Here's Everything You Need To Know About The Only Real Star Of Tollywood!

Updated on
Here's Everything You Need To Know About The Only Real Star Of Tollywood!

శ్రీహరి పుట్టింది మిడిల్ క్లాస్ ఫ్యామిలిలో కూడా కాదు ఒక నిరుపేద కుటుంబంలో, ఇంట్లో అందరు పనిచేస్తే తప్ప ఇల్లు గడవని పరిస్థితి.. కష్టం మాత్రమే తెలుసు సుఖాన్ని కూడా కష్టపడటంలోనే చూశారు శ్రీహరి.. చిన్నతనం నుండే మెకానిక్ గా, ఇంటింటికి తిరిగి పాలు పోస్తు తన భాద్యతను ఆ వయసు నుండే ప్రారంభించారు. తను పనిచేస్తున్న వర్క్ షాప్ ముందు థియేటర్ ఉండేది ఆ థియేటర్ లో ఎప్పుడు ఏదో ఒక కొత్త సినిమా ఆడుతుండేది పెద్ద పెద్ద కటౌట్లు, అభిమానుల సంబరాలు, ఈలోలు అంతా ఒక మాంచి పండగ వాతావరణంలా ఉండేది.. ఈ పక్కన షాప్ లో పనిచేస్తున్న మన చిన్ని శ్రీహరి వీటన్నీటిని చూస్తు ఎప్పటికైనా నేను హీరో అవ్వాలి నా కటౌట్ ను కూడా ఇలా చూసుకోవాలి నా సినిమా కూడా ఇంతటి పండుగల ఘనంగా జరగాలి అని కలలు కన్నాడు.. ఆ లక్ష్యం కూడా తనలాగే పెరిగింది. అప్పటి పరిస్థితులలో హీరో అవ్వాలంటే డబ్బు ఉండాలి, ఇండస్ట్రీలో తెలిసిన వారుండాలి, లేదంటే ఏదైన గొప్ప టాలెంట్ ఉండాలి..! కాని అప్పటి మన శ్రీహరికి ఇవ్వేమి లేవు ఒక్క ఆశయం తప్ప... జిమ్నాస్టిక్స్ లో రాణించితే తనకంటు ఒక గుర్తింపు వస్తుంది అల సినిమా అవకాశాలు వస్తాయి అని భావించారు.. ఎలా ఐనా నన్ను నేను ఉన్నత స్థాయిలో చూసుకోవాలి అంటూ బ్రూస్ లీని గురువుగా భావించి ఏకలవ్య శిష్యుడిగా మారాడు బ్రూస్ లీ ఫైట్స్ తో పాటు జిమ్నాస్టిక్స్ కూడా బాగా చేసేవాడు అలా శ్రీహరి కూడా జిమ్నాస్టిక్స్ శిక్షణ ప్రారంభించాడు.

srihari-4

శ్రీహరి ఉండేది హైదరాబాద్ బోయిన్ పల్లి లో ప్రాక్టీస్ జరిగేది జింఖానా గ్రౌండ్స్ లో.. ప్రతిరోజు గ్రౌండ్ నుండి ఇంటికి, ఇంటి నుండి గ్రౌండ్ కి మళ్ళి స్కూల్ కి, ఇంకా పార్ట్ టైం జాబ్ ఇలా ప్రతిరోజు 20 కిలోమీటర్లు సైకిల్ మీద తిరుగుతు విపరీతమైన కష్టాలు అనుభవించారు తన శిక్షణా సమయంలో.. ఇంట్లో స్థలం లేకుంటే ఎన్నో సంవత్సరాలు వర్క్ షాప్ లో పడుకునేవారు. ఏ దిక్కు లేనోడికి దేవుడే దిక్కు ఇండస్ట్రీలో ఎవ్వరు తెలియని శ్రీహరికి తన కష్టమే అతి పెద్ద ఆస్థిగా, పెద్ద దిక్కుగా మారింది.. ఆ కష్టమే అతన్ని జిమ్నాస్టిక్స్ లో నేషనల్ స్థాయిలో ఎన్నో మెడల్స్ లను సాధించి పెట్టింది. అప్పటి వరకు హీరో అంటే అందాగాడు, విలన్లు అంటే కృరంగా ఉండేవారు.. కాని శ్రీహరి రాకతో విలన్ లుక్ మొత్తం మార్చేశాడు. కండలు తిరిగిన బాడీతో ఏ డూప్ లేకుండా హీరోకు తగ్గ శక్తితో దృడంగా కనిపించేశాడు. ఇండస్ట్రీలో రాగానే అవకాశాలు కూడా అలాగే రాలేదు మొదట విలన్ వెనుక ఎస్కాట్ గా, బాడీగార్ఢ్ గా దాదాపు 10 సంవత్సరాల పాటు చిన్న చిన్న పాత్రలు చేసుకుంటు వచ్చారు అంతేకాని తన ఓపికను, కష్టాన్ని ఓదిలిపెట్టలేదు. ఇప్పుడు అల్లు అర్జున్, ప్రభాస్ అనుకుంటాం కాని శ్రీహరి 20సంవత్సరాల క్రితమే ఇండస్ట్రీకి సిక్స్ ప్యాక్ ను పరిచయం చేశారు. బాలకృష్ణ రౌడి ఇన్స్పెక్టర్ సినిమాతో శ్రీహరికి స్టార్ విలన్ గా గొప్ప పేరువచ్చింది. హీరోగా మొదటిసినిమా "పోలీస్" సినిమాతో ఇండస్ట్రీలో ఒక ట్రెండ్ సెట్ చేశారు శ్రీహరి.. ఏ థియేటర్ ముందు ఐతే పనిచేశాడో ఏ థియేటర్ లో తన కటౌట్ చూడాలని కలలు కన్నాడో అదే శోభన థియేటర్లో తన కటౌట్ లను చూసుకున్నాడు.. సినిమా రిలీజ్ అయ్యి అఖండ విజయం సాధించింది.

ew32

8 మందిని ఒక తండ్రిలా పోషిస్తున్న డిస్కోశాంతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు శ్రీహరి.. శాంతి సినిమాలలో మంచి క్రేజ్ ఉన్న డాన్సర్. శాంతి తండ్రి ఆనందన్ తమిళ్ లో పెద్ద హీరో. తండ్రి మరణంతో కుటుంబం పరిస్థితి దయనీయంగా మరడంతో శాంతి హీరోయిన్ గా కాకుండా ఐటమ్ సాంగ్స్ చేయడానికి కూడా వెనకాడలేదు.. కుటుంబం(శాంతి కుటుంబం) కోసం అంతటి త్యాగం చేసిన శాంతి అంటే శ్రీహరికి చాలా గౌరవం.

SrihariFamily-h-1

శ్రీహరిని రియల్ స్టార్ అనడానికి చాలా కారణాలున్నాయి. రియల్ స్టార్ అంటే కేవలం డూప్ లేకుండా ఫైట్స్ చేయడం మాత్రమే కాదు నటనలో ఆ పాత్ర తాలుకు జీవితంలో జీవించేవారు. ఒక చిన్న ఉదాహరణతో ఆయనది ఎంత మంచి మనస్తత్వమో తెలుస్తుంది... జిమ్నాస్టిక్స్ లో మెడల్స్ తీసుకొస్తున్న శ్రీహరికి రైల్వే డిపార్ట్ మెంట్ వారు ఉద్యోగం ఇవ్వడానికి ముందుకొచ్చారు. ఆ సమయంలో తనతో పాటు జిమ్నస్టిక్స్ చేసే మిత్రుడికి నాకన్నా ఆ ఉద్యోగం అతనికి అవసరం అంటూ త్యాగం చేసి ఒక కొత్త జీవితాన్ని అందించారు. నరేంద్ర మోడి గారు సంసద్ గ్రామ యోజన ద్వారా, ఇంకా శ్రీమంతుడు సినిమా ఎఫెక్ట్ ద్వారా ఇప్పుడు చాలా మంది గ్రామాలను దత్తత తీసుకుంటున్నారు కాని నిజానికి శ్రీహరి ఎప్పుడో 10 సంవత్సరాల క్రితమే మేడ్చల్ పరిధిలోని మూడు గ్రామాలను దత్తత తీసుకొని వాటిని ఎంతగానో అభివృద్ధి చేశారు. తన 4 నెలల కూతురు అక్షర మరణంతో కలతచెంది అక్షర ఫౌండేషన్ పేరు మీద ఏన్నో సేవా కార్యక్రమాలు చేసి శ్రీహరి నిజంగానే గొప్ప రియల్ స్టార్ గా నిలిచారు. అనారోగ్య కారణాలతో మన రియల్ స్టార్ పైనున్న స్టార్స్ ని దాటి భగవంతుడిని చేరుకున్నారు. శ్రీహరి మనల్ని విడిచిపెట్టి ఒదిలిపోయినా అయన చేసినా పాత్రలు, గొప్ప సేవా కార్యక్రమాలు, ఆయన జీవతం ఇప్పటికి ఎప్పటికి మనకు ఆదర్శమే...

7