జన్మతహా వచ్చిన ఒక వైకల్యం కాని, లోపం కాని మన లక్ష్యానికి అడ్డు అని అనుకుని మన ఆశలను ఆశయాలను చంపుకోవాల్సిన పనిలేదు. ఎన్నో లోపాలున్నా కాని ఎంతో సాధించినవారు ఎంతోమంది ఉన్నారు మన ప్రపంచంలో.. షూటర్ గా తెలంగాణ రాష్ట్రం తరుపున అంతర్జాతీయ స్థాయిలో వెలుగొందుతున్న రష్మి కి కూడా పుట్టుకతోనే వినికిడి శక్తి లేదు.
రష్మి తాత, నాన్న గారు ఆర్మిలో గన్ను పట్టుకుని సైనికులుగా దేశానికి సేవచేశారు. ప్రాణాన్ని అందించే జీవనది ఓ ప్రాంతం నుండి మరో ప్రాంతానికి ప్రవహించాలి అలాగే ప్రతిభ కుడా ఒక తరం నుండి మరో తరానికి వచ్చినప్పుడే ఆ ప్రతిభ కొనసాగబడతుంది. అలా తాత గారు, నాన్న గారు ఆర్మీలో పనిచేయడంతో చిన్నప్పటి నుండి ఆ ఆయుధాల తాళుకు బొమ్మలతో ఆడుకునేవారు. ఆ ఇష్టమే తర్వాతి కాలంలో టాలెంట్ గా మారిపోయింది. తల్లిదండ్రులకు ఒకే పాప అవ్వడంతో రష్మీకి భయం నేర్పించలేదు, గన్ను ఇచ్చి ధైర్యాన్ని నూరిపోశారు. అలా నాన్న గారే మొదటి గురువుగా గన్ను పై శిక్షణ ఇచ్చేవారు.
ట్రైనింగ్ తీసుకున్నా గాని దానినే కెరీర్ గా ఎంచుకోవాలని అంతగా ప్రయత్నించలేదు. విదేశాలలో మాస్టర్స్ పూర్తి చేసిన తర్వాత ఇక్కడ ఓ బ్యాంక్ లో ఉద్యోగం మొదలుపెట్టారు. కాని రష్మి నాన్న గారికి మాత్రం ఓ షూటర్ గా దేశ అంతర్జాతీయ పోటీలలో పాల్గొని మెడల్స్ సాధించాలని కోరుకున్నారు. తండ్రి కోరికతో పాటు తనకూ ఇష్టం ఉండడంతో బ్యాంక్ ఉద్యోగానికి రాజీనామా చేసి పూర్తిగా షూటింగ్ లో చరిత్ర సృష్టించడానికి మార్గాన్ని ఎంచుకున్నారు.
ఒక్కోసారి మన లోపమే మనకు ఉపయోగకరంగా మారుతుంది. రష్మీకి వినికిడి శక్తి అంతగా లేకపోవడంతో తన చుట్టూ డిస్ట్రర్బ్ చేసే శబ్ధాలు అంతగా వినపడవు దీనివల్ల తన దృష్టి అంతా షూటింగ్ మీదనే కేంద్రీకరించి ఎన్నో మెడల్స్ అందుకున్నారు. బ్యాంక్ ఉద్యోగానికి రాజీనామా చేసిన సంవత్సరంలోనే (2006) మొదటిసారి నేషనల్ లెవల్ లో బంగారు పతకం గెలుపొందడంతో తన పేరు మారుమ్రోగిపోవడం ప్రారంభించింది. ఆరోజు నుండి సాగిన తన ప్రస్థానం ఎన్నో అవార్డులు రివార్డులు అందుకున్నారు ఈ సంవత్సరం కూడా ఏషియన్ షూట్ గన్ లో కూడా గోల్డ్ మెడల్ గెలుపొందారు.