తోపుడు బండ్లు, జట్కా, రిక్షా.. నిన్నటి ప్రయాణ సాధానాలు. మెషిన్ ని కాక మనిషి కండరాలను, ఎముకలను నమ్ముకున్న రోజులు ఎంతటి శక్తివంతమైనవో కదా.. రమేష్ గారు హైదరాబాద్ వాసి, వారు జన్మించిన 1970లలో రిక్షాలు తోపుడు బండ్ల ఆధిపత్యమే ఎక్కువ, నాడు ప్రజలలో చదువులు తక్కువ, ఆదాయమూ తక్కవ ఈ బండ్ల మూలంగా ఎంతోమందికి ఉపాధి, మరెంతో మందికి ఉపయోగం కలిగింది. ప్రస్తుతం వాటి స్థానంలోనే ఏసీ బస్సులు, కార్లు మొదలైనవి వచ్చినందు వల్ల సమాజంలో వీటిపై కాస్త చిన్న చూపు ఉంది. వీటిని తక్కువ చేసి చూడడం అంటే మన పూర్వీకులను తక్కువ చేసి చూడడమేనని రమేష్ గారి అభిప్రాయం.
నాటి శ్రామికులు, వారి దగ్గర ఉండే వాహనాలు నేటి మనుషులు, మెషీన్ల లా పెద్దగా హడావిడి హడావిడి చేయవు. ఆర్టిస్ట్ రమేష్ గారికి శ్రామిక శక్తిపై అధిక ప్రేమ. తనకు జన్మతః ఆస్తిగా వచ్చిన కళలోను శ్రామిక శక్తికే ప్రదర్శించడానికి ఇష్టపడుతుంటారు. చిన్నప్పుడు ఏదో హాబీగా వేసే బొమ్మలు కాస్త టీచర్లు, స్నేహితులు అభినందించడం మూలంగా తన అడుగులు ఆర్ట్ వర్క్ వైపుగా వెళ్లాయి. 1986లోనే జేఎన్ టీయూలో బ్యాచ్లర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ పూర్తిచేశారు. పెయింటింగ్ కొద్ది కాలంలోనే పట్టు దొరకదు అది కూడా క్లాసికల్ డాన్స్ లానే సంవత్సరాల శ్రమ, నిరంతర సాధన అవసరం, వాటర్ కలర్స్ లో స్టిల్ లైఫ్ బొమ్మలు, పోస్టర్ కలర్స్ తో గోల్డెన్ రూల్స్ ఆధారంగా గీసి బొమ్మలు, పెన్సిల్ ఆధారంగా వేసే అతి కష్టమైన విభాగాలలో ఆయన నిష్ణాతులు అయ్యారు.
డబ్బు కోసం వెంపర్లాడితే ఆర్టిస్ట్ బ్రతకలేడు: రమేష్ గారిది రంగారెడ్డి జిల్లా పరిగి మండలంలోని దోమ అనే పల్లెటూరు. నాన్న స్కూల్ టీచర్. బిఎఫ్ ఏ పూర్తిచేసిన తర్వాత తన అభిరుచికి తగ్గట్టుగా పెయింటింగ్స్ వేసేవారు. అయితే ఆయన వేసే బొమ్మలలోని పాత్రలకు మల్లే పెయింటింగ్స్ స్ట్రగుల్ ఫేస్ చేసేవి, దాంతో రమేష్ గారు ప్రయాణించవలిసిన పరిస్థితి ఏర్పడి వివిధ కంపెనీల కోసం కమర్షియల్ గా కొంతకాలం పనిచేశారు. ఒకవేళ ఆ సమయంలో ఫైనాన్షియల్ సపోర్ట్ ఉండేదుంటే కనుక ఈపాటికే వేసే పెయింటింగ్స్ మూలంగా గుర్తింపు వచ్చేది, ప్రస్తుతం ఆర్ధికంగా కాస్త నిలదొక్కుకోవడం వల్ల పూర్తిగా తన ఇష్టానికి తగ్గ బొమ్మలను వేస్తున్నారు. డబ్బు మూలంగా అసలైన జీవితం వాయిదా పడటం అంటే ఇదే కాబోలు.