Meet The Revolutionary Writer Daasarathi Who Waged A War Against The Nizams With His Writings!

Updated on
Meet The Revolutionary Writer Daasarathi Who Waged A War Against The Nizams With His Writings!

భారతీయులు బ్రిటీష్ వారి నుండి ఏ రకమైన బాధలు అనుభవించారో దాదాపు నిజాం రాజుల నుండి కూడా తెలంగాణ ప్రజలు అంతే దౌర్భగ్య రోజులు గడిపారు. అలాంటి దీన రోజులపై ఎంతోమంది వీరులు సాగించిన సాయుధ పోరాట స్థాయిలోనే ఒక కవి భయంలేక బరితెగించాడు. "నిజాంల వైపు తుపాకి ఉంటే నా వైపు కలం ఉంది.. వాడు తుటాలను వదిలితే నేను అక్షరాలను సంధిస్తా" అని ధీటుగా ఆ ఉద్యమం కన్న బిడ్డ ముందుకు కదిలాడు.. "మా తెలంగాణకు పట్టిన బూజువు రా నువ్వు.. నువ్వు దగాకోరు, బడాచోరు" అని నిజాం నియంతలను నేరుగా అక్షర సైన్యంతో ఎదుర్కున్నాడు దాశరథి కృష్ణమాచార్యులు గారు. దుర్మార్గుల తలలను తెగనరకే ఖడ్గం ముందు అగ్నిలో మునగాలి.. దెబ్బలకి ఓర్వాలి, రాటుదేలాలి.. సైనికుడి శరీరంలో భాగం అవ్వాలి.. అప్పుడు కాని దాని అసలైన శక్తి బయటపడదు. దాశరధి గారు కూడా ఈ దశలన్నీ దాటి ముర్తిభవించిన రచయితగా ఆవిర్భవించారు. ఒకానొక సందర్భంలో నిజాం రాజు దాశరథి గారిని జైలులో బంధిస్తే ఆ జైలు గోడలపై పళ్ళు తోముకునే బొగ్గుతో కవిత్వాలు రాశారు అదే తర్వాత "అగ్నిధార" అనే పుస్తకంగా ప్రచురించబడింది కూడా.

దాశరథి గారు కేవలం నిజాం రాజులపై, భూస్వాములపై, బ్రిటీష్ వారిపై మాత్రమే కాదు ప్రజల అజ్ఞాణంపై కూడా తిరుగుబాటు చేశారు. అగ్నిధార, మహాంధ్రోదయం, రుద్రవీణ, కవితా పుష్పకం(ఆంధ్ర ప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కారం) తిమిరంతో సమరం(కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం) మార్పు నా తీర్పు, ఆలోచనాలోచనాలు, ధ్వజమెత్తిన ప్రజ లాంటి ఎన్నో గొప్ప పుస్తకాలు రచించి జాతికి అంకితమిచ్చారు. తల తెగబడబోతుందన్నా గాని నా కలాన్ని వదలను అని అవిశ్రాంతంగా తన సహజమైన ఉనికిని ప్రదర్శించారు. ఉస్మానియా యూనివర్సిటి లో బీ.ఏ ఇంగ్లీష్ పూర్తిచేసిన దాశరథి గారు సినిమాలకు ఎప్పటికి గుర్తుండి పోయే పాటలను కూడా అందించారు. ఆంధ్ర యూనివర్సిటి నుండి గౌరవ డాక్టరేట్‌ను పొందడమే కాక, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వ ఆస్థాన కవిగా కూడా తన శక్తిని ధారబోశారు.

దాశరథి గారి కలం నుండి ఉద్భవించిన కొంత విప్లవ సాహిత్యాన్ని పరిశీలిద్దాం..

ఓ నిజాము పిశాచమా, కానరాడు నిన్ను బోలిన రాజు మాకెన్నడేని తీగలను తెంపి అగ్నిలో దింపినావు నా తెలంగాణ కోటి రతనాల వీణ.

పడతుల మానాలు దోచి గుడ గుడ మని హుక్క త్రాగి జడియక కూర్చుండినావు మడి కట్టుక నిలిచినావు దగాకోరు బడాచోరు రజాకారు పోషకుడవు.!

వూళ్ళకూళ్ళు అగ్గిపెట్టి తల్లిపిల్ల కడుపుకొట్టి నిక్కిన దుర్మార్గమంత నీ బాధ్యత నీ బాధ్యత ”కోటిన్నర” నోటివెంట పాటలుగా, మాటలుగా దిగిపొమ్మని, దిగిపొమ్మని ఇదే మాట అనేస్తాను.!

వద్దంటే గద్దె యెక్కి పెద్దరికం చేస్తావా! మూడుకోట్ల చేతులు నీ మేడను పడదోస్తాయి మేడను విడదీస్తాయి నీకు నిలుచు హక్కులేదు నీ కింకా దిక్కులేదు.!

‘‘వీరంగం వేస్తుంటే రాదు విప్లవం తారంగం పాడుతుంటే రాదు సమరథం అందుకే నేనంటాను ఏ లేహ్యం తిన్నా గాని రాదు యౌవనం’’

ఎముకల్ మసిచేసి పొలాలు దున్ని భోషాణములన్ నవాబునకు స్వర్ణము నింపిన రైతుదే తెలంగాణము రైతుదే.

పిచ్చుకపై బ్రహ్మాస్త్రం వేసే వారున్న నాడు అవనిపైన శాంతి లేదు అని సేయుట ఆగిపోదు..

ఎంత వినాశం జరిగెను? ఎందరి అసువులు పోయెను! బ్రతికి ఉన్నవారి యెదల చితులెన్ని రగుల్కొనెను!

ఇంకుతున్న మానవుడా! ఇంకనైన మెల్కాంచు! తుపాకీల హతం చేసి కృపాకీల వెలిగించు!

ధాన్యం తరిగే వేళ సైన్యం పెరిగే నేల సైనికుడే సైరికుడై సాగుచేయవలె నేల!

తిమిరంతో ఘన సమరం జరిపిన బ్రతుకే అమరం.

ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో భూగోళం పుట్టుక కోసం రాలిన సుర గోళాలెన్నో..

ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో ఒక రాజుని గెలిపించుటలో ఒరిగిన నర కంఠములెన్నో కుల మతాల సుడిగుండాలకు బలియైన పవిత్రులెందరో..

మానవ కళ్యాణం కోసం పణమెత్తిన రక్తము ఎంతో రణరక్కసి కరాళ నృత్యం రాచిన పసి ప్రాణాలెన్నో కడుపు కోతతో అల్లాడిన కన్నులలో విషాదమెంతో భూస్వాముల దౌర్జన్యాలకు, ధనవంతుల దుర్మార్గాలకు దగ్ధమైన బతుకులు ఎన్నో..

అన్నార్తులు అనాథలుండని ఆ నవయుగమదెంత దూరం కరువంటూ కాటకమంటూ కనిపించని కాలాలెపుడో పసిపాపల నిదుర కనులలో ముసిరిన భవితవ్యం ఎంతో గాయపడిన కవి గుండెలలో రాయబడని కావ్యాలెన్నో..

‘నిప్పులోంచి అపుడపుడు పొగ పడుతుంది నీటిలోంచి విద్యుత్తను సెగపుడుతుంది ఈ దానవ లోకంలో ఎన్నటికైనా మానవులని పిలవదగిన తెగ పుడుతుంది'.

‘‘ఎవడైనా మానవుడే ఎందుకు ద్వేషించడాలు? రాక్షసినైనా మైత్రికి, రానిత్తును భయంలేదు’’.

‘ఆనాదిగా జరుగుతోంది అనంత సంగ్రామం ఆగర్భ శ్రీమంతుడికీ అనాథుడికీ మధ్య, మలేరియాకు క్వినైన్‌ మందు మధ్యయుగాల జాగీర్దార్‌ విధానానికి మన తిరుగుబాటు మందు’.

‘విప్లవమంటే మృత్యువు-విలయతాండవం కాదు విప్లవమంటే బాంబుల వికటాట్టహాసం కాదు విప్లవమంటే రక్తం వెదజల్లుట కాదర్రా.. పీన్గుల గుట్టల నుండి విప్లవాలు రావర్రా ప్రజలను మేల్కొలపాలి నిజమేదో తెల్పాలి హృదయాల్లో విప్లవాలు ఎదగాలి’.

‘‘నా పేరు ప్రజా కోటి, నా ఊరు ప్రజావాటి’’