౌళి గారే చెప్పారు. కానీ ఆయన కథల్లో రాముడితో ఉన్న రాజసం, హీరో పాత్రల్లో ఎక్కువ జ్వలిస్తుంది (elevate). ఛత్రపతి, మగధీర అయినా, ఈగ అయినా, బాహుబలి అయినా, RRR అయినా... రణరంగానా రాముడిలానే ఉంటారు.. తన సినిమాలో హీరోలు.
ఉదాహరణలు:
సీత(భూమి) కోసం, రావణుడి సైన్యం తో, వానర సైన్యం చేసే యుద్ధం సై.
లంక లాంటి ఇల్లు, లక్ష్మణ రేఖ లాంటి గడప దాటితే ఎదురయ్యే మృత్యువు. కానీ దాటాల్సింది రాముడు. అదే మర్యాద రామన్న
8. శేఖర్ కమ్ముల:
బాపు గారి తరువాత, సీతారాముల మధ్య ఉండే ఆ ప్రేమని, ఎడబాటుని శేఖర్ కమ్ముల సినిమాలలోనే కనిపిస్తాయి.గోదావరి, లవ్ స్టోరీ సినిమా లో ఒకరి కోసం ఒకరు ఉండే తీరుని శేఖర్ కమ్ముల చూపించే విధానం అద్భుతం. కానీ ఒక్కో కథ రావణుడు ఒక్కో రూపం లో వస్తాడు
ఉదాహరణలు:
ఒక్క కథలో దాచిపెట్టిన నిజం లా ఉంటాడు అది ఆనంద్ అవుతుంది.
ఇంకో కథలో అటు ఇటు ఊగిసలాడే మనసులా ఉంటాడు అది గోదావరి అవుతుంది.
ఇంకో కథలో అపార్థంగా ఉంటాడు అది ఫిదా అవుతుంది.
ఇంకో కథలో బంధువులా ఉంటాడు అది లవ్ స్టోరీఅవుతుంది.
ఏ కథలో అయినా ప్రేమ, రామాయణం లానే ఉంటుంది.
9. కొరటాల శివ
రాముడి ఆలోచన విధానం, మాటలో ఉండే చురుకు, నాయకుడి లక్షణం, కొరటాల శివ గారి సినిమాలోని హీరోలో కనిపిస్థాయి... కానీ, 'తన ప్రజలు, తన వాళ్ళ వల్ల రాముడు, సీతకి దూరం అవ్వాల్సి వచ్చింది' అనే పాయింట్, కొరటాల శివ గారు తన సినిమాలో అంతర్లీనంగా చెప్తూనే ఉంటారు.
ఉదాహరణలు:
జనతా గ్యారేజ్ ని నమ్ముకున్న ప్రజల కోసం తాను ప్రేమించిన అమ్మాయిని వదులుకున్నాడు జై.
ప్రజలు, ప్రభుత్వం వేసిన నిందల వల్ల, తను ప్రేమించిన అమ్మాయికి, భరత్ కి దూరం పెరుగుతుంది. ఆ తరువాత హీరో, తీసుకునే నిర్ణయం కథలో మలుపవుతుంది.
ఇవి కేవలం 9 ఉదాహరణలు మాత్రమే.. ఇంకా ఎన్నో కథలు ఎన్నో రామాయణాలు. ప్రతి జంట సీత రాములే, ప్రతి కథ రసరమ్యమే.. మీకు నచ్చిన కథ ఏంటి మరి?