ఒక విద్యార్ధికి ఉన్నత ప్రమాణాలతో ఉన్న యూనివర్సిటి ఎంత అవసరమో వారు ఉండేందుకు కూడా మంచి వాతావరణంలో నివాసం కూడా అంతే ముఖ్యం. అలా దాదాపు శతాబ్ధం పాటు ఎందరో విద్యార్ధులకు రెడ్డి హాస్టల్ ఇల్లు అయ్యింది. పేరులో 'రెడ్డి' ఉన్నా కాని ఈ హాస్టల్ అన్ని కులాలు, మతాల వారికి ఆశ్రయం ఇచ్చింది.. ఇస్తుంది. మన ఉస్మానియా యూనివర్సిటి 1917లో విద్యనందించడం మొదలుపెడితే రెడ్డి హాస్టల్ 1918లో విద్యార్ధులకు ఆశ్రయమందించడం మొదలయ్యింది.
ఎలా ప్రారంభమయ్యింది.? నిజాం రాజుల పరిపాలనలో హైదరాబాద్ స్టేట్ కొత్వాలుగా ఉన్న పింగళి వెంకట రామారెడ్డి దీనిని స్థాపించడంలో అత్యంత కీలక పాత్ర పోషించారు. ఆ రోజుల్లో గ్రామాలలో నివసిస్తున్న పేద రెడ్డి కులస్తులు హైదరాబాద్ లో చదువుకోవడానికి కాలేజీలు, యూనివర్సిటీలు ఉన్నా గాని నివాస సౌకర్యాలు ఏమి లేకుండేవి. విద్యార్ధుల ఇబ్బందులను చూసి వెంకట రామారెడ్డి గారు ఎంతోబాధపడేవారు. రెడ్డి రాజులు, రెడ్డి జమిందారులు ఉన్నాకాని రెడ్డి పేదలు ఇలా ఇబ్బంది పడకూడదని ఎంతోమంది రెడ్డి జమిందారులు, సంస్థాపనాధీశుల నుండి ఆర్ధిక సహకారం తీసుకుని దీనిని ప్రారంభించారు. మొదట ఇది ఒక అద్దె ఇంటిలో ఒక గది, ఐదుగురు విద్యార్ధులతో ప్రారంభమయ్యింది.. ఆ తర్వాత 1924లో వేల గజాల స్థలంలో భవనాన్ని నిర్మించారు.
లైబ్రెరీ, ప్లే గ్రౌండ్: వెంకట రామా రెడ్డి గారికి పుస్తకాలంటే ఎంతో ప్రేమ ఉండేది. ఒక గొప్ప పుస్తకంలో ఒక జీవితాన్ని మార్చేంతటి శక్తి ఉంటుంది. ఇదే ఉద్దేశంతో ఆ రోజుల్లోనే 11,000 వేల పుస్తకాలతోనే(ప్రస్తుతం ఆ సంఖ్య ఎన్నో రెట్లు పెరిగింది.) ఓ లైబ్రెరీని హాస్టలో పొందుపరిచారు. స్టూడెంట్స్ కు లైబ్రెరీ ఎంత ముఖ్యమో, గేమ్స్ కూడా అంతే ముఖ్యమని హైదరాబాద్ లో మరే ఇతర హాస్టల్ లో లేనంతగా ప్లే గ్రౌండ్ కూడా విస్తరించారు.
మహిళల కోసం: ఆ రోజుల్లో మహిళలు అన్ని రంగాలలో ఉదయించాలని మాడపాటి హనుమంతరావు గారితో కలిసి గర్ల్స్ హైస్కూల్, తర్వాత కాలేజిను కూడా నిర్మించారు. ఆ తర్వాత మహిళల కోసం ప్రత్యేకంగా హాస్టల్ ను కూడా నిర్మించారు. ప్రస్తుతం ఈ సొసైటీ కింద సుమారు 18 కాలేజీలు నడుస్తున్నాయి.
ఇక్కడే ఉండి చదువుకున్న కొందరు ప్రముఖులు: భారత స్వాతంత్ర పోరాటం, నిజాం రాజులపై పోరాటం జరుగుతున్న రోజులలో హాస్టల్ వేదికగా ఎన్నో ఉద్యమాలు జరిగాయి. ఎంతోమంది మహనీయులు విద్యార్ధి దశలోనే పోరాటం మొదలుపెట్టారు. సి.నారాయణ రెడ్డి, సురవరం ప్రతాపరెడ్డి, రావి నారాయణ రెడ్డి, ఆరుట్ల రామాచంద్రారెడ్డి, పి.వి నరసింహా రావు, మర్రి చెన్నారెడ్డి, నాయినీ నర్సింహారెడ్డి, జైపాల్ రెడ్డి ఇంకా ఎందరో ఎమ్.ఎల్.ఏలు, మంత్రులు, డాక్టర్లు, ఐ.ఏ.ఎస్ అధికారులు లాంటి ఎందరో గొప్పవారు ఇక్కడ ఉండి విద్యను కొనసాగించారు.