తెలుగు సినిమా చరిత్రలో చాలా మంది దర్శకులు,రచయితలు అనేక పాత్రలని సృష్టించారు,ఆ పాత్రలు మనల్ని ఎంతగానో అలరించాయి,ఆనందింపజేశాయి,కొన్ని పాత్రలు మనకి జీవితాంతం గుర్తుండిపోతాయి వాటిల్లో మంచితనానికి మౌంట్ ఎవరెస్ట్ లాంటి పాత్ర రేలంగి మావయ్య పాత్ర. మన కాలేజీ జీవితం లో మనకి ఉండే ఒక మోస్తరు విలన్ అంటే మన HOD లే కదా,మరి ఒక వేళ రేలంగిమావయ్య మనకి HOD అయితే,మన మీద మన పేరెంట్స్ కి ఒక కంప్లైంట్ లెటర్ రాస్తే …ఈ ఊహాత్మక ఆలోచనకి సృజనాత్మక రూపం ఈ ఉత్తరం…….
||శ్రీరామ....జయరామ....జయజయరామ||
అనకాపల్లి వాస్తవ్యులైన మంగినపూడి మూర్తి గారికి మీ శ్రోయోభిలాషి మనఃపూర్వకముగా నమస్కరిస్తూ రాయునది ఏమనగా ముందుగా ఈ ఉత్తరం చదువుతున్న మీకు,ఈ ఉత్తరం రాయడానికి కారణమైన మీ అబ్బాయికి,ఇది రాస్తున్న నాకు,ఇలా అందరికి బోలెడంత మంచి జరగాలని అన్నవరం సత్యనారాయణ స్వామి ని కోరుకుంటూ....
నేనండీ మీ అబ్బాయి చదివే డిపార్టుమెంటుకి HOD ని,పేరుకి HODనే కానీ, భలే చనువుగా ఉంటానండీ పిల్లందరితో,ఈ మధ్య మీ అబ్బాయి కాలేజీ లో ఎవరితోనో ఎదో చిన్న గొడవ పడ్డాడటండి, ఇప్పుడూ ఈ మాట ఆళ్లు ఈళ్ళు వొచ్చి మీకు చెప్తే భాదపడిపోతారు కదండీ,అందుకే నేనే చెప్తున్నానండి.పెద్దగా కంగారేమీ పడకండి,అయినా కుర్రోళ్ళు, ఆళ్లు కాకపోతే ఎవరు గొడవలు చేస్తారండి,ఎదో అల్లరి అని మనమే చూసి చూడనట్టు వదిలేయాలి,మీరు తిట్ఠమాకండి. నేనే ఓసారి కూర్చోపెట్టి చెప్పానండి ,చక్కగా విన్నాడు,భలే మంచోడండీ మీవాడు. అచ్చం మీలాగే ...
ఇంకో విషయం అండి,మీ అబ్బాయికి అటెండాన్సు కూడా కాస్త తక్కువ ఉండండి,ఎదో సరదాగా సినిమాలకి ఎళ్లినట్టు ఉన్నాడు,పాపం ఎండలో టిక్కెట్ల కోసం ఎంత కష్టపడ్డాడో ఏమో, ఈ వయసులో హుషారుగా ఏవో షికార్లంటూ తిరుగుతుంటారు,పాపం ఈ గోలలో పడి రికార్డులు అవి,పూర్తిచేయలేదట, మీరేం భయపడకండి ఆ అటెండాన్సు ,మార్కులు గట్రా నేను చూసుకుంటాను,మీరోసారి కాలేజీ కి వొచ్చేవెళ్ళండి మూర్తి గారు,చక్కగా అరిసెలు ,పూతరేకులు,జంతికలు తింటూ కాసేపు సరదాగా మాట్లాడుకుందాం ... ఉంటానండి ……….
ఇట్లు మీ భవదీయుడు రేలంగి రాజారామ్ (రేలంగి మావయ్య)