These Incidents In Savitri Gari Life That Weren't Showed On Screen Will Shock You To The Core!

Updated on
These Incidents In Savitri Gari Life That Weren't Showed On Screen Will Shock You To The Core!

"సావిత్రి గారి జీవితాన్ని పరిపూర్ణంగా ఒక సినిమా రూపంలో, లేదంటే ఓ పుస్తక రూపంలో తెలియజేయడం అనేది ఎవ్వరి వల్ల సాధ్యపడదు. సావిత్రి గారి జీవితాన్ని వివరించిన ఆర్టికల్స్, సహా నటుల ఇంటర్వ్యూలు, పుస్తకాలు, సినిమాలు మొదలైన అన్నింటితో ఓ చిన్నపాటి లైబ్రెరీ ఏర్పాటు చేస్తే గాని ఆ మహానీయురాలి గురుంచి రేపటి తరానికి తెలియదు". పసుపులేటి రామారావు గారు, పల్లవి గారు, నరసింహా రాజు గారు మొదలైన వ్యక్తుల వల్లనే సావిత్రి గారి జీవితంలో జరిగిన వివిధ సంఘటనలు, మనకు తెలియని ఎన్నో విషయాలు తెలిశాయి. వారి కృషి ఈ ఆర్టికల్ రూపకల్పనకు ఎంతగానో ఉపయోగపడింది.

భాకి తీర్చేశారు:

నాడు మన తెలుగు చిత్ర సీమను ఏలిన నటులలో గుమ్మడి వేంకటేశ్వర రావు గారు కూడా ఒకరు. 20లలో కూడా 60 ఏళ్ళ ముసలి పాత్రలలో నటించి యువకుడిగా ఉన్నప్పుడే "పరిపూర్ణ నటుడు" అనే కీర్తిని అందుకున్నాడు. గుమ్మడి గారికి సావిత్రి గారికి మధ్య దశాబ్ధాల ఆత్మీయ అనుబంధం ఉండేది. సావిత్రి గారు సినిమాలో అడుగుపెట్టిన నాటి నుండి ఆర్ధికంగా ఇబ్బందులు ఎదుర్కోవడం వరకు అన్ని చూశారాయన. ఈ సంఘటన సావిత్రి గారు చిన్న చిన్న క్యారెక్టర్లు చేస్తున్న సమయంలో జరిగింది. గుమ్మడి గారికి జ్వరం వచ్చి వారం రోజుల నుండి మంచం మీదనే పడుకుని ఉన్నారు. ఈ విషయం తెలుసుకున్న సావిత్రి గారు గుమ్మడి గారిని పరామర్శించడానికి వచ్చి కాసేపు మాట్లాడి వెళ్ళిపోయింది. కాసేపు పడుకుని లేచిన తర్వాత గుమ్మడి గారికి తలగడ పక్కన ఎదో గుచ్చుకున్నట్టుగా అనిపించి అటుచూశాడు.. ఆశ్ఛర్యం.. రెండు వేల రూపాయలు కనిపించాయి.. సావిత్రి గారికి ఫోన్ చేసి ఇదే విషయాన్ని అడిగారు. "మీకు గుర్తుందో లేదో.. చాలా రోజుల క్రితం అవసరం ఉండి మీ దగ్గర అప్పుగా తీసుకున్నాను. ఈ రోజే ఓ సినిమా కోసం ప్రొడ్యూసర్ గారు అడ్వాన్స్ కింద 5,000 రూపాయలు ఇచ్చారు. అందులో నుండి మీ అప్పు తీర్చేశాను, నేను పోయేలోగా ఏ ఒక్కరికీ కూడా నయాపైస అప్పు ఉండకూడదు. అని తన ఆత్మగౌరవాన్ని చాటుకున్నారు సావిత్రి గారు..

"ఏ మహాదర్శకుడైనా సావిత్రి గారికి సన్నివేశాన్ని వివరించాడే తప్ప నటనను నేర్పలేదు"

నేను ఏ సహాయం చేయలేక పోయాను - చిరంజీవి గారు.

ఒక్కసారి తన నటన చూశాక సావిత్రి గారికి అభిమానులు కానివారు ఎవరున్నారుంటారు చెప్పండి. ఎన్.టి.ఆర్ గారి దగ్గరి నుండి నేటి పది సంవత్సరాల పిల్లలు కూడా సావిత్రి గారికి అభిమానులే. ఈ కోవలోకే చిరంజీవి గారు ఇంకా వారి తల్లితండ్రులు కూడా వస్తారు. సావిత్రి గారు పునాది రాళ్ళు సినిమాలో కూడా నటిస్తున్నారని తెలియడంతో అప్పుడే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన చిరంజీవి గారు ఎంతో సంతోషపడ్డారు. ఐతే వెండితెర మీద చూసిన సావిత్రి గారికి షూటింగ్ సమయంలో చూసిన సావిత్రి గారికి ఏ మాత్రం పోలికలు కనిపించలేదట. అప్పటికే తాను అద్భుతమైన రూపు రేఖలను కోల్పోయి ఉన్నారు. "నాడు విషయం తెలుసుని బాధ పడ్డ చిరంజీవి గారు అభిమానాన్ని మాత్రం చాటుకోగలిగాను గాని ఆర్ధికంగా ఆదుకోలేక పోయానని గత స్మృతులను ఓ పుస్తకంలో నెమరువేసుకున్నారు".

"హీరోయిన్ల వైభవయుగం సావిత్రి గారితోనే ఆరంభమయ్యిందని చెప్పుకోవచ్చు. నిన్న, నేడు,రేపు సావిత్రి గారి గురుంచే మాట్లాడతారు. సావిత్రి గారిని మాత్రమే ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటారు".

నన్ను ప్రేమతో తమ్ముడు.. అని పిలిచేవారు- దాసరి గారు.

దాసరి నారాయణ రావు గారు సావిత్రి గారి చివరిరోజుల వరకు తాను డైరెక్ట్ చేసే ప్రతి సినిమాలోనూ ఓ పాత్ర ఇస్తూ ప్రోత్సహిస్తూ వస్తున్నారు. అప్పుడు దాసరి గారు తన తారక ప్రభు బ్యానర్ మీద దుర్గా నాగేశ్వరరావు అనే తన శిష్యుడిని దర్శకుడిగా పరిచయం చేస్తూ "దేవదాసు మళ్ళి పుట్టాడు" సినిమా నిర్మిస్తున్నాడు. అందులో సావిత్రి గారు కూడా నటిస్తున్నారు. షూటింగ్ చివరిదశకు వచ్చినప్పుడు "తమ్ముడు చివరిషాట్ నువ్వే డైరెక్ట్ చెయ్యాలని కోరారు, అందుకు దాసరి గారు సరే అక్కయ్య అని ఆనందంగా ఒప్పుకున్నారు". ఐతే కాసేపటి ఓ భారీ కేక్ ను అక్కడికి తీసుకువచ్చారు. ఏమిటో అర్ధం కాక సావిత్రి గారు అక్కడ పనిచేస్తున్న అసిస్టెంట్ డైరెక్టర్ ను అడిగారట. ఈ రోజు దాసరి గారు పుట్టినరోజమ్మ అందుకే ఈ ఏర్పాట్లు అని చెప్పి తన పనులలోకి వెళ్ళుపోయాడు. వెంటనే సావిత్రి గారి దాసరి గారి దగ్గరకు వచ్చి "ఏంటి తమ్ముడు నాకు కనీసం ఒక్క మాటైనా చెప్పలేదు అని ఆత్మీయంగా కసిరి, తన మెడలోని బంగారు గోలుసును తీసి దాసరి గారి మెడలో వేశారట". ఇలాంటి ప్రేమ పూసిన సంఘటనలు వారి మధ్య ఎన్నో..

"నేను చేసిన సినిమాలలో నా నిజజీవితానికి అతి దగ్గరిగా ఉన్న పాత్ర తోడికోడళ్ళు సినిమాలోని సుశీల పాత్ర". - సావిత్రి గారు

బంగారు వస్తువుని అమ్మేసి:

సావిత్రి గారు హీరోయిన్ గా నటిస్తున్నప్పటి నుండి విరాళాలు అందించడం మొదలుపెట్టారు. ఓసారి ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి గారి పిలుపు మేరకు రక్షణ నిధి కోసం తన ఒంటిమీద నగలన్ని అందించిన సావిత్రి గారికి ఇలాంటి సంఘటనే మళ్ళీ ఎదురయ్యింది. అప్పుడు మంత్రి పీవీ నరసింహారావు గారు. ఇండస్ట్రీలోని నటులను ఆత్మీయంగా కలుసున్న తర్వాత పీవీ గారు తన మెడలో వేసిన పూల మాలను దేశ రక్షణ నిధి కోసం వేలం వేశారు. అప్పటికే ఆర్ధిక అవసరాలు ముప్పుతిప్పలు పెడుతున్నా కాని ఆ వేలంలో సావిత్రి గారూ పాల్గొన్నారు. పోటీపడి పాడడంతో వేలం 36 వేల వరకు చేరింది. అక్కడే ఉన్న సన్నిహితులు వద్దని వారించినా "అదేమిటండి ఇది మన దేశానికి సంబంధించిన విషయం నేను పాడకపోతే ఎలా అని వారితో బదులిచ్చి, 36వేలకోసం ఓ బంగారు వస్తువుని అమ్మి ఆ డబ్బు ఇచ్చారట.

"1961 నుండి 1967 వరకు కూడా సావిత్రి గారికి స్వర్ణయుగం. ఏ సినిమా చేసినా సూపర్ హిట్. సావిత్రి గారు తమ సినిమాలో నటిస్తే సినిమాకు నిండుతనం వస్తుందని దర్శకులు, నిర్మాతలు భావించేవారు. ఆ కాలాన్ని ఆమె శాసించారు వివిధ భాషలలో కలిపి సంవత్సరానికి 20 సినిమాలకు పైగానే చేశారు".

డైరెక్షన్ స్కిల్స్:

ఆదుర్తి సుబ్బారావు గారి దర్శకత్వంలో సుమంగళి సినిమా షూటింగ్ జరుగుతుంది. సీన్ పూర్తి అయ్యాక హీరో నాగేశ్వరరావు గారు ఒంటరిగా కూర్చుని ఉన్నారు. సావిత్రి గారు అక్కడికి వెళ్లి "అన్నయ్య గారు మీరు ఇందాక చెప్పిన డైలాగ్ ను వేరే మాడ్యులేషన్ లో చెబితే బాగుంటుందని వేరే మాడ్యులేషన్ లో సావిత్రి గారు ఆ డైలాగ్ ను చెప్పారట, అది ఎంతో నచ్చి నాగేశ్వరరావు గారు మళ్ళి రీషూట్ జరిపించారట. ఆ తర్వాత ఇదే సినిమాలో నాగేశ్వరరావు గారికి మాత్రమే కాక మహా దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు గారికి కూడా సలహాలు ఇచ్చారు. "నాకు ఓ ఆలోచన వచ్చింది మీకు నచ్చతే ఉపయోగించుకోండి అని.. "నాగేశ్వరరావు, గారు నేను కెమెరా ముందు నిలబడి డైలాగులు చెప్పడం కన్నా లైటింగ్ డల్ చేసి బ్యాక్ గ్రౌండ్ లో వైట్ కర్టెన్ పెట్టి దానిపై మా షాడోలు మాట్లాడుకుంటునట్టుగా తీస్తే ఎఫెక్టివ్ గా ఉంటుంది" అని వర్ణించగానే "అద్భుతం" అని మహాదర్శకుడు ఆదుర్తి గారు ఆ విధంగానే షూట్ చేశారట.

GIF by Gifskey.com

"సావిత్రి గారు పేద అభిమానుల ఇళ్ళల్లో పెళ్లిళ్లు జరిగితే తాళిబొట్టును పంపేవారు. అదే కాస్త ధనవంతుల పెళ్లి అయితే వెండి బిందెలను తన కానుకగా పంపేవారు. షూటింగ్ పనులలో బిజీగా ఉన్నా సరే వాటిని వాళ్లకు చేర్చేవారు".

యూనిట్ సభ్యులతో:

సావిత్రి గారి మదిలో పేద, ధనిక లాంటి భావనలుండవు.. సహా నటులతో మాత్రమే కాదు యూనిట్ సభ్యులతో కూడా అందరితో ఒకేవిధంగా ఉంటారు. దాదాపు తన దగ్గరికి వచ్చిన ప్రతీ సినిమాను చేసేవారు. ఫలానా సినిమా షూటింగ్ కు అదే ఆఖరిరోజు అని తెలియగానే లైట్ బాయ్, అసిస్టెంట్లు మొదలైన సిబ్బందికి బట్టలతో పాటు, కొంత డబ్బు కూడా ఇచ్చేవారు. అలాగే తన దగ్గరికి వచ్చే పేద అభిమానుల పిల్లల పెళ్లిళ్లకు మంగళసూత్రాలు కూడా అందించి వారి కుటుంబాలకు అండగా నిలిచేవారు. దానధర్మాల విషయంలో కే.వి రెడ్డి గారు, చక్రపాణి గారి లాంటి సన్నిహితులు హెచ్చరించినా సావిత్రి గారు చిరు నవ్వుతో విషయాన్ని దాటవేసేవారట.

"సావిత్రి గారు కేవలం 22 సంవత్సరాల వయసులోనే అగ్రనటి అయ్యారు. నటన విషయంలో మాత్రమే కాదు, రెమ్యునరేషన్ విషయంలోనూ స్టార్ హీరోల స్థాయిలో ఆమె రెమ్యునరేషన్ ఉండేది".

శ్రీశ్రీ గారితో అనుబంధం:

సావిత్రి గారి నటనకు ముగ్ధుడైన విప్లవ కవి శ్రీ శ్రీ గారు ఆరాధన సినిమాలో సావిత్రి గారిని ఊహిస్తూ "నా హృదయంలో నిదురించే చెలి కళలలోన కవ్వించే సఖి.. మయూరివై నీవే" అనే పాట రాశారు. అదే సమయంలో శ్రీశ్రీ గారు ఆరాధన సినిమా షూటింగ్ లొకేషన్ కు వచ్చి సావిత్రి గారిని కలిశారు. వారి మధ్య ఓ సరద సంభాషణ చోటు చేసుకుంది.

**ఈ సినిమా సూపర్ హిట్ అవుతుంది సావిత్రి గారు.

**థాంక్యూ శ్రీశ్రీ గారు.

**సరేనండి నేను బయలుదేరుతాను.

**మీరు రాసిన పాట చాలా బాగుందండి, అప్పుడప్పుడు కలుస్తూ ఉండండి.

**రావడానికి ఇబ్బందేమి లేదు, కాని జెమినీ గారు ఉంటారేమోనని భయం. ఈ మధ్య తమిళ జర్నలిస్టుల్ని జెమినీ గారు ఏకి పారేస్తున్నారు. మీ ఇద్దరి మధ్య జరిగిన విషయాల గురుంచి ఏవేవో రాస్తున్నారని.. మీతో మాట్లాడితే నన్ను కూడా జర్నలిస్ట్ అనుకుని బాధేస్తారని నా భయం.

**(పెద్దగా నవ్వుతూ) మీకా భయం అవసరం లేదు. ఆయన ఇక్కడికి రావడం లేదు. నేను ఆయనను కలిసి ఐదు నెలలు అవుతుంది. ఆయనను ఇక్కడ ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. ఇక నేను కాని, మీరు కాని, ఎవ్వరూ కూడా భయపడాల్సిన అవసరం లేదు అని చెప్పారట.

ఆమె నటనకు డైరెక్టర్లే కంటతడిపెట్టుకునేవారు:

సాధారణంగా ర్తెటర్లు దర్శకులు రూపొందించిన కథను ముందుగా చదివిన నటులు బాధపడతారు, ఆ తర్వాత ప్రేక్షకులు బాధపడతారు కాని ఇక్కడ మాత్రం విచిత్రమైన సంఘటన. చివరకు మిగిలేది సినిమా చాలా బరువైన కథ. సావిత్రి గారు ఈ సినిమా కోసం దాదాపు 25 రోజులపాటు షూటింగ్ లో పాల్గొన్నారు. కొన్ని కొన్ని దృశ్యాలలో సావిత్రి గారు పాత్రలో లీనమై నటిస్తుంటే అది చూస్తున్న డైరెక్టర్ రామినీడు గారు, అసిస్టెంట్ల కళ్ళు నీళ్లతో నిండిపోయేవి.. "డైరెక్టర్ గారు మీరు ఎమోషనల్ అవుతున్నారు.. నేను ఎమోషనల్ అయ్యి, మీరు కూడా ఎమోషనల్ అయితే ఇక సినిమాను ఎవరు తీస్తారండి" అని ఆ సమయంలో సావిత్రి గారు వారికి దిశ నిర్దేశం చేశారు.

ప్రాణాపాయం:

ముగమనసులు సినిమా దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు, నాగేశ్వరరావు, సావిత్రి గార్ల కెరీర్ లో ఓ మైలురాయిగా నిలిచింది. ఈ సినిమా షూటింగ్ కొంతవరకు ఆదుర్తి గారు గోదావరి నదిపై చిత్రీకరించారు. సినిమాలోని "ఈనాటి ఈ బంధమేనాటిదో" పాట షూటింగ్ జరుగుతున్నప్పుడు సావిత్రి గారు ప్రమాదవశాత్తు నీటిలో పడిపోయి పడవ పట్టుకుని వేలాడుతున్నారు. వారున్నది లోతుగల ప్రాంతం. వెంటనే నాగేశ్వరరావు గారు చెయ్యందించారు, ఆవెంటనే యూనిట్ సభ్యులు, గజ ఈతగాళ్ళు హుటాహుటిగా చేరుకుని ఒడ్డుకు తీసుకువచ్చారు. స్టీమర్ల సహాయంతో యూనిట్ సభ్యులు వచ్చేన్త వరకు తనను రక్షించిన నాగేశ్వరరావు గారి గురుంచి ఎన్నో వేదికలపై సావిత్రి గారు నాటి జ్ఞాపకాలను అభిమానులకు వివరించేవారు

GIF by Gifskey.com

"ఓసారి ఓ అభిమాని వైజాగ్ నుండి వచ్చి సావిత్రి గారిని కలుసుకుని మెడిసిన్ చదువుకోవాలనుకున్నాను, కాని డబ్బులేకపోవడం వల్ల అది మధ్యలోనే ఆగిపోయింది అని చెప్పగానే మీ పెద్దవాళ్ళను తీసుకురమ్మని చెప్పారు సావిత్రి గారు. వారు రాగానే అన్ని వివరాలు తెలుసుకుని మెడిసిన్ కోసం ఆరోజుల్లోనే 50,000 రూపాయల ఆర్ధిక సహాయాన్ని అందించారు ఆ మాతృమూర్తి."

మందు అలవాట్లపై:

1967 నుండి అవకాశాలు నెమ్మదిగా తగ్గుతూ వస్తున్నాయి.. ఐతే ఈ సందర్భంలోనే నమ్మిన వ్యక్తులు ఆమెను మోసం చెయ్యడంతో తట్టుకోలేకపోయారు. అప్పుడే "మనుషుల గురించి ఆలోచించడం మొదలుపెట్టింది, మనుషులు ఇంత దారుణంగా ఉంటారా అని తెలియడంతో అప్పటివరకు అప్పుడడప్పుడు తీసుకునే మందులో మోతాదు పెరిగింది". వ్యక్తిగత జీవితం, ఇతర సమస్యల మూలంగా కొన్నిసార్లు ఏమీ కలుపుకోకుండా అలాగే తాగేవారట. ఓ సన్నిహితురాలు సావిత్రి గారిని తాగడం మానెయ్యాలని సలహా ఇచ్చినప్పుడు.. ""ఎలా ఎలా మానెయ్యాలో నువ్వే చెప్పు. కళ్ళు మూసినా తెరిచినా మోసాలే కనిపిస్తున్నాయి. నా కన్న తల్లి తప్ప అందరూ నన్ను మోసం చేశారు. ఒక్కో సంఘటన గుర్తుకువస్తుంటే గుండెల్లో మంట పుడుతుంది. ఆ మంట హృదయాన్ని మండింపచేస్తుంది. అందుకే తాగుతున్నా. నేను తాగకపోతే చచ్చిపోతాను, త్రాగుతున్నాను కాబట్టే బతుకుతున్నాను. తాగి తాగి కళ్ళు మూసుకుని నిద్రపోయి బాధలను కొన్ని గంటలైన మర్చిపోతున్నాను. అందుకే తాగుతున్నాను. తాగకుండా నేను ఉండలేను అని గుండెచాటున దాగిన రహస్యాన్ని ఆ సన్నిహితురాలకి వివరించి మరోసారి కన్నీటిపర్యంతమయ్యారు".

"చివరిరోజుల్లో సావిత్రి గారు కోమాలోకి వెళ్లిపోయిన తర్వాత ఆమెను సంరక్షించడం ఇబ్బందయ్యేది. సావిత్రి గారికి చేసిన వైద్య ఖర్చులన్నీటి కోసం సావిత్రి గారి డబ్బునే ఉపయోగించారు.. ఆస్తులన్నీ ఇతరులు మోసాలు చేసి కాజేయడం, ఐటీ వారు స్వాధీనం చేసుకున్నా కానీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూ పిల్లల పేరు మీద కూడా కొన్ని ఆస్థులు కొనుగోలు చేశారు.. ఆ తర్వాత పిల్లలకు ఆ ఆస్థులు అమ్మలా అండగా నిలిచాయి.

మరణానికి ముందే మరణం:

కోమాలోకి వెళ్లిన సావిత్రి గారి బాగోగులు ఓ వ్యక్తి చూసుకుంటున్నాడు. ఓ రోజు అక్కడికి వచ్చిన జెమినీ గణేషన్ గారితో "మీరు పిలవండి, కళ్ళు తెరుస్తారేమో" అన్నాడు. "సావిత్రి.. అమ్మాడి.. ఈ పిలుపుతో కోమాలో ఉన్న సావిత్రి గారి శరీరం ముందుగా వణికింది. కాళ్ళు, చేతులు వణుకుతున్నాయి జెమినీ గణేషన్ గారు మాత్రం పిలవడం ఆపలేదు. సావిత్రి గారు నెమ్మదిగా కళ్ళు తెరిచారు. మొదట జెమినీ గారిని చూశారు మాట్లాడలేదు, చుట్టూ ఉన్న వాళ్ళను చూశారు మాట్లాడలేదు. 14 సంవత్సరాల తన కొడుకు సతీష్ ను చూశారు అప్పుడు కూడా మాట్లాడలేదు. అప్పుడే టేప్ రికార్డర్ ఆన్ చెయ్యమని ఓ హోమియో డాక్టర్ సలహా ఇచ్చారు. సావిత్రి గారికి దేవదాసు పాటలంటే చాలా ఇష్టం. టేప్ రికార్డర్ ఆన్ అయ్యింది. "అంతా బ్రాంతియేనా.. జీవితానా వెలుగింతేనా.. ఆశా నిరాశేనా మిగిలింది చింతేనా.. కాని ఆ పాటకు కూడా సావిత్రి గారు స్పందించలేదు.

"ఫిల్మ్ ఇండస్ట్రీ ఎప్పుడు ఒక ప్రవాహం. ఒకరు వెళ్తుంటే పదిమంది వస్తారు. ఎప్పుడూ సావిత్రే ఉంటుందా.? సావిత్రి చచ్చిపోయిందయ్య. ఇంకా చచ్చిపోయిన సావిత్రి గురుంచి మాట్లాడతావెందుకు.?? - క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తున్న సమయంలో ఓ జర్నలిస్ట్ కు సావిత్రి గారు ఇచ్చిన సమాధానం ఇది.