నిజానికి మన సాంప్రదాయ వంటలలో ఉన్నంత రుచి, పోషక విలువలు మరే ఇతర వంటలలో ఉండవు కాబోలు.. అందుకే ఆ మధ్య విదేశీ వంటల మీద మోజు పెంచుకున్నా కాని మళ్ళి ఓ సర్కిల్ లా ఇప్పుడు మన రుచులపై మనసు మళ్ళింది. "రాయలసీమ రాగి సంగటి" ఆహా ఆ పేరులోనే ఉంది కదా ఓ రాజసం, మిగిలిన వంటలన్నీ నా తర్వాతే అన్న గర్వం. నిజమే పేరులో ఉన్నంత గర్వం రాగి సంగటిలోని పోషకాలు, రుచి రూపంలో ఉండడం చేత మన రాయలసీమ ప్రజలు ప్రేమతో ఇది మా ప్రాంతపు వంట అంటూ సగర్వంగా చెప్పుకుంటుంటారు.
నాటుకోడి, రాగి సంగటి: కొన్ని కాంబినేషన్లను కడుపార ఆస్వాధించగలమే గాని మాటల్లో పరిపూర్ణంగా వర్ణించలేం. రాగి సంగటిలోని పోషకాలు, నాటుకోడిలోని రుచి ఈ రెండింటి కాంబినేషన్ గురించి అంతే వర్ణించలేము. సీమ ప్రజలు అత్యంత ఇష్టంగా తీసుకునే వంటలలో ఇది ఒకటి. ఈ రుచిని ఒక్కసారి ఆస్వాధించినా గాని ఒదలిపెట్టడం మాత్రం చాలా కష్టం. అందుకే ప్రస్తుతం ఈ కాంబినేషన్ రాయలసీమ ప్రాంతానికే పరిమితం అవ్వలేదు దేశమంతటా వివిధ రెస్టారెంట్లలోనూ ఆతృతగా ఉన్న భోజన ప్రియులను చేరుకుంటుంది. ఇప్పుడంటే ఆదివారాలు, శుభకార్యాలలో చికెన్, మటన్ బిర్యానీలు వండుతున్నారు కాని పూర్వం రాగి సంగటి నాటు కోడినే ప్రత్యేక రోజులలో అతిథులకు వడ్డించేవారట.
ఇప్పుడు రాగ సంగటి చక్రంలా మనవైపు రావడంతో యువత మాత్రమే కాదు విదేశీయులు సైతం ఆవురావురుమంటూ ప్రపంచాన్ని మరిచి లాగించేస్తున్నారు. తక్కువ ధరకే గొప్ప పోషకాలు లభ్యమవుతుండడంతో అన్ని వర్గాలవారికి ఇది అందుబాటులో ఉంటుంది. శరీర సౌందర్యానికి మాత్రమే కాదు బలిష్టమైన ఎముకులకై కూడా రాగి చిన్నపిల్లల నుండి పెద్దవారి వరకు ఎంతో ఉపయోగకరం. రాగి సంగటి మనది మన భారతీయులది.. వేడివేడిగా వండిన రాగి ముద్దలో నాటుకోడి పులుసుని పొర్లించి చికెన్ ముక్కలు తుంచుకుని పంటికిందకు లాగి ఉదరా బదరా నమిలిమింగుతా వుంటే ఆహా ఆ రుచే వేరు..