This Story Will Make Us Introspect About How We Are Treating The One We Love

Updated on
This Story Will Make Us Introspect About How We Are Treating The One We Love

Contributed By Dr. SS Chaitanya Prasad

మౌనిక.. అందంగా ఉంటుంది. మా పక్క వీధిలో ఉంటుంది. నాలుగేళ్లుగా తెలుసు. రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నాం. అప్పట్లో తన వెంట పడి వేధించి మరీ ఒప్పించా. అంత గొప్ప ప్రేమ నాది. కానీ అప్పటి నుంచి ఇప్పటిదాకా చాలాకొద్దిసార్లు నాతో ప్రేమగా మాట్లాడింది. ఎవరైనా చూస్తారని భయం తనకి. ఒకసారి బలవంతంగా తనను ఎవరూ లేని సమయంలో మా ఇంటికి తీసుకెళ్ళి తన చేయి పట్టుకున్నా. అంతే. తన గుండె చప్పుడు నాకు వినిపించింది. ఏం అవుతుందో ఏమో అని వెంటనే చేయి వదిలేసి తన ఇంట్లో వదిలేసా. అంత పిరికిది తను. అందుకే ఎప్పుడూ పిచ్చి మొహంది అంటూ ఉంటా తనని. అయితే ఉద్యోగం మాత్రం చేస్తుంది ఒక సాఫ్టవేర్ కంపెనీలో. స్కూటీ మీద వెళ్లేది రోజూ. షిఫ్ట్ డ్యూటీల వల్ల ఒక్కోసారి ఆలస్యం అయ్యేది తను ఇంటికి రావడం.

నాకు మాత్రం ఏ రోజూ ఒక ఫోన్ కూడా చెయ్యదు వచ్చి తీసుకెళ్ళమని. నేను అటు వైపు వెళ్ళినా సరే, నా బైక్ మీద ఎక్కదు. అసలు నా లవర్ లాగే బిహేవ్ చేసేది కాదు. పిరికిది తను. చాలా పిరికిది. అసలు ఏమి చేతకాదు. ఎంతైనా అడది కదా. అంతేలే అనుకునే వాడిని. ఇక మా పెళ్ళికి తన వాళ్లను ఎలా ఒప్పిస్తుందో అని నా భయం.

ఒకరోజు తన అమ్మానాన్నలు ఏదో పని మీద గుంటూరు వెళ్లారు. ఇంట్లో తను ఒక్కటే ఉంది. నేను ఆ విషయం తెలిసి వెళ్లాను తన ఇంటికి. ఎందుకు వచ్చావు అంది. ఇందుకు అని చెప్పి తనని గట్టిగా పట్టుకుని కౌగిలించుకున్నాను. ముద్దు పెట్టుకున్నాను. అయినా తను అస్సలు స్పందించలేదు. కాసేపు అలాగే చేసి సోఫాలో కూర్చుని తనని కూడా లాగి సోఫాలో పడేసా. ఏదో చేయబోతే గట్టిగా నన్ను తోసేసింది. నాకు కోపం వచ్చింది. నీకు నా మీద అస్సలు ప్రేమ లేదు అని అరిచా. తను మౌనంగా ఉంది. అసలు నన్ను పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉందా లేదా? ఏ రోజూ ప్రేమగా మాట్లాడింది లేదు, ఆఫీసులో లేట్ అయినా నన్ను పిలవవు. నేను నీకు ఎంత ఫ్రీడమ్ ఇచ్చాను. నువ్వు జీన్స్ వేసుకోవడం నాకు నచ్చదు. అయినా సరే ఏమీ అనట్లేదు. నీ ఫోన్ చెక్ చేసి అబ్బాయిల మెసేజ్లు ఉన్నా సరే ఎప్పుడూ అడగలేదు. వేరే వాడి బైక్ మీద మొహం కనిపించకుండా స్కార్ఫ్ కట్టుకుని వెళ్తుంటే చూసి కూడా ఏమి అనలేదు. అయినా నీకు అర్థం కాదు. పోనీ ఆఫీసులో వేరే ఎవరినైనా... అనే నా మాట పూర్తి అవ్వక ముందే నా వైపు కోపంగా చూసింది. కోపం కాదు అది. అసహ్యంగా చూసింది.

నేను సారీ చెప్పి, సరేలే ఆఫీసుకి తీసుకెళ్తా పద. అటు వైపే వెళ్తున్నా నేను అని చెప్పి తీసుకెళ్ళాను తన బైక్ మీదనే. ఒక్క మాట కూడా మాట్లాడలేదు తను. రాత్రి ఆఫీస్ అయ్యాక వాట్సాప్ చెయ్యి. వచ్చి తీసుకెళ్తా అని చెప్పా. దానికి మాత్రం సమాధానం చెప్పింది. వద్దు, నాకు లేట్ అవుతుంది. వాట్సాప్ చేయడానికి నెట్ కూడా లేదు. నేను వచ్చేస్తా. ఫోన్ చేస్తానులే అని చెప్పి వెళ్ళిపోయింది. వెళ్ళేటప్పుడు వెనక్కి తిరిగి కూడా చూడలేదు. కానీ నాకు బాగా తెలుసు. నేను ఫోన్ చెక్ చేస్తా అని భయంతో వాట్సాప్ తీసేసింది. ఫోన్ చేస్తాను అంది, కానీ చెయ్యదు అని నాకు బాగా తెలుసు.

నేను అక్కడ నుంచి వెళ్ళిపోయాను. నాకు వేరే ఆఫీసులో ఇంటర్వ్యూ ఉంది. అది ముగించుకుని ఒక స్నేహితుడి రూమ్ కి వెళ్లి వాడితో పాటు ఒక బీర్ తాగుతూ అక్కడే కూర్చున్నా. వాడికి అలవాటు మందు, సిగరెట్టు. వాడితో పొద్దున జరిగిన విషయం చెప్పుకున్నా. వాడు ఇలా అన్నాడు. నువ్వు అంత బాగా చూసుకున్నావా తనని.. తనకి అమ్మానాన్నలు లేరా? హహహ నువ్వు తనకి ఫ్రీడమ్ ఇవ్వడం ఎంటి రా.. పిచ్చోడా. తన లైఫ్ లోకి నువ్వు రాక ముందే తన ఫ్రీడమ్ తనకి ఉంది. అమ్మాయిలు జీన్స్ వేసుకోవడం తప్పు అయితే అసలు ఎందుకు అమ్ముతారు? వాళ్ల కంఫర్ట్ ముఖ్యం నీ లాంటి వాళ్ల ఇష్టం కంటే. వేరే వాడి బైక్ మీద ఎక్కడం గురించి మాట్లాడుతున్నావు కదా.. మొన్న నీకు కుదరకపోతే ప్రియను నా బైక్ మీద కాలేజ్ కి తీసుకెళ్ళా కదా. ఆ రోజు ప్రియ కూడా మొహం కనిపించకుండా స్కార్ఫ్ కట్టుకుంది. ప్రియ నీకు చెల్లి. అలాగే మౌనిక కూడా ఇంకొకరికి చెల్లి రా. ఇడియట్ వి రా నువ్వు. వేరే అబ్బాయిల మెసేజ్లు డిలీట్ చేస్తే తప్పు కానీ, నిజాయితీగా మాట్లాడితే తప్పు ఏం ఉంది రా బాబూ... అంటూ నిద్రలోకి జారుకున్నాడు వాడు. వాడి మాటలు విని గిల్టీ గా ఫీల్ అయ్యాను. అవన్నీ నిజాలే. కానీ ప్రేమను, జీవితాన్ని నా కోణంలో మాత్రమే చూడడం అలవాటు అయ్యి ఇలా ఆలోచించాను అని సిగ్గు పడ్డాను.

ఇంతలో నా ఫోన్ మోగింది. "పిరికిది" కాలింగ్ అని చూడగానే ఆశ్చర్యం వేసింది నాకు. తను నాకు కాల్ చేస్తుంది అని అనుకోలేదు. టైమ్ చూస్తే 11.30. ఫోన్ ఎత్తాను. హల్లో మేడం.. ఇది కలా నిజమా అని నేను పూర్తి చేయక ముందే.. విజయ్, నాకు చాలా భయంగా ఉంది. నన్ను ఎవరో కుర్రాళ్లు తీసుకొచ్చి ఎక్కడో చిన్న రూంలో పడేశారు. తల మీద కొట్టారు. కళ్లు తిరిగాయి. ఇప్పుడే స్పృహ వచ్చింది. వాళ్లు బయట ఉన్నారు. అని చెప్పింది. నాకు గుండె ఆగినంత పనైంది. తెలీకుండానే వచ్చిన కన్నీళ్లు తుడుచుకుంటూ.. మౌని, ఇంకా ఎవరికైనా ఫోన్ చేశావా. అమ్మ వాళ్లకు కానీ, 100 కి కానీ.. అని అడిగా. లేదు. నీకే చేస్తున్నా. అంది. లొకేషన్ పంపమంటే అసలు నెట్ లేదు అంది. నాకు ఏం చేయాలో తోచలేదు. ఎక్కడ నుంచి నిన్ను తీసుకెళ్లారు అని అడిగా. తను చెప్పింది. టోల్ గేట్ దగ్గర వస్తుంటే నా స్కూటీ టైరు పంచర్ అయ్యింది. ఒక పిల్లాడు వచ్చి పంచర్ షాప్ కి తీసుకెళ్ళాడు. అక్కడే ఉన్న ఒక లారీకి నా తల గట్టిగా తగిలే లా నన్ను తోసేశాడు ఇంకొకడు. అని ఇదంతా చెప్తూ తను వణికిపోయింది. అర్జెంటుగా 100 కి ఫోన్ చెయ్యి. బ్లూ టూత్ ఆన్ చేసి పెట్టుకో చెవిలో అని చెప్పా. ఇంకాసేపు తనకి ధైర్యం చెప్పి, నేను చెప్పినట్టు చేయమన్నా. నువ్వు ప్రాణాలతో ఉండడం నాకు కావాలి మౌని. అన్నాను. సరే అంది. అంతలో ఒకడు తను ఉన్న రూమ్ లోకి వచ్చాడు. అదంతా వింటున్న నాకు ప్రాణం పోయినట్టు అయ్యింది. పాపం తన పరిస్థితి తలచుకుంటే నాకు కూడా వెన్నులో వణుకు మొదలైంది.

చనిపోయే ముందు ఎవరికైనా తన జీవితం మొత్తం ఒకసారి కనిపిస్తుంది అంటారు. నాకు అప్పుడు మా ఇద్దరి మధ్య జరిగిన ప్రతి విషయం గుర్తుకు వచ్చింది. ఇప్పుడు తను పోలీసులకు ఫోన్ చేయడం కూడా కుదరదు. కాబట్టి నేను చెప్పినట్టు చేయమన్నా. నేను గట్టిగా ఊపిరి పీల్చుకుని, అస్సలు భయపడకు. నీకు ఏమీ కాదు. నేను నీతోనే ఉన్నాను. ఇప్పుడు నువ్వు వాడికి సహకరించు అని చెప్పాను. తను నిర్ఘాంతపోయి ఏడ్చేసింది. నేను కూడా బయలుదేరాను నా బైక్ మీద టోల్ గేట్ దగ్గరికి.

ఒక గంట సేపు తర్వాత.. నేను పోలీసులతో కలిసి తనని వెతుకుతూ ఉన్నాం. ఫోన్ కూడా కట్ అయ్యింది. ఒక పాడుబడిన ఇల్లు కనిపించింది. నేను ఒక్కడినే అందులోకి వెళ్లా. లోపల ఏమి చూడల్సి వస్తుందో అని భయంతో ఒక తలుపు తీసా. లోపల ఒక మూలన చిన్న గట్టు మీద తను కూర్చుని ఉంది. గట్టిగా ఊపిరి తీసుకుంటూ విరబోసిన జుట్టుతో, కోపం నిండిన కళ్లతో శూన్యంలోకి చూస్తూ ఉంది. తన చేతి నిండా, మొహం మీద రక్తం. భద్రకాళి అమ్మవారి ఉగ్ర రూపం అది. చేతులు ఎత్తి మొక్కాలి అనిపించింది. తన కాళ్ల దగ్గర ఇద్దరు కుర్రాళ్లు పడి ఉన్నారు. ఒకడు చచ్చిపోయాడు. ఇంకొకడు రక్తం మడుగులో కొన ఊపిరితో కొట్టుకుంటూ ఉన్నాడు. పోలీసులు వచ్చి చూసి మౌనిక ను జాగ్రత్తగా అక్కడ నుండి తీసుకుని వెళ్లారు. ప్రెస్ వాళ్లు వచ్చారు. చిరిగిన తన షర్టు పైన ఒక గుడ్డను కప్పారు. జరిగింది అంతా చెప్పమని అడిగారు. తను చెప్పింది..

నేను టోల్ గేట్ దగ్గర వస్తుంటే నా స్కూటీ టైరు పంచర్ చేసి, నా తల మీద కొట్టారు. పడిపోయాను. నా నోట్లో బలవంతంగా మద్యం పోశారు. స్పృహ వచ్చేసరికి ఆ రూంలో ఉన్నాను. అప్పుడు నాకు ఏమీ తోచలేదు. నేను ప్రేమించిన విజయ్ కి ఫోన్ చేశాను. నాకు ధైర్యం చెప్పాడు. వాళ్లకి సహకరించి, వాళ్ల శరీరంలో దేని కోసం అదంతా చేస్తున్నారో అది ఒక చిన్న బలహీనమైన కండరం మాత్రమే. దాన్ని గాయపరుస్తే చాలు అని చెప్పాడు. కానీ అక్కడ నాకు ఏ ఆయుధం లేదు. తను ఇచ్చిన ధైర్యం తప్ప. అలాగే చేశాను. తెంచేసి పక్కన పడేసాను. అది చూసి ఇంకొకడు కూడా భయపడ్డాడు. అప్పుడు వాడి భయమే నా ఆయుధం అయ్యింది. వాడిని గోడకేసి కొట్టాను. తల పగిలి కింద పడ్డాడు. ఇంకో ఇద్దరు పారిపోయారు. అని చెప్పి, ఒక్కసారిగా తన పైన కప్పిన గుడ్డను తీసి విసిరేసి, గట్టిగా అరిచింది. ఇది శరీరం మాత్రమే. దీని వెనక ఒక మనసు ఉంది. దాన్ని గెలవండి.. అని చెప్పి, నా వైపు పరిగెడుతూ వచ్చి నా కళ్ళలోకి చూసింది.

ప్రేమతో చూసిన తన చూపు నేను భరించలేక పోయాను. ఆ రోజు ఉదయం తన ఇంటికి వెళ్లి నేను చేసింది, అదే రోజు రాత్రి తనకి జరిగింది ఒకటే కదా అనిపించింది. నేను తన ప్రేమికుడిని అని ప్రపంచానికి ధైర్యంగా చెప్పింది. మనిషిగా చచ్చి, తన ప్రేమికుడిగా మళ్లీ పుట్టానేమో అనిపించింది. తన తోడుగా నిలిచిన అమ్మాయిని రాణి లాగ చూసుకుంటూ సైనికుడిలా కాపాడుకునే వాడే అసలైన మనిషి అని అర్థం అయ్యింది.