కొన్ని సంవత్సరాల క్రితం కరీంనగర్ ధర్మపురి పుణ్యక్షేత్రానికి చెందిన వైష్ణవి అనే పాప బ్రేయిన్ కు సంబంధించిన వ్యాధితో తీవ్రంగా బాధపడుతున్నది. డాక్టర్లు పరీక్షించి ఎంత వీలుంటే అంత త్వరగా ఆపరేషన్ చేయాలి అని తేల్చి చెప్పారు. ఆపరేషన్ కు మూడు లక్షలవుతుంది. బస్ ఛార్జీల కొరకు వంద, రెండొందలంటే ఉన్నాయి. మూడు లక్షలంటే ఎక్కడి నుండి తీసుకొచ్చేది రా భగవంతుడా.. అని బాధ పడుతూ కనపడ్డ వారినళ్లా వారే భగవంతుడని ఆపరేషన్ కోసం సహాయం అడుగుతున్నారు. ఈ సంధర్బంలో ఓ ఆరోజు పాప వైష్ణవి పరిస్థితిని చూసి రమేష్ గారు ఎంతో కలత చెందారు.
ఎల్.ఐ.సి ఏజెంట్ గా పనిచేస్తునే, జర్నలిస్ట్ గా పని చేస్తున్న రమేష్ గారు ఓ దినపత్రికలో వైష్ణవి కథనాన్ని ప్రచురించారు.. కాని ఆశించినంత స్పందన రాకపోవడంతో రమేష్ గారు తన ఫేస్ బుక్ టైం లోనే వైష్ణవి బ్రతకడానికి చేస్తున్న పోరాటాన్ని పోస్ట్ చేశారు. వైష్ణవి ఆపరేషన్ ఖర్చు మూడు లక్షలైతే ఆ పోస్ట్ కు అందిన సహాయం ఎంతో తెలుసా అక్షరాల తొమ్మిది లక్షలు. ప్రభుత్వం తరుపున స్థానిక ఎం.ఎల్.ఏ కొప్పుల ఈశ్వర్ గారు స్పందించి ఆపరేషన్ కు అయ్యే ఖర్చంతా భరించారు. వైష్ణవి ఆపరేషన్ సక్సెస్ ఐయ్యింది, మిగిలిన డబ్బును పాప పేరు మీద ఫిక్సిడ్ డిపాజిట్ చేసి “భగవంతుడా అని పిలిచిన వారి జీవితంలో వెలుగు నింపిన ఓ నిజమైన మనిషి రమేష్ గారు”.
మాయమైపోతున్నాడమ్మ మనిషి అని పాడుకుంటున్నాము కాని మానవత్వం నిండిన మనుషులు మన మధ్య ఎంతోమంది ఉన్నారు. వారిలో చాలామందికి సహాయం చేయాలని ఉన్నా సరైన నమ్మకం, వేదిక లేక, సమయం లేక లేదంటే మరే ఇతర కారణాల వల్ల కుదరడం లేదు. వైష్ణవి సంఘటన స్పూర్తితో మరింత మందికి వారి జీవితాలను అభాగ్యులకు అందజేస్తున్నారు ఫేస్ బుక్ పోస్ట్ ల ద్వారా...
మరో హృదయ విధారకమైన సంఘటన ఇది. ధర్మపురి మండలం తీగలధర్మారం గ్రామం హరిజన కాలనీకి చెందిన మైలారపు నరేష్ (14) నాగమంజుల(10)లు పుట్టుకతో మంచానికే పరిమితమై అచేతన స్థితిలో జీవిస్తున్నారు.. మేధస్సు వారిలో పెరగక పోవడంతో చావు కోసం కూడా ఎదురచూడలి అని తెలుసుకోలేని పరిస్థితి వారిది. తండ్రి మల్లేష్ కూలి పని చేస్తుండగా తల్లి పద్మ వీరిరువురి సేవల కోసం కూలి పని కూడా చేసుకోలేక ఇంట్లోనే ఉంటుంది. ప్రతి రోజు మందులు వాడుతుండగా ఒక రోజు వాడకపోయిన ఫిట్స్ తో బాధ పడతారు. ప్రతి 2 , 3 నెలలకు ఎదో ఒక సమస్యతో ఆసుపత్రిలో వైద్యం కోసం చూపిస్తున్నారు. ఈ విషయం తెలుకున్న రమేష్ గారు ఆ చిన్నారుల జీవితాన్ని సాటి మనుషులతో పంచుకున్నారు.. కట్ చేస్తే అద్భుతం వారుండడానికి ఓ సొంత ఇల్లు, బ్రతడానికి కొంత డబ్బు లభించింది..
ఇలా గత మూడు సంవత్సరాల నుండి ఫేస్ బుక్ వేదిక ద్వారా చేస్తున్న పోస్ట్ లకు విశేశ స్పందన లభించింది. ఇప్పటివరకు 29 మంది నిరుపేదలకు 45 లక్షల సహాయం అందింది. రమేష్ ప్రతి సమస్యను క్షుణ్ణంగా పరిశీలిస్తారు. సహాయం కోసం ఎదురుచూస్తున్న వారున్న ప్రదేశానికి వెళ్ళి తెలుసుకుని మరీ సహాయం చేస్తుంటారు అలా ఎంతోమందిని ఆదుకుని 12 మంది నిరుపేదలకు దాతల సహాయంతో ఇంటిని కూడా నిర్మించారు. ఫేస్ బుక్ అంటే టైం పాస్ కోసమో, కామెడి కోసం ఉపయోగిస్తున్న వారు చాలామంది.. రమేష్ గారు మాత్రం ఇలా సమాజానికి ఉపయోగపడేలా ఉపయోగించుకునంటూ ఫేస్ బుక్ యూజర్ కు కొత్త అర్ధాన్ని తీసుకువచ్చారు.