"50, 100 సంవత్సరాలున్న చెట్టు ప్రతి సంవత్సరం 60 లక్షలు విలువ చేసే ఆక్సిజన్ ను ఇస్తుంది."
నా మిత్రుడు ఒక అద్బుతమైన మాట చెప్పాడు.. "ఒక వేళ సృష్టి అంతా అంతమయ్యి మళ్ళి ఒక కొత్త ప్రపంచం పుట్టాలంటే, ప్రాణి మనుగడ కొనసాగాలంటే ముందుగా ఉండాల్సినవి చెట్లు". ఈ మాటలో ఎంతటి వాస్తవం ఉందో కదా. ఒక్కసారి బయటివారికి కాకుండా మనకు మనమే చెప్పుకుందాం "ఇప్పటి వరకు మనం మన చేతులతో ఎన్ని మొక్కలు నాటాము.?, పోని ఇంకొకటి ఆలోచిద్దాం మనకు ప్రతిరోజు కనిపించే చెట్లల్లో ఎన్నీటికి మనం నీళ్ళు పోస్తున్నాము.?" మన నిజస్వరూపము తెలిసిపోయింది కాదా(నాతో సహా).. ఒక్క మొక్క నాటితే అది బ్రతికున్నంత కాలం ఆక్సిజన్ ఇస్తూ, పండ్లు ఇస్తూ, నీడ చల్లని గాలి ఇస్తూ ఆఖరికి చనిపోయక కట్టెలుగా ఉపయోగపడుతుంది. బహుశా అందుకేనేమో పూర్వం నుండి చెట్లను కూడా పూజించడం చేస్తున్నాము.
మనుషులకు ఆపద వస్తే మనుషులమే ఆదుకుంటున్నాం ఓల్డేజ్ హోం హాస్టల్స్ అంటూ ఒక ఇంటిలో వారి ఆలన పాలన చూసుకుంటున్నాం. మరి మొక్కలకు ఆపద వస్తే.? హైదరాబాద్ కు చెందిన రామ్ దేవ్ గారు అలా గొడ్డలి దెబ్బకు గురి అయ్యే మహా వృక్షాలను కాపాడి తన సొంత వ్యవసాయ క్షేత్రంలోకి తీసుకువెళతారు. స్వతహాగ రాందేవ్ గారికి చిన్నతనం నుండే మొక్కలన్నా, మొక్కల పెంపకం అన్నా చాలా ఇష్టముండేది ఆ ఇష్టమే పెరిగి పెద్దదయ్యి చివరికి వాటిని కాపాడి అక్కున చేర్చుకునేంతటి స్థాయికి ఎదిగింది.
రాందేవ్ గారి నాన్న అటవి శాఖలో పనిచేసి రిటైర్ అయ్యారు. రాం దేవ్ గారు ఫైన్ ఆర్ట్స్ లో డిగ్రీ పూర్తి చేసి కొన్ని రకాల వ్యాపారాలు చేస్తుంటారు. వ్యాపార లావాదేవీలలో ఎన్నో ప్రాంతాలు పర్యటించాల్సి వస్తుంది. కొంతమంది వేరే ఊరిలో దొరికే వస్తువులు, బట్టలు కొనుగోలు చేసే రాందేవ్ గారు మాత్రం అక్కడి మొక్కలను ప్రత్యేకంగా ఎంపికచేసి తన స్థలంలో శాశ్వితంగా నివాసం కల్పిస్తారు. రోజులో 50% సమయాన్ని చెట్లకోసమే కేటాయిస్తారు.. ఎక్కడికి వెళ్ళినా తన షెడ్యూల్ లో 50% ఆ ప్రాంతంలోని మొక్కలకు సంబంధించిన వివరాలు తెలుసుకోవడంలోనే గడుపుతారు. "చివరికి తను చనిపోతే భూమిలో కాకుండా చెట్ల తొర్రలో పూడ్చాలని చెప్పి తన సన్నిహితులకు, కుటుంబ సభ్యులకు తెలియజేశారట". ఇదొక్కటి చాలు చెట్లపై తనకున్నా ప్రేమను అర్ధం చేసుకోవడానికి..
రంగారెడ్డి జిల్లాలోని పొద్దుటూరులో ఉన్న ఈ ఫామ్ లో ఇటలీ, మెక్సికో, అర్జెంటీనా, ఉరుగ్వే, చైనా లాంటి దేశాలలోని మొక్కలతో పాటు ఇంకా మనదేశంలోని వివిధ ప్రాంతాలలోవి కలిపి 15,000కు పైగా చెట్లున్నాయి. మొత్తం వెయ్యి రకాల వృక్ష జాతులను తన 100 ఎకరాల ఫామ్ హౌస్ లో ఆత్మీయ బంధువులుగా వర్ధిల్లుతున్నాయి. ఇన్ని రకాల చెట్లను సంరక్షించాలంటే అది ఒక్కరి వల్ల కాదు దాదాపు 80 మంది మొక్కలపై అవగాహన ఉన్న 80మంది సిబ్బందిని నియమించుకున్నారు.
ఓసారి మహేశ్వరంలోని మన్సన్ పల్లిలో ఓ రైతు తన పొలాన్ని రియల్ ఎస్టేస్ వ్యాపారులకు అమ్మేశాడు. రియల్టర్లు 1500 సంవత్సరాల వయసున్న ఓ ఆఫ్రికా జాతి చెట్టును నరికేయబోయారు రాందేవ్ గారు హుటా హుటిగా అక్కడికి చేరుకుని ఆ చెట్టును తన ఫామ్ హౌజ్ లోకి తెచ్చేసుకున్నారట ఈ సంఘటన ఆ మధ్య సంచలనం సృష్టించింది. వందల సంవత్సరాల పాటు ఒకే చోటులో ఉంటూ భూమిలో వెళ్ళు బలంగా పాతుకుపోయి ఉండడంతో మరోచోటుకు తరలించడం వల్ల దాని ప్రాణానికి ఇబ్బంది కలగడంతో 6 రోజులపాటు కెమికల్ ట్రీట్మెంట్ ఇచ్చి దానిని బ్రతికించారు.
ఇవ్వి మాత్రమే కాదు జి.హెచ్.ఎం.సి వారు రోడ్లు విస్తరించే సమయంలో చెట్లను నరకడం చేస్తుంటారు. రాందేవ్ గారు మాత్రం వందల సంఖ్యలో చెట్లను తన ఫామ్ లోనికి తీసుకువస్తారు. ట్రాన్స్ లోకేషన్ పద్దతిలో బ్రతికుండగానే చెట్లను వ్రేళ్ళతో సహా మరోచోటుకి తరలిస్తుండడంతో ఈ పద్దతికి లక్షల సంఖ్యలో ఖర్చు వస్తుండేది ఐనా సరే చెట్లు చేస్తున్న సేవ ముందు ఇది చాలా తక్కువే అంటూ బదులిస్తారు.